Teja Vikramaditya | ఫిబ్రవరి 22న సీనియర్ దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో ఒకటి సురేశ్ బాబు చిన్న కొడుకు, రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తూ చేస్తున్న అహింస. ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. నువ్వు నేను సినిమాను నిర్మించిన ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై అహింస సినిమాను నిర్మాత కిరణ్ నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే దీంతో పాటు మరో సినిమాను మొదలు పెట్టాడు తేజ. ఆ సినిమా పేరు విక్రమాదిత్య. తాజాగా విడుదలకు సిద్ధమైన రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు అదే. దాంతో విక్రమాదిత్య పేరు బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇదే పేరుతో తన సినిమా టైటిల్ గా పెట్టుకున్నాడు తేజ.
1836వ సంవత్సరంలో సాగే కథ ఇది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌గా వస్తున్న ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయం మాత్రం పోస్టర్లు చెప్పలేదు తేజ. ఎవరో కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నాడని మాత్రం తెలుసు. అయితే ఆ కొత్త వాళ్లు ఎవరు అనేది ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇందులో హీరోగా నటిస్తోంది ఎవరో కాదు.. స్వయంగా తేజ కొడుకు అమితవ్ తేజ. ఈ దర్శకుడికి ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి ఉన్నారు. అయితే చిన్న కుమారుడు ఆరవ్ తేజ 2011 డిసెంబర్లో అనారోగ్యంతో చనిపోయాడు.
కొడుకు మరణించడంతో చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు తేజ. ఇప్పుడు పెద్ద కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నాడు ఈయన. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. దాదాపు 200 సంవత్సరాల కింద సాగే ప్రేమకథ ఇది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. మంచి బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక నిపుణులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు తేజ. 20 ఏళ్ల కింద జయం సినిమా మొదలు పెట్టిన ముహూర్తానికే ఇప్పుడు విక్రమాదిత్య కూడా మొదలు పెట్టాడు. ఎంతో మంది కొత్త వాళ్లకు అద్భుతమైన కెరీర్ ఇచ్చిన తేజ తన వారసుడికి ఎలాంటి పునాది వేస్తాడో చూడాలి.