దసరా సెలవులు వస్తున్నాయంటేనే మా సంతోషానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. మూడు నెలల పరీక్షలు ముగిశాయంటే.. మా ఆనందాల గది తాళం తీశామన్నట్టే! అప్పటికే మా స్నేహితులు “మేము రేపు మా అమ్మమ్మగారింటికి పోతున్నం!” అనో.. “మేము ఇవాళ్లే బస్సు ఎక్కుతున్నం!” అనో చెప్పేవారు.
మేమేం తక్కువా?! ఇంటికొచ్చింది మొదలు.. “అమ్మా! మనమెప్పుడు పోదాం?!” అని వెంటబడేవాళ్లం. “ఉండండి.. మనకు బండి రావొద్దా?!” అనేది అమ్మ. అప్పటికే బట్టలు సర్ది ఉంచేది గానీ, ఆ విషయాన్ని మావద్ద వీలైనంత రహస్యంగా ఉంచేది. అక్కా, నేనూ యథాశక్తిగా మాకు సంబంధించిన వస్తువులు (మా అమ్మ, నాన్న మాకు కొనిచ్చినవి.. మా కజిన్స్‌కు కొత్తగా చూపించాలనుకున్నవి) వేరే సంచిలో సర్దేవాళ్లం. దసరా సెలవులు అంటేనే బమ్మెర. బతుకమ్మ పండుగ తొలిరోజు పెతరమాస మర్నాడే.. బమ్మెర నుంచి పెదనాయన సవారీ కచ్చడం పంపేవారు. అప్పటికే హైదరాబాద్ నుంచి పద్మమ్మ చిన్నమ్మ, హైమక్క, లక్ష్మి, గిరిజ వచ్చి ఉండేవారు. ఒక్కోసారి వాళ్లు హైదరాబాద్ నుంచి రైలులో కాకుండా కారులోనే వస్తే.. మా ఊర్లో ఆగి భోజనం చేసి.. అక్కనూ, నన్నూ వాళ్ల కారులోనే తీసుకెళ్లేవారు. మరో రెండురోజులకు అమ్మ వచ్చేది. అంబాసిడర్ కారులో వాళ్లతో వెళ్లడం గొప్పగా అనిపించేది మాకు. ముఖ్యంగా మళ్లీ బళ్లు తెరిచాక మా స్నేహితులతో చెప్పుకోవడానికి అన్నమాట! రోడ్డు బాగా లేకపోవడం వల్ల ఆ కారు కూడా ఇప్పగూడెం వరకే వెళ్లేది. అక్కణ్నుంచి మళ్లీ కచ్చడంలోకి మారేవాళ్లం.
ఇక అమ్మా, మేమూ కలిసి వెళ్తేమాత్రం.. టైంకు తయారై గడ్డిపైన జంపఖానా పరిచిన సవారీ కచ్చడంలో ఎక్కడం తప్ప, అమ్మకు ఎలాంటి సహాయం చేయని, చేయాలనే ఆలోచనరాని ఆజాదీ కాలం అది. ఇంట్లో బయల్దేరే ముందే భోజనాలు చేసేవాళ్లం. ఎందుకంటే అప్పటి రోజుల్లో సాయంత్రమైతే ప్రయాణం చేసేవాళ్లు కాదు. బండి వాడికి కడుపునిండా భోజనం పెట్టేది అమ్మ. ఇప్పగూడెం దాకా వెళ్లగానే అక్కడ నిమ్మలోళ్ల బావి దగ్గర ఆగేవాళ్లం. అక్కడ దట్టమైన చెట్ల నీడ ఉండేది. ఒక ఆయిల్ మోటార్ పంపు నుంచి నీళ్లు వస్తుండేవి. వెంట తీసుకొచ్చిన డబ్బాలోంచి గోధుమ రొట్టెలు తీసేది అమ్మ. మేము అవి తిని మరచెంబులో నీళ్లు తాగేవాళ్లం. ఇక ఇప్పగూడెం దాటగానే రోడ్డు అంతగా బాగుండక పోయేది. వర్షాలకు నీటి గుంటలు ఎక్కడున్నాయో తెలియక పోయేది. సాయంత్రం చీకటిపడే వేళకు ముందే బమ్మెర చేరుకునే వాళ్లం. ఎద్దుల మెళ్లో గజ్జెల చప్పుడు వినగానే, మా కజిన్స్ అందరూ బురుజు ముందుకు వాకిట్లోకి పరిగెత్తుకొని వచ్చి.. “కచ్చడం ఒచ్చింది! సీనేపెల్లి ఆయమ్మ ఒచ్చింది! సంధ్యక్క, రమక్క వచ్చిండ్రు” అని సంతోషంతో ఎగురుతూ బండి దగ్గరికి వచ్చేవాళ్లు. అంతే.. మరో పావుగంటలో మేము ఆటల్లో మునిగిపోయేవాళ్లం.
