Funky | టాలీవుడ్లో సహజమైన కామెడీకి కొత్త స్టైల్ తీసుకొచ్చిన దర్శకుల్లో కె.వి. అనుదీప్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సాధారణ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు, యువతను ఆకట్టుకునే సరదా కథనా శైలి, తనదైన హాస్యంతో ఆయన సినిమాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నవ్వుల పండుగను అందించిన అనుదీప్, కామెడీ జానర్లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు అదే ఎనర్జీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తాజా చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కొందరు ‘ఫంకీ’ని ‘జాతిరత్నాలు’తో పోల్చినా, దర్శకుడు అనుదీప్ మాత్రం ఇది పూర్తిగా భిన్నమైన కథ అని స్పష్టం చేస్తున్నారు. ఓ యువ దర్శకుడి జీవితాన్ని చుట్టూ తిరిగే కథగా, ఇందులో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ సమతుల్యంగా మిళితమై ఉంటాయని ఆయన చెబుతున్నారు. ప్రతి వర్గం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుదీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉండటమే తప్ప లాజిక్ ఉండదనే అభిప్రాయం తప్పు అని, ప్రతి సన్నివేశానికి బలమైన కారణం ఉంటుందని చెప్పారు. ‘ఫంకీ’ కథ రాస్తున్నప్పుడే విశ్వక్ సేన్ అయితేనే బాగుంటాడని అనిపించిందని, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ దర్శకుడి పాత్రలో కనిపిస్తూ ప్రత్యేకంగా అలరిస్తారని చెప్పారు.
‘ఫంకీ’ అనే టైటిల్ ఎంపికపై కూడా అనుదీప్ క్లారిటీ ఇచ్చారు. ఈతరం అభిరుచులకు తగ్గట్టుగా, క్యాచీగా, హీరో పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు నిర్ణయించామని వివరించారు. అలాగే దర్శకులు హరీశ్ శంకర్, కల్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్‌రాజు, నాగవంశీ గెస్ట్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా అనుదీప్ ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. ఇకపై కేవలం కామెడీ మాత్రమే కాకుండా హారర్, యాక్షన్ వంటి విభిన్న జానర్లను కూడా ప్రయత్నించాలనుకుంటున్నానని, ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో పాటు వెంకటేశ్ కోసం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన కథ సిద్ధం చేస్తున్నానని వెల్లడించారు. ఇకపై తాను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.