రోడ్డు లేని చిన్న పల్లెలో పుట్టాడు. పేదరికంలో పెరిగాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో పరుగు నేర్చాడు. ఫిట్నెస్ కోసం పరిగెత్తుతూ ఓ రోజు హైదరాబాద్ మారథాన్‌లో అడుగుపెట్టాడు. తన వేగం, సామర్థ్యం ఏమిటో అప్పుడు తెలుసుకున్నాడు! ఇక చిరుతలా పరిగెత్తుతూనే ఉన్నాడు. దేశంలో జరిగే మారథాన్లు, అల్ట్రా రన్ చాలెంజ్‌లలో గెలిచాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన లద్దాఖ్‌లో అల్ట్రా రన్ చాలెంజ్‌లు స్వీకరించాడు. మంచు కొండల్లో తన సత్తా చాటాడు. హిమాలయాలపై తెలంగాణ పోలీస్ జెండా పాతిన కానిస్టేబుల్ పిల్లి రాజు ‘జిందగీ’తో పంచుకున్న
విశేషాలు ఆయన మాటల్లోనే..
మా ఊరు కొష్టాల (వైరా మండలం, ఖమ్మం జిల్లా) చిన్న గ్రామం. సరైన రోడ్డు లేని ఊరది. నాన్న ప్రభుదాస్ కిరోసిన్ రేషన్ డీలర్. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు నాన్న చనిపోయాడు. మా అమ్మ మరియమ్మ ఆ డీలర్షిప్ తీసుకుని కిరోసిన్ అమ్ముతూ… ఇల్లు నడిపింది. పేదరికంలోనూ.. అమ్మ మా చదువుని ఆపలేదు. మా పక్క ఊరు తాటిపుడిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదివాను. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. కబడ్డీ బాగా ఆడేవాడిని.
ఏడో తరగతిలో ఉన్నప్పుడు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో ఆడాను. తొమ్మిదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో ఆడాను. నా ప్రతిభ చూసి శాప్ నన్ను ఎంపిక చేసుకుంది. మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. తర్వాత రాష్ట్ర జట్టుకి ఎంపికయ్యాను. జాతీయ స్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు కాలేజ్ గేమ్స్‌లో ఖమ్మం జిల్లా జట్టులో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మాకు మూడో స్థానం వచ్చింది. రాష్ట్ర స్థాయి ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్‌లో కేయూ జట్టు తరఫున ఆడాను. అందులో రన్నరప్‌గా నిలిచాం.
ఉస్మానియా నా ధైర్యం
చిన్నప్పటి నుంచి ఒంటరితనం నన్ను భయపెట్టేది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో చేరాక అది పోయింది. ఉస్మానియా క్యాంపస్‌లో అడుగుపెట్టాక ప్రపంచం అర్థమైంది. నలుగురిలో కలిసిపోయాను. సీనియర్స్ మాటలు, లైబ్రరీ చదువులు నాకు బాగా నచ్చేవి. అక్కడే ఈ ప్రపంచాన్ని చదివాను. క్యాంపస్‌లో ఉన్న రోజుల్లో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. నాకు లెక్చరర్ కావాలని కోరిక.
అందరూ చేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. మొదటి ఏడాదిలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాను. ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని, వదులుకోవద్దని అందరూ అంటే చేరాను. ఉద్యోగంలో చేరినా ఎంఏ పూర్తి చేశాను. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తిచేశాను. ఓసారి జేఎల్ రాశాను. తెలంగాణలో ఒకే పోస్ట్ ఉంది. ఒక్క మార్కుతో అది మరొకరికి దక్కింది. ఇంకో ప్రయత్నం చేయలేదు. కానిస్టేబుల్‌గానే ఉండిపోయాను.