బమ్మెర గడీలో దేవీ నవరాత్రులను చాలా వైభవంగా జరిపేవారు. దానికోసం ఎక్కడెక్కడినుంచో భాగవతం, రామాయణం, భారతం పారాయణం చేసే పండితులు వచ్చేవాళ్లు. వాళ్లకు భోజనం, విడిది లాంటి అన్ని సౌకర్యాలు కల్పించేవాళ్లు. వంటలకు వైష్ణవ అయ్యగార్లు వేరే ఉండేవాళ్లు. మేము లోపలికి వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు. మాలాంటి పిల్లలకు పొద్దున్నే ఇప్పటిలాగా ఇడ్లీలు, వడలు, దోసెలు కాకుండా.. ఏ కిచిడీయో, ఉప్మానో చేసి చాయ్‌ల అర్రలో పెట్టేవాళ్లు. మేము అవి తిని ఆటల్లో పడేవాళ్లం. ఇక భోజనాలు మాత్రం పూజలూ, ఆరగింపులూ అయ్యాక మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు పెడుతుండేవాళ్లు.
దసరా రోజు మేము సాయంత్రం తొందరగా కొత్త బట్టలు వేసుకుని మిద్దెమీదికి వెళ్లి చూసేవాళ్లం. ఊర్లో దాదాపు సగంమంది గడీ ముందు ఉండేవారు. ఒక పెద్ద గొర్రెను తీసుకొచ్చి కొద్దిసేపు ఒకరిద్దరు వీరంగం వేశాక.. ఒకాయన పెద్ద కత్తితో గొర్రె తలను ఒక్క వేటుతో నరికేవాడు. మేము కెవ్వుమని కళ్లు మూసుకునేవాళ్లం. ఆ తర్వాత రక్తాన్ని అందరు యువకులు ఒంటికి పూసుకొనేవారు. కొంతమంది పెద్ద దర్వాజాకు తెచ్చి రక్తం అంటించేవారు. ఆ తర్వాత రోజుల్లో జంతుబలి నిషేధించాక.. అలా గొర్రెను కోయడం మానేశారు. మా ఊర్లో దసరా జరిగేటప్పుడు నాన్న వెళ్లేవాడు. పోలీస్వాళ్లు కూడా వచ్చేవారు. కొన్నిసార్లు మమ్మల్ని కూడా వెంట తీసుకొని వెళ్లేవాడు. అక్కడ ఊరి మధ్యలో మా ఇంటి ముందున్న బురుజు ముందు ఒక యాటను కోసేవారు. మా ఇంటి నుంచి పెన్నులను ఇచ్చేవాళ్లం. నాన్న పెన్నుతోపాటు మా పెన్నులకు కూడా కంకణం కట్టి పూజ చేసేవారు. మా ఊరి చెరువు కట్టమీదనే జమ్మి చెట్టు ఉండేది. అక్కడికి పోయి జమ్మి ఆకులు తెంపి.. పూజ చేసి అందరికీ పంచిపెట్టేవారు. కొందరు పాలపిట్టను చూశాకే ఇంటికి వెళ్లేవారు.
ఇంటికి వచ్చాక మేము నాన్నను పీటమీద కూర్చోబెట్టి మంగళ హారతి పట్టేవాళ్లం. నాన్న పళ్లెంలో డబ్బులు వేసేవారు. దాన్ని దసరా మంగళ హారతి అనేవాళ్లం. ఆ రోజంతా అమ్మకు వంటింట్లోనే సరిపోయేది. నాన్న పనివాళ్లందరికీ పిండివంటలతో భోజనం పెట్టించేవాడు. ఒకసారి నాన్నవెంట మేము చెరువుకట్టకు వెళ్లినప్పుడు ఓ సంఘటన జరిగింది. ఇద్దరు యువకులు బాగా తాగి ఉన్నారేమో.. జమ్మి చెట్టు ఎక్కి చెరువు నీళ్లలో పడ్డారు. వెంటనే కొంతమంది వెళ్లి వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎవ్వరూ ఏమాత్రం కంగారు పడకుండా.. “రిమ్మ దిగినాదిర పిలగాండ్లు!?” అని అడిగారు వాళ్లను. ‘రిమ్మ’ అంటే ఏమిటని నాన్నను అడిగాను. “ఏదైనా కల్లు గానీ, సారాయి గానీ తాగినప్పుడు వాళ్లకు మత్తు వస్తుంది. ఏమవుతుందో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్లకు పూర్తిగా తెలియదు. అది నరాల మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని ‘నిషా’ అనీ, ‘రిమ్మ’ అనీ అంటారు. మత్తుపానీయం ఏదైనా.. ఆరోగ్యానికి మంచిది కాదు” అని నాన్న వివరంగా చెప్పాడు. తెలంగాణలో దసరానే పెద్ద పండుగ. మగవాళ్లు తప్పకుండా కొత్తబట్టలు కొనుక్కునే పండుగ. ‘దసరా అంటేనే ముక్క – చుక్క’ అని అంటారు. అయితే చాలారోజుల వరకు మాకు ఈ విషయం తెలియదు. ఇప్పుడైతే ఊరు ఊరంతా దసరా పండుగ రోజు ఊగిపోతుంది. మద్యం తాగని వాళ్లు మగవాళ్లలో దాదాపు ఉండరేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా.. దసరా మాత్రం మగవాళ్ల పండుగ అనిపిస్తుంది నాకైతే!