Ashish Vidhyarthi | కరోనాకు ముందు అతనో నటుడు. పదకొండు భాషల చిత్రాల్లో నటించి.. తనేమిటో, తన ప్రతిభ ఏమిటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు, దేశంలో ఇరవైమూడు భాషలు మాట్లాడేవారి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర విశేషాలను అధ్యయనం చేస్తున్న నిత్య విద్యార్థి. వ్లాగర్‌గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. ఫుల్‌చార్జ్ అయిన డ్రోన్లా దూసుకెళ్తున్నాడు.. ఆశిష్ విద్యార్థి.
ఆశిష్ విద్యార్థి.. వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు. నిజానికి, విలనిజానికి చిరునామా. ముఖంలో నవరసాలను పలికించగల అతికొద్దిమంది నటులలో ఒకడు. నాన్న మలయాళీ, అమ్మ రాజస్థాన్‌లో పెరిగిన బెంగాలీ. తను పుట్టిందేమో ఢిల్లీలో. దాదాపు 33 ఏండ్లనుంచి వెండితెరపై వెలుగుతున్న ఆశిష్.. 11 భాషల సినిమాల్లో విభిన్న పాత్రలు చేశాడు. ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. అయితే, కరోనా ఆశిష్ విద్యార్థి జీవితాన్నే మార్చివేసింది. మొదటి లాక్డౌన్ తర్వాత జీవితాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టాడు. ‘మహమ్మారి వల్ల ఉన్నపళంగా చనిపోతే ఎలా?’ అన్న ఆలోచన వెంటాడింది, వేధించింది. అంతే, వ్లాగర్‌గా కొత్త అవతారం ఎత్తాడు.
ఇంకా మిగిలి ఉన్న జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాడు ఆశిష్ విద్యార్థి.. ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి ఓ కొత్త ప్రాంతానికి వెళ్తుంటాడు. అక్కడ వింతలు, విశేషాలు ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు, వస్త్రధారణ, ప్రయాణం, సరుకురవాణా, చెట్లు, పుట్టలు, పండ్లు, ఫలహారాలు, ఆటలు, పాటలు.. ప్రతీది పంచుకుంటాడు. ప్రతి విషయాన్ని కొత్త పద్ధతిలో చెబుతూ వీక్షకులను ఆకట్టుకుంటాడు. ఇలా కేరళ నుంచి కాలిఫోర్నియా వరకూ ఎన్నో ప్రదేశాలు చుట్టివచ్చాడు. ఒక్కసారి తన వ్లాగ్ వీడియోలు చూస్తే.. నేటి తరం వ్లాగర్స్కు గట్టిపోటీ ఇస్తున్నాడని అర్థమైపోతుంది.
‘నా దైనందిన జీవితాన్ని కెమెరా లెన్స్‌తో సరికొత్తగా ప్రారంభించాను. నాలో సరికొత్త ప్రతిభను వెలికితీసిన లాక్‌డౌన్‌కు ధన్యవాదాలు’ అంటాడు ఆశిష్ విద్యార్థి. తన ప్రయాణంలో భిక్షాటన చేసేవారి నుంచి.. బిలియనీర్ల వరకూ ఎందరినో కలిశాడు. అన్ని రకాల జీవితాలనూ దగ్గరగా పరిశీలించాడు. ఆ అపురూప క్షణాలను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ప్రతిరోజునూ సరికొత్తగా ఆస్వాదిస్తున్నాడు. 56 ఏండ్ల వయసులో చాలామంది విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ఆశిష్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు.
ఆశిష్ విద్యార్థి తెలుగు రాష్ర్టాల్లోని అన్ని రుచులనూ ఆస్వాదించాడు. పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. హైదరాబాద్ బిర్యానీ, రాయలసీమ రాగిముద్ద నుంచి సిమ్లా ఆపిల్ వరకూ ప్రతీది రుచిచూశాడు. బెంగళూరు ‘రాగిముద్దె’, చెన్నై కారప్పొడి సాంబార్, చెట్టినాడ్ చాయ్, బహ్రెయిన్ చికెన్ ఫ్రై, కేరళ నుంగు (తాటిముంజలు, పంచదార పాకంతో చేసేది), మంగుళూరు దోసెలు అబ్బో.. ఒకటేమిటి ఎక్కడ విభిన్నమైన వంటకం ఉందని తెలిసినా వెళ్లి మరీ రుచి చూసి, ఆ విశేషాలు పంచుకుంటున్నాడు. స్థానికులతో స్నేహం పెంచుకొని ఆ వంటలు నేర్చుకుంటున్నాడు. అలా షూట్ చేసిన వీడియోలను Ashish Vidyarthi Actor Vlogs అనే యూట్యూబ్ చానెల్లో పోస్టు చేస్తుంటాడు. ఇప్పటికి అతనికి మూడున్నర లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఇంతకుముందు షూటింగ్‌కు వెళ్లినప్పుడు దార్లో ఏవైనా కొత్తగా కనిపిస్తే.. మనసారా ఆస్వాదించేవాడు. లాక్డౌన్ తర్వాత పల్లెల నుంచి ఫారిన్ వరకు చుట్టొస్తున్నాడు. మొత్తానికి సరిహద్దులు లేని యాత్రికుడిలా ప్రపంచాన్ని చుట్టివస్తూ.. కొత్త విషయాలు పంచుకుంటున్నాడు.
ఆశిష్ విద్యార్థి ఇటీవల హారర్ కథల ఆధారంగా ఓ పాడ్‌కాస్ట్ సిరీస్ ప్రారంభించాడు. ‘కహానీ ఖతర్నాక్ గోయీ’ అనే శీర్షికతో ఈ కథలన్నీ తనే వివరిస్తున్నాడు. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఉంటుంది. తనకు బాగా ఇష్టమైన ప్రదేశాలు కేరళ, స్కాట్లాండ్, కాలిఫోర్నియా. ఇష్టంగా ఆరగించే భారతీయ రుచుల జాబితాలో పంజాబీ, బెంగాలీ, చెట్టినాడ్, తెలుగు వంటలున్నాయి.
“ఇక్కడ పవన్ కళ్యాణ్.. అక్కడ అజిత్.. ఆ ఒక్కటీ త్యాగం..”
ఎఫ్ 3 సినిమాకు ఊహించని పోటీ.. బరిలోకి పాన్ ఇండియన్ సినిమా..”
Vikramaditya | తేజ విక్రమాదిత్య సినిమాలో హీరో ఎవరో తెలుసా..?”
Samantha | ఆ పదాన్ని ఎలా వాడతారు..నెటిజన్‌పై సమంత ఫైర్”