Words | ‘ఎవరో ఒకరు సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయ్? వేసెయ్ ఓ వీరతాడు’ అంటారు ఎస్వీ రంగారావు ‘మాయాబజార్’లో. ఆ మాటా నిజమే. కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు, కొత్త సంబంధాలు, కొత్త ఆలోచనలు .. కొత్త పదాలను పుట్టిస్తున్నాయి. అందులో కొన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఎక్కుతున్నాయి. దాదాపుగా ఈ దశాబ్దంలోనే పాపులర్ అయిన కొన్ని పదాల పరిచయం..
తొంభైల నాటివాళ్లకు ఇది అనుభవంలో లేదు. ఇంటర్నెట్లో వీడియోలు చూడటం 2005 నుంచీ పెరిగింది. వీడియోలాగ్ నుంచి వ్లోగ్ అనే పదం వచ్చింది.
ఒకప్పుడు బెస్టీ అంటే కలిసి చదువుకున్నవారు, కలిసి ఆడుకున్నవారే. ఇంటర్నెట్ వచ్చాక నేరుగా ఎన్నడూ కలుసుకోని వాళ్లు కూడా బెస్టీలు అవుతున్నారు.
సంబంధిత సమాచారాన్ని సోషల్ మీడియా అంతా వెతికి తెస్తుంది హ్యాష్ ట్యాగ్. అంతేకాదు సోషల్ మీడియా ట్రెండింగ్‌ను, సోషల్ మీడియాలో నెటిజన్ల కోలాహలాన్నీ సూచిస్తుంది.
ఫోన్ చేతిలో లేకపోయినా, ఫోన్ దొరక్కపోయినా, ఫోన్ తీసుకెళ్లడం మరిచిపోయినా కలిగే అసౌకర్యం, ఆందోళనను నోమోఫోబియా (నో మొబైల్ ఫోబియా) అంటారు. నోటిఫికేషన్ లేకపోయినా, ఫోన్ ఓపెన్ చేయాలనే ఆత్రుతని కూడా నోమోఫోబియా అంటారు.
ఇంటర్నెట్ ద్వారా రేడియో కార్యక్రమాలను శ్రోతలకు చేరవేయడం. పాడ్‌కాస్ట్‌లో రికార్డ్ చేసిన కార్యక్రమాలు, లైవ్ కార్యక్రమాలను ప్రసారం చేయవచ్చు. పాడ్‌కాస్ట్ ద్వారా ఇంటర్నెట్ రేడియోను ఎవరైనా నిర్వహించవచ్చు.
టీవీ, ఇంటర్నెట్లో వెబ్ షోలను గంటల తరబడి చూడటాన్ని ‘బింజ్ వాచ్’ అంటున్నారు.
కాళ్లను చాపి.. పక్కన కూర్చున్న వారికి, చూసేవారికి కూడా అసౌకర్యం కలిగించడాన్ని మ్యాన్ స్ప్రెడ్ అంటారు.
సోషల్ మీడియాలో ఫ్రెండ్‌ను అన్‌ఫ్రెండ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లా పనిచేసే ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా బ్రేకప్ చెబితే దాన్ని అన్‌ఫ్రెండ్ అంటారు.
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఒకరితో బ్రేకప్‌లో ఉన్న కాలాన్ని అన్‌ఫాలో అంటారు.
ఫొటో ప్రేమ్‌లో పర్ఫెక్ట్గా వస్తుందనుకున్నప్పుడు సడన్‌గా ఎవరో ఒకరివల్ల మొత్తం ఖరాబైపోతుంది. ఇలా ఆటంకపరిచే వాళ్లను ఫొటో బాంబర్ అంటారు.
బడాయికి పోయినప్పుడు ఎదుటివాళ్ల ముందు కొన్ని ప్రగల్భాలు పలకాల్సి వస్తుంది. వీటిని ఈ తరం ‘ఫ్లెక్స్’ అంటున్నది.
స్మార్ట్ఫోన్ల రాకతో సెల్ఫీ ట్రెండ్ మొదలైంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 2013లో దీన్ని ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది.
ప్రేమికులు, దంపతులు మరెవరైనా.. శృంగార భావాలను టెక్ట్స్ చాటింగ్, వాయిస్ కాల్, వీడియో కాల్ ద్వారా పంచుకోవడం.
తనకంటే ఎక్కువ అర్హతలు ఉన్న ఆడవాళ్లతో పరిచయానికి ఇష్టపడే మగవాళ్లు.. ఏదైనా విషయం గురించి వివరించే ప్రయత్నం. ఇలాంటివాళ్లను ‘మాన్స్ప్లెయినర్’ అంటారు.