హైదరాబాద్ టు ఆల్ ఇండియా
ఖమ్మంలో రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నా. రోజూ ఉదయం గ్రౌండ్‌కి వెళ్లేవాణ్ని. రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేసేది. ఇన్స్పెక్టర్ తిరుపతి రెడ్డి గారు మాతోపాటు రన్నింగ్ చేసేవారు. ఆయన మమ్మల్ని పది, పదిహేను, ఇరవై కిలోమీటర్లు పరిగెత్తించేవారు. ఓ రోజు.. హైదరాబాద్ మారథాన్ ఉందని, నువ్వు రావాలని తీసుకెళ్లారు. రెండు గంటల పది నిమిషాల్లో హాఫ్ మారథాన్ (21 కిలోమీటర్లు) పూర్తి చేశాను. అది చూశాక మారథాన్ రన్ గురించి అవగాహన వచ్చింది. గోవా మారథాన్ 2019లో ఫుల్ మారథాన్ పూర్తి చేశాను. అక్కడి నుంచి దేశం మొత్తం తిరిగొచ్చాను. ప్రతి నెలా ఒక హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ చేస్తున్నాను.
హైదరాబాద్, ముంబై మారథాన్లు చేశాను. ప్రొ కామ్ స్లామ్ మారథాన్ (ఏడాదిలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు మారథాన్లు పూర్తి చేయడం) నాలుగుసార్లు మెడల్స్ సాధించాను. పుణె నుంచి బారామతికి 100 కిలోమీటర్ల పరుగు జూలైలో పూర్తి చేశాను. దానికి కొద్ది రోజుల ముందు 70 కిలోమీటర్ల కేజీఎఫ్ అల్ట్రా పూర్తి చేశాను. అంతకుముందు చండీగఢ్ మారథాన్‌లో పాల్గొన్నాను. తమిళనాడులో యార్కాడ్ దగ్గర పశ్చిమ కనుమల్లో 60 కిలోమీటర్ల ‘బైసన్ అల్ట్రా రన్’ పూర్తిచేశాను. లునావాలాలో జరిగే 50 కిలోమీట్లర్ల ‘టాటా అల్ట్రా మారథాన్’ని రెండుసార్లు పూర్తిచేశాను. హైదరాబాద్ మారథాన్‌తో మొదలైన పరుగు ఆగకుండా నాలుగు వందలకుపైగా మారథాన్లలో విజయవంతంగా సాగిపోయింది!

Pilli Raju
ఆక్సిజన్ లేని చోట.. అల్ట్రా రన్
సాధారణ మారథాన్లు సిటీల్లో జరుగుతాయి. అల్ట్రా రన్లు కొండ ప్రాంతం, అటవీ మార్గాల్లో నిర్వహిస్తారు. ఇందులో 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరిగెత్తాల్సి వస్తుంది. ఈ చాలెంజ్ పూర్తి చేయాలంటే అధిక సామర్థ్యం ఉండాలి. అల్ట్రారన్ చేయడం చాలా కష్టం. ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. పావుగంటలో వైద్యం చేయకపోతే మరణిస్తారు. హిమాలయాల్లో మారథాన్ కత్తి మీద సాములాంటింది. ఒలింపిక్ రన్నర్స్ కూడా భయపడతారు. ప్రతికూలమైన లద్దాఖ్ మారథాన్ 2025లో పూర్తి చేశాను. ఇది సముద్ర మట్టానికి 17,865 మీటర్ల ఎత్తున ఉన్న లేహ్‌లో జరిగింది. అక్కడ చలి ఎక్కువ, ఆక్సిజన్ తక్కువ. సాధారణ గాలిలో ఉండే ఆక్సిజన్‌తో పోలిస్తే కార్దుంగ్ లా పాస్ ప్రాంతంలో గాలిలో ఆక్సిజన్ 35 శాతమే ఉంటుంది. అందుకని గత రికార్డులు పరిశీలించిన తర్వాతే రన్నర్స్‌ని ఎంపిక చేస్తారు.
