chandragadh fort | పర్యాటకం అంటే పాలమూరే. ప్రాచీన ఆలయాలు, సిద్ధ పురుషుల బృందావనాలు, నదుల గలగలలూ.. ఇక ఖిల్లాలకైతే కొదవే లేదు. కోట కోటకో చరిత్ర. అందులోనూ అమరచింత మండలంలోని చంద్రగఢ్ కోట రాజసాన్ని చూసి తీరాల్సిందే. ఆ నిర్మాణం శత్రు దుర్భేద్యం. ఆ శైలి అనితర సాధ్యం.
అల్లంత దూరం నుంచే.. దర్పంగా నిలబడిన యుద్ధవీరుడిలా కనిపిస్తుంది చంద్రగఢ్ కోట. జూరాల ప్రాజెక్టుకు వెళ్లేదారిలో కుడిపక్కకు.. అమరచింత గ్రామానికి అర కిలోమీటరు దూరంలో.. ఎత్తయిన కొండపై నిర్మించారు చంద్రగఢ్ కోటను. ఆ నిర్మాణశైలి పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కోట ద్వారం వద్ద నిలబడి చూస్తే.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కనువిందు చేస్తుంది. పచ్చని పొలాలు ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెబుతాయి. సుదూరంగా కనిపించే గ్రామాలు, చెరువులు, కుంటలు మనసును కట్టిపడేస్తాయి.
చంద్రగఢ్ కోటను పద్దెనిమిదో శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు దుర్భేద్యంగా కట్టారు. అంతెత్తు ప్రహరీని దాటుకుని వైరి మూకలు లోనికి వచ్చే ఆస్కారమే లేదు. కోట ప్రధాన ద్వారం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తయిన తలుపులు, కోటపై భాగంలో ఫిరంగుల అరలు.. గత ఘన వైభవాన్ని చాటుతాయి. కోటకు రెండు ద్వారాలు ఉన్నాయి. ఉత్తర ద్వారాన్ని ఎందుకో మూసేశారు. కోటలో నీటి ఎద్దడి తలెత్తకుండా పైభాగంలో రాళ్లపై పన్నెండు చెలిమెలు తవ్వించారు. ఇవి నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు అద్దం పడుతాయి. అంతెత్తు గుట్టపై తవ్వినా కూడా, ఇప్పటి వరకూ ఎండిపోలేదు. అన్ని కాలాల్లోనూ నీళ్లు ఉంటాయి. చంద్రసేనుడి ఇష్టదైవం రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ కట్టారు. రాఖీపౌర్ణమి, మహాశివరాత్రి, నాగుల చవితి సందర్భంగా జాతరలు జరుగుతాయి.
సాధారణంగా ఏ ఆలయంలో అయినా బ్రాహ్మణులే అర్చకత్వం నిర్వహిస్తారు. కానీ, రామలింగేశ్వరుడికి మాత్రం ఆర్యవైశ్యులే పూజారులు. ఆర్యవైశ్య చక్రవర్తులు నిర్మించిన ఆలయం కాబట్ట్టి, ఆ సామాజిక వర్గానికి చెందినవారికే అవకాశం దక్కిందని చెబుతారు స్థానికులు. మహాశివరాత్రి సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడికి చేరుకోవాలంటే గద్వాల నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణించాలి. మహబూబ్‌నగర్ నుంచి యాభై కిలోమీటర్లు. హైదరాబాద్‌కు 170 కిలోమీటర్లు. ‘చంద్రగుప్తుల పాలనలో ఆలయ నిర్మాణం చేసినట్లు పెద్దలు చెబుతారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు’ అని చెబుతారు స్వామివారికి నిత్యం పూజలు నిర్వహించే గట్టు శ్రీనివాసులు. ప్రతి అమావాస్యకూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అభిషేకాలు నిర్వహిస్తారు. అన్నదానం ఏర్పాటుచేస్తారు. చంద్రగఢ్ యాత్ర ఆధ్యాత్మిక ఆనందాన్నీ, పర్యాటక అనుభూతినీ అందిస్తుంది. హైదరాబాద్ వాసులకు వారాంతపు విహారానికి అనుకూలమైన చోటిది. ఈ కోటపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
✍ చంద్రమౌళి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?
Bhuvanagiri Fort | తెలంగాణలో ట్రెక్కింగ్‌కు కేరాