బీపీకి ధ్యానమే మాత్ర
ఒత్తిడికి సంబంధించిన అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రెషర్) మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదా? అయితే నిత్యం 45 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. అంతేకాదు పొగతాగే అలవాటు మానుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం కూడా తప్పనిసరి. ధ్యానం, వ్యాయామం లాంటి ‘శరీరం మనసు’కు సంబంధించిన జీవనశైలి మార్పులు కూడా బీపీ నివారణలో మంచి ఫలితాలనే ఇస్తాయట. ఈ విషయాన్ని ‘ది ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హైపర్టెన్షన్’ వెల్లడించింది. ‘ఇలాంటి చర్యలు గుండె కవాట వ్యవస్థపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి’ అంటారు ప్రొఫెసర్ బ్రయాన్ విలియమ్స్. ఈయన ఈ అధ్యయనం సహ-రచయిత. కాబట్టి రోజుకు కనీసం అరగంట ధ్యానానికి కేటాయించుకోవాలి. ఇంకా సంగీతం విన్నా, నడకకు వెళ్లినా, వ్యాయామం చేసినా మంచిదేనని చెబుతారు.
వ్యాయామంతో అనారోగ్యం పరార్!
గంటలకొద్దీ కూర్చుని పనిచేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే సైక్లింగ్, చిన్నచిన్న వ్యాయామాలు, తోటపని లాంటి వాటిని రోజుకు కనీసం 20-25 నిమిషాల పాటు చేసినా అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయనం దీనిని వెల్లడించింది. కాగా, ఈ పరిశోధన కోసం 50 ఏండ్లు, ఆపై వయసు కలిగిన పన్నెండు వేల మందిని ఎంచుకున్నారు. ఎంతసేపు కూర్చుని పనిచేసినా ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామాలు చేస్తే అనారోగ్యాల బారినుంచి తప్పించుకోవచ్చనేది ఈ పరిశోధన సారాంశం.
బాల్యపు బాధలతోనూ తలనొప్పి?
మీరు తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా? అయితే, అది మీ రోజువారీ పని ఒత్తిడి వల్ల వచ్చి ఉంటుంది. లేదంటే, గతంతో ముడిపడినదై ఉంటుంది. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం బాల్యంలో నిరంతరం తిట్లు తినడం, నిర్లక్ష్యానికి గురికావడం, కుటుంబ వాతావరణం బాగాలేకపోవడం లాంటి పరిస్థితుల్లో పెరిగిన వాళ్లు పెద్దయ్యాక తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందట. అందుకే ఈ అధ్యయనంలో ముఖ్య పాత్ర పోషించిన కాథరిన్ క్రీట్సోలన్… ‘చిన్ననాటి బాధాకరమైన సంఘటనలు తర్వాత కాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి’ అంటారు. వీటిలో పార్శపునొప్పి, ఒత్తిడితో వచ్చే తలనొప్పి, దీర్ఘకాలిక తలనొప్పి లాంటి వివిధ రకాలైన తలనొప్పులు ఇమిడి ఉంటాయి. కాగా, పరిశోధనలో భాగంగా 19 దేశాలకు చెందిన 1,54,739 మందిమీద మెటా అనాలసిస్ చేశారు. బాల్యంలో ఇబ్బందికరమైన పరిస్థితిని అనుభవించినవారు మిగిలిన వారితో పోలిస్తే 48 శాతం ఎక్కువగా తలనొప్పిని ఎదుర్కొనే ముప్పు ఉందని ఈ అధ్యయనంలో తేలింది.