Allu Arjun | టాలీవుడ్లో స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘గంగోత్రి’తో సినీ ప్రయాణం ప్రారంభించిన బన్నీ, ఆరంభంలో లుక్‌పై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఎంత ఎదిగినా వినయంతో ఉండటం, అభిమానులతో సన్నిహితంగా మెలగటం ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఇటీవల ఫ్యాన్స్‌తో నిర్వహించిన మీట్లో కూడా ఎలాంటి స్టార్ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా వ్యవహరించారని అభిమానులు చెబుతుంటారు. అలాంటి అల్లు అర్జున్‌పై తాజాగా వచ్చిన ‘ప్రోటోకాల్’ వివాదం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఇటీవల నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది. అందులో అల్లు అర్జున్ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. మీడియా ప్రతినిధులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కోసం రూపొందించిన ప్రోటోకాల్ అని చెబుతూ, “కళ్లలోకి నేరుగా చూడకూడదు, షేక్‌హ్యాండ్ చేయకూడదు, అనుమతి లేకుండా మాట్లాడకూడదు, మధ్యలో కదలకూడదు” వంటి పలు నియమాలు ఉన్నట్లు వీడియోలో పేర్కొన్నారు. దీంతో కొందరు నెటిజన్లు సెటైర్లు వేయగా, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ ప్రారంభించారు. ఈ ప్రచారానికి కారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ మాజీ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు నిలిచాయి. ఆమె మాట్లాడుతూ, అల్లు అర్జున్ను కలిసే ముందు తమ బృందానికి నిబంధనల జాబితా ఇచ్చారని, పలువురు మేనేజర్ల ద్వారా వెళ్లాల్సి వచ్చిందని, ఫొటోషూట్ సమయంలో కూడా కఠిన నియమాలు పాటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది.
విషయం చర్చనీయాంశం కావడంతో అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవాస్తవమని స్పష్టం చేసింది. “అల్లు అర్జున్ ఎల్లప్పుడూ అందరి పట్ల గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై పరువు నష్టం కేసు వేయడానికి మా లీగల్ టీమ్ సిద్ధంగా ఉంది. ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయొద్దు” అని పేర్కొంది.ఈ ప్రకటనతో అయినా సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్లు తగ్గుతాయా అన్నది చూడాలి. అయితే సినిమాల వల్ల కాకుండా ఒక వైరల్ వీడియో కారణంగా అల్లు అర్జున్ వార్తల్లో నిలవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.