Virtual Test Drive | కొనే కారు కొత్తదైనా, పాతదైనా.. టెస్ట్ డ్రైవ్ మాత్రం తప్పనిసరి. అందులోనూ కారు కండిషన్ చూశాకే కొనాలా, వద్దా? అని నిర్ణయించుకుంటాం. కానీ ఈ మధ్య చాలామంది ‘ఫిజికల్ టెస్ట్‌డ్రైవ్’ లేకుండానే కొనుగోలు చేస్తున్నారు? అలా అని బండి కండిషన్ చూడకుండా గుడ్డిగా బేరం చేయడం లేదు. వర్చువల్ రియాలిటీతో అణువణువూ పరీక్షించాకే ఓ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఈరోజుల్లో కూడా కారు కండిషన్ తెలుసుకునేందుకు ఫిజికల్ టెస్ట్‌డ్రైవ్ ఏమిటి? చాదస్తం కాకపోతే? అందుకే చాలామంది కాలు కదపకుండానే, గడప దాటకుండానే.. తలకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్ తగిలించుకొని కారులోని ప్రతి భాగాన్నీ పరీక్షిస్తున్నారు. బాడీ బాక్స్ ఓపెన్ చేయకుండానే.. కారు పొట్టలో వైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేస్తున్నారు. సౌండ్ మొదలు.. మైలేజీ, బ్రేక్స్, సీటింగ్.. తదితరాలన్నీ వీఆర్ హెడ్సెట్లోనే బేరీజు వేస్తున్నారు. వీఆర్ టెస్ట్‌డ్రైవ్ నచ్చితేనే.. ఆ మరుసటి రోజే కారు బుక్ చేసుకుంటున్నారు. షోరూమ్‌కు వెళ్లి, కారు మోడల్ చూసుకొని, తాళాలు తీసుకొని.. కొన్ని కిలోమీటర్లు టెస్ట్‌డ్రైవ్ చేసే పాత చింతకాయ పద్ధతికి స్వస్తి చెప్పారు. వీఆర్ హెడ్ సెట్‌ను పిక్ చేసుకోవడం, అందులో ఆప్షన్లు క్లిక్ చేసుకోవడం, టెస్ట్‌డ్రైవ్‌లో కారు చెక్ చేసుకోవడం.. నచ్చితే చెక్బుక్లో సంతకం పెట్టి కారు కొనేయడం.. అంతే. ఖేల్ ఖతమ్!
‘ఆటో గేర్ షిఫ్ట్ ఇండియా 2020’ నివేదిక ప్రకారం.. ప్రతి పదిమంది కారు కొనుగోలు దారులలో 9 మంది వీఆర్ టెక్నాలజీ టెస్ట్డ్రైవ్నే ఎంచుకుంటున్నారట. వీఆర్ డ్రైవ్‌లో కారు పనితనం నచ్చితే.. ఆ మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారట. ఈ ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లో కార్ల కొనుగోళ్లు 33శాతం పెరిగినట్లు గుర్గావ్కు చెందిన వర్చువల్ ఫ్రీ-ఓనర్ కార్సేల్స్ కంపెనీ ‘కార్జ్సో’ సీయీవో వైభవ్ శర్మ చెబుతున్నారు. ‘యూజ్డ్ కార్’ అనే స్టార్టప్ వీఆర్ టెక్నాలజీని ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాలు, టైర్ 3 నగరాల్లోని ఫోర్ వీలర్స్ కస్టమర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఇండియాలోని తన 30 వేల డీలర్షిప్ షోరూములలో దాదాపు 4వేల షోరూమ్‌లను ఆన్‌లైన్‌లోకి మార్చేసింది. 2022 చివరినాటికి ప్రతి ఒక్కరూ నాలుగు దశల్లో జరిగే 360-డిగ్రీల వీఆర్ టెస్ట్డ్రైవ్నే ఎంచుకుంటారని ఆటోమొబైల్ పండితుల అంచనా. ఇప్పటివరకు వీఆర్ టెస్ట్‌డ్రైవ్ చేసిన వారంతా.. ప్రత్యక్షంగా కారు నడిపిన అనుభూతిని పొందామని, షోరూమ్‌లో కూడా ఇలాంటి కొత్త ఆనందం దొరకదని అంటున్నారు.
2020 ప్రారంభంలో కరోనా కారణంగా ఆటోమొబైల్ రంగం ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నది. లాక్డౌన్లో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో వ్యాపారాన్ని పెంపొందించుకునే క్రమంలో వీఆర్ టెక్నాలజీని ఉపయోగించి కార్ టెస్ట్‌డ్రైవ్ చేసేలా సాంకేతికతను రూపొందించారు. వర్చువల్ టెస్ట్‌డ్రైవ్ ద్వారా కార్లను కొనడం అమెజాన్ నుంచి వస్తువులను కొనుగోలు చేసినంత సులభంగా మారింది. సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. కార్జ్సో వంటి సంస్థలు వర్చువల్ టెస్ట్‌డ్రైవ్ ముగిసిన తర్వాత కస్టమర్ల కోరికమేరకు భౌతిక పరీక్షకు కూడా అంగీకరిస్తున్నాయి. ఈ ట్రెండ్ పుణ్యమాని.. వీఆర్ హెడ్సెట్ల తయారీ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు విదేశీ ఇన్వెస్టర్లు. భవిష్యత్తులో టెక్నాలజీ మరిన్ని మలుపులు తీసుకోవడం ఖాయం. హెడ్‌సెట్‌తో కారు నడపడమే కాదు.. ఇష్టమైన వ్యక్తితో కలిసి ప్రయాణిస్తున్న అనుభూతిని కూడా పొందే రోజు దగ్గర్లోనే ఉంది.
♦ కార్జ్సో, యాజ్డ్కార్ (మెటావర్స్) వంటి వెబ్సైట్లలోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాలి.
♦ సైట్ ఓపెన్ చేయగానే పలు రకాల కంపెనీల కార్ల వివరాలు కనిపిస్తాయి.
♦ నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకొని ‘బుక్ ఏ టెస్ట్‌డ్రైవ్’పై క్లిక్ చేయాలి.
♦ మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా మీ ఇంటి వద్దకే ‘Oculus VR’ హెడ్సెట్ల సెట్‌ను పంపుతారు.
♦ వాటిని ధరించి హెడ్సెట్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే చాలు.. 360 డిగ్రీల జూమ్ వ్యూ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
♦ దాంతో కారు ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ చెక్ చేసుకోవచ్చు. కారులోని అణువణువూ పరీక్షించుకోవచ్చు.
♦ వీడియోగేమ్ ఆడినట్టుగా మీరే నడుపుతున్న అనుభూతిని పొందవచ్చు. సౌండ్‌ను కూడా స్పష్టంగా ఆస్వాదించవచ్చు.
ఈ పదేండ్లలో పుట్టుకొచ్చి పాపులర్ అయిన ఈ పదాల గురించి ఐడియా ఉందా?
Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!
ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!