రుద్ర రోజూలాగే పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. పాతకేసుల ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అక్కడే ఉన్న న్యూస్‌పేపర్‌పై తన పేరు తాటికాయంత అక్షరాల్లో కనిపించగానే ఆసక్తిగా దాన్ని అందుకున్నాడు. రుద్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ప్రకటన అది. బెంగళూరులో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న విద్యాసంస్థ రుద్ర గ్రూప్. హైదరాబాద్‌లో కూడా కొత్త బ్రాంచీలను ప్రారంభించాలని ఆ సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్‌లో డిగ్రీ కళాశాలతో తమ ప్రస్థానాన్ని ప్రారంభించింది.
ఆ రోజు 2024 జూలై 15. కళాశాల మొదటిరోజు. ఆ ఏడాదే కొత్తగా డిగ్రీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే విద్యార్థులతో కళాశాల ప్రాంగణం కళకళలాడుతున్నది. కొందరు పేరెంట్స్ కూడా వచ్చారు. కళాశాల ప్రారంభ దినోత్సవం కావడంతో.. నగరంలోని ప్రముఖులు కూడా అక్కడికి వచ్చారు. కొత్త విద్యార్థులు ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. అధ్యాపకులు విద్యార్థులకు ఏవో సూచనలు చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కళాశాలంతా ఓ రౌండ్ వేయడానికి వెళ్లారు. కాలేజీ వెనుక వైపు నడుస్తున్నారు. అలా వెళ్లిన విద్యార్థులకు ఏదో ఆర్తనాదం వినిపించింది. ఒక్కసారిగా వాళ్లు ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన అక్కడినుంచి పరిగెత్తి కాలేజీ ముందువైపు వచ్చేశారు. ఏమైందో ఎవరికీ అర్థం కావడంలేదు. కాలేజీ స్టాఫ్, సెక్యూరిటీ సిబ్బంది అరుపు వచ్చిన లైబ్రరీ దిశగా వెళ్లారు. గ్రంథాలయం పక్కనున్న స్టోర్‌రూమ్‌లో ఒక యువకుడు రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఆ అబ్బాయిని దారుణంగా హత్య చేశారని చూడగానే అందరికీ అర్థమైంది. వెంటనే ప్రిన్సిపాల్ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేశాడు.
రుద్ర గ్రూప్ ఆఫ్ కాలేజీల యాడ్‌ను పేపర్లో చదువుతూ కాఫీ తాగుతున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. తన పేరుతో ఓ ఎడ్యుకేషనల్ గ్రూప్ కూడా ఉందా? అంటూ తనలో తానే నవ్వుకొన్నాడు. ఇంతలో రుద్ర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విషయం విని.. తన టీమ్‌తో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొన్నాడు రుద్ర. స్టోర్‌రూమ్‌లో అబ్బాయి డెడ్‌బాడీని, అక్కడి పరిసరాలను తీక్షణంగా పరిశీలించాడు. కానీ, అక్కడ ఎంత వెతికినా ఎటువంటి క్లూ దొరక్కపోవడంతో హంతకుడు ఎవరో కనిపెట్టడం రుద్రకు పెద్ద సవాలుగా మారింది.
ప్రిన్సిపాల్ మొదలు కళాశాలలో ఉన్న సిబ్బంది, స్టాఫ్‌ని పోలీసులు ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా.. ఎవరో పేరెంట్స్ అడ్మిషన్ కోసం వస్తే వారితో మాట్లాడుతున్నానని చెప్పాడు. పిల్లలకు స్పోర్ట్స్ సామగ్రి కొనుగోలు చేయడానికి బయటికెళ్లానని స్పోర్ట్స్ టీచర్ జవాబిచ్చాడు. విద్యార్థులకు లైబ్రరీ మెంబర్షిప్ కార్డ్స్ ఇష్యూ చేసే పనిలో ఉన్నట్టు లైబ్రరీ హెడ్ పేర్కొన్నాడు. పిల్లలకు టర్మ్ ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు సైన్స్ లెక్చరర్ చెప్పాడు. గేట్ దగ్గర ఉండి కొత్తగా వస్తున్న విద్యార్థులకు కళాశాలలోకి దారి చూపిస్తున్నానని వాచ్మెన్ పేర్కొన్నాడు. అటెండెన్స్ రిజిస్టర్లో కొత్తగా చేరిన విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నట్టు క్లర్క్ చెప్పాడు. ఇలా మొత్తం 30-40 మంది స్టాఫ్, ఇతర సిబ్బందిని ప్రశ్నించిన రుద్ర.. అందరి స్టేట్మెంట్స్ను రికార్డు చేశాడు. గంట తర్వాత మళ్లీ అందరినీ కాన్ఫరెన్స్ హాల్‌కు రమ్మన్నాడు.
హంతకుడు ఈ కాలేజీలోనే, ఈ కాన్ఫరెన్స్ హాల్లోనే ఉన్నాడని రుద్ర ప్రకటించాడు. మర్డరర్ తనకు తానుగా లొంగిపోతే మంచిదని, లేకపోతే తమదైన శైలిలో నిజం చెప్పించాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో ప్రిన్సిపాల్ సహా సిబ్బంది అంతా అయోమయానికి గురయ్యారు. అయితే, అందరూ తాము ఏ తప్పూ చెయ్యలేదని చెప్పుకొచ్చారు. దీంతో సహనం కోల్పోయిన రుద్ర.. సైన్స్ లెక్చరర్ ముందుకు వెళ్లి ‘హత్య ఎందుకు చేశావ్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు. తొలుత తనకేమీ తెలియదని బుకాయించిన లెక్చరర్.. రుద్ర లేవనెత్తిన హుక్ పాయింట్‌కు సమాధానం చెప్పలేకపోయాడు. గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పాడు. తానే విద్యార్థిని చంపినట్టు ఎట్టకేలకు ఒప్పుకొన్నాడు. మరణించిన అబ్బాయి తండ్రితో తనకు ఆర్థిక లావాదేవీల్లో పాత గొడవలు ఉన్నాయని లెక్చరర్ తెలిపాడు. ఇదే విషయమై ఆ అబ్బాయితో మాట్లాడానని, అది కాస్త పెద్ద గొడవగా మారడంతో క్షణికావేశంలో రాడ్డుతో అబ్బాయి తలపై కొట్టినట్టు పేర్కొన్నాడు. దీంతో అబ్బాయి చనిపోయాడని తెలిపాడు. అయితే, ఇన్స్పెక్టర్ రుద్ర.. సైన్స్ లెక్చరరే హంతకుడని ఎలా కనిపెట్టాడో మీకు తెలుసా?
ఇన్స్పెక్టర్ రుద్ర హంతకుడి కోసం ప్రశ్నిస్తున్నప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పారు. అయితే, హంతకుడైన సైన్స్ లెక్చరర్‌కి ఏం చెప్పాలో తెలియక “టర్మ్ ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నట్లు” నోరు జారాడు. అసలే అది కొత్త కాలేజీ. ఆరోజే ఓపెనింగ్. అలాంటి కాలేజీలో సైన్స్ లెక్చరర్ పిల్లలకు పాఠాలు చెప్పకముందే.. టర్మ్ ఎగ్జామ్ పేపర్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాడు? ఈ లాజిక్‌నే పసిగట్టిన రుద్ర.. లెక్చరరే హంతకుడని తేల్చేశాడు.