F3 vs Major | ఈ రోజుల్లో సినిమాలకు సోలో రిలీజ్ డేట్స్ దొరకడం చాలా కష్టం. పెద్ద సినిమాలకు కూడా పోటీ తప్పడం లేదు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న కూడా ఏదో ఒక సినిమాతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే సమ్మర్ సీజన్ అంతా ప్యాక్ అయిపోయింది. ఈ సమ్మర్లో దాదాపు 3 వేల కోట్ల బిజినెస్ జరగబోతుంది. మార్చి 11న రాధే శ్యామ్ నుంచి మొదలు పెట్టి జూన్ 10న అంటే సుందరానికి సినిమా వరకు అన్ని డేట్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. ఈ మధ్యలో కొన్ని సినిమాలు ఒక దానితో ఒకటి పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి. ఈక్రమంలోనే ఎఫ్ 3 సినిమా ఒక పాన్ ఇండియా సినిమాతో పోటీకి రెడీ అవుతుంది.
నిజానికి ఎవరితో పోటీ ఉండకూడదని సోలో రిలీజ్ డేట్ కోసం మూడు నాలుగు సార్లు విడుదల తేదీ మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ముందు ఫిబ్రవరి 25న ఈ సినిమాను విడుదల చేయాలి అనుకుంటే భీమ్లా నాయక్ వచ్చింది. అందుకే ఏప్రిల్ 28కి వెళ్లారు. కానీ అనూహ్యంగా చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 29కి రావడంతో.. మరో దారి లేక మే 27వ తేదీకి సినిమాను పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు సోలో రిలీజ్ చేసుకుందామని కలలు కంటున్న ఎఫ్ 3 నిర్మాతలకు మహేశ్ బాబు షాక్ ఇచ్చాడు. ఆయన నిర్మిస్తున్న మేజర్ సినిమా కూడా మే 27న విడుదల కానుంది.
అడవి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాకు గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకుడు. 2008 ముంబై దాడుల నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఎఫ్ 3 సినిమాకు మేజర్ నుంచి గట్టి పోటీ ఎదురవడం ఖాయం.