ఒలింపిక్ మెడల్స్ గెలిచినా ఇందులో ఎంపికవ్వడం కష్టం. లద్దాఖ్ మారథాన్ పూర్తి చేయడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో జరిగే ‘కార్దుంగ్ లా చాలెంజ్ 2026’కి ఎంపికయ్యాను. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 250 మంది రన్నర్లు పాల్గొన్నారు. కార్దుంగ్ లా చాలెంజ్ కూడా అల్ట్రా రన్. ఇందులో 72 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. లేహ్‌కు పైన కార్దుంగ్ లా పాస్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ రన్ మొదలైంది. రాత్రి మూడు గంటలకు మైనస్ డిగ్రీల చలిలో పరుగు మొదలుపెట్టాను. ఎత్తుపల్లాల మంచుకొండలపై నా పరుగు సాగింది. పగలు ఎండ ఉన్నా చలి గాలులు తీవ్రంగానే ఉంటాయి. దీనిని కూడా విజయవంతంగా పూర్తి చేశాను. కార్దుంగ్ లా చాలెంజ్ పూర్తి చేసిన వాళ్లలో వందమందిని ‘సిల్క్ రూట్ అల్ట్రా రన్’కి ఎంపిక చేస్తారు. ప్రపంచంలో ఇదే టాప్! లద్దాఖ్‌లో 122 కిలోమీటర్లు పరిగెత్తాలి. నేను పూర్తి చేయాల్సిన పరుగులో ఇదొక్కటే మిగిలింది. 24 గంటల్లో ఈ చాలెంజ్‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా దీనిని కూడా పూర్తి చేస్తా.

మా ఆవిడే స్పాన్సర్
కానిస్టేబుల్ ఉద్యోగం. చిన్న జీతంపైన ఆధారపడ్డ జీవితం నాది. ఆస్తులు లేవు. కాబట్టి ప్రత్యేకమైన సమయాల్లో వ్యాయామం, శిక్షణ నాకు సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడు తీరితే అప్పుడు పరుగు ప్రాక్టీస్ చేస్తాను. నాలుగేండ్ల నుంచి పట్ట పగలు ఎండలో కూడా పరిగెత్తుతున్నాను. నా శరీరం ఎలాంటి స్థితిలో పరిగెత్తినా సహకరిస్తున్నది. తిన్న తర్వాత కూడా పరుగే. లద్దాఖ్ మారథాన్‌లో తిన్న తర్వాతే పరిగెత్తాను. మారథాన్లకు వెళ్లాలంటే విమాన టికెట్లు, మారథాన్ ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు ఎవరి స్పాన్సర్షిప్ లేదు. అయినా సొంత ఖర్చులు, ఫీజులతోనే పాల్గొన్నాను. మా ఆవిడ శుభారాణి జూనియర్ కాలేజ్‌లో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నది. తన సహకారం నా పరుగుకు ఉపయోగపడింది.
క్రమశిక్షణతో ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఫ్యామిలీతో సంతోషంగా ఉండటం, సొసైటీలో ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం నా పరుగు లక్ష్యం. ఏ మారథాన్‌లో అయినా తెలంగాణ పోలీస్ జెండాతో పాల్గొంటాను. మా డిపార్ట్మెంట్కి మంచి పేరొచ్చింది. నాకు గుర్తింపు వచ్చింది. అంతకు మించిన సంతృప్తి దక్కింది.
‘ఐరన్ మ్యాన్’ అనిపించుకుంటా!
శారీరకంగా బలంగా ఉన్నాను. కానీ, సరైన సలహాలు లేక, నా సామర్థ్యం నాకు తెలియక జాతీయ, అంతర్జాతీయ పరుగులో అడుగుపెట్టలేక పోయాను. దేశంలోని ఫుల్ మారథాన్లు అన్నీ చేశాను.
అల్ట్రా మారథాన్లు చేశాను. ఇక ఐరన్ మ్యాన్ మిగిలింది. అదే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ చాలెంజ్‌లో స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ ఉంటాయి. ఇది అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి సంపన్న దేశాల్లో జరుగుతుంది. ఇందులో మూడు కిలోమీటర్ల ఎనిమిది వందల మీటర్ల స్విమ్మింగ్, 198 కిలోమీటర్లు సైక్లింగ్, 42 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తే చాలెంజ్ పూర్తవుతుంది. ఇదంతా 16 గంటల్లో
పూర్తి చేస్తే ఐరన్ మ్యాన్ టైటిల్ ఇస్తారు. అది సాధించడమే నా లక్ష్యం.
– పిల్లి రాజు
– నాగవర్ధన్ రాయల