సంక్రాంతికి మొదలై.. ఉగాది వరకు జరిగే ఈ ఐనవోలు జాతర ప్రత్యేకత ఏంటో తెలుసా
Inavolu Mallanna Temple | వెయ్యేండ్ల చారిత్రక నేపథ్యం.. ఐనవోలు ఆలయానిది. తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగానూ విరాజిల్లుతున్నది. ఇక్కడ మకర సంక్రాంతి మొదలు ఉగాది వరకు.. మూడు నెలలపాటు ‘మల్లన్న జాతర’ వైభవంగా జరుగుతుంది. డప్పుచప్పుళ్లు, ఒగ్గుకథలు, శివపార్వతుల కల్యాణాలు, శివసత్తుల పూనకాలు, మల్లన్న పట్నాలు, బోనాలతో సందడిగా సాగే.. ‘సంప్రదాయ జానపద జాతర’గా ఖ్యాతిగాంచింది.
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ప్రస్తావన వెయ్యేళ్ల కిందటి శాసనాల్లో ఉంది. క్రీ.శ 1118 నాటి విక్రమాదిత్యుడి శాసనం, క్రీ.శ 1163 నాటి రుద్రదేవుడి శాసనం, క్రీ.శ 1369 నాటి అనపోతనాయుడి శాసనాల్లో ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. క్రీ.శ.1076-1127 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి, ఆరో విక్రమాదిత్యుడు పాలించాడు. ఆయన మంత్రి అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. ఆయన పేరు మీదుగానే అయ్యనప్రోలుగా పిలిచేవారనీ, కాలక్రమంలో అయినవోలు, ఐనవోలు, ఐలోనిగా మారిందనే ప్రచారం జనబాహుళ్యంలో ఉన్నది. అనంతరం కాకతీయులు ఆలయానికి మూడు వైపులా కీర్తి తోరణాలను, ఆలయం ఎదురుగా మండపాన్ని నిర్మించారు.

అపురూపం- మల్లన్న రూపం
పరమశివుడి అనేకానేక రూపాల్లో మల్లికార్జున స్వరూపం ఒకటి. శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో మల్లికార్జునుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ, ఇక్కడ విగ్రహంగా దర్శనమిస్తాడు. మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్రాయుడు అనే పేర్లున్న మైలారుదేవుడి రూపం.. పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో అలరారుతుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు.. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద, మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులు ఉంటాయి.

వందల ఏండ్ల జాతర
ఏటా సంక్రాంతి సమయంలో ఐనవోలు జాతర ఆరంభమవుతుంది. మకర సంక్రాంతి రోజున పెద్దబండిని అలంకరించి, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. తమ కోరికలు నెరవేరితే కోడెను కడతామని, గండాలు తీరితే గండదీపం పెడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకొంటారు. పిల్లలు లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయతో ముడుపు కడితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. పట్నం వేయించే భక్తులు ప్రతి కుటుంబం నుంచి రెండు బోనాలను (పసుపు అన్నం, పులగం) నివేదిస్తారు. కొత్త కుండలను కడిగి చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కొత్త బియ్యంలో పసుపు, నూనె వేసి అన్నం వండుతారు. మరొక కుండలో నువ్వులు, బియ్యం దంచి నీటిలో వేసి బెల్లం, పాలు పోసి పులగం వండుతారు. పులగం కుండ మీద పెరుగును, అన్నం కుండమీద బెల్లం పెడుతారు. ఆ తర్వాత బోనాలను వేపాకులు, పూలతో అలంకరిస్తారు. ఒగ్గు పూజారులు ఈ బోనాల ముందు పట్నం వేస్తారు.

మహిమాన్వితం.. మల్లన్న పట్నం
బోనాలతోపాటు ఈ క్షేత్రంలో ప్రముఖమైన పూజ.. మల్లన్న పట్నం. కురుమ కులానికి చెందిన ఒగ్గువారు (ఒగ్గు కథ చెప్పేవారు) నిర్వహించే ఈ పూజా విధానం అతి పురాతనమైనది. కంజెర దరువులు, తాళాలు, గజ్జెల సవ్వడుల మధ్య వినసొంపైన జానపద యాసతో, లయాన్వితంగా మోగించే డమరుక నాదంతో మల్లన్న పట్నాలు వేస్తారు. వీటిలో పార్వతి, పరమేశ్వరుల పెండ్లి ముఖ్యమైంది. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో పెద్దపట్నం, శివకల్యాణం, అశ్వ, నంది, పర్వత, రావణ వాహన సేవలు వైభవోపేతంగా జరిపిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.
– అరవింద్ ఆర్య, 7997 270 270
Read More :
సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
దుర్గమ్మ మేల్కొలుపు.. దుబ్బు కొలుపు!
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఉన్న గంగిరేగు చెట్టు ప్రత్యేకత ఏంటి?
chandragadh fort | చంద్రగఢ్ కోట గురించి ఈ విషయాలు తెలుసా
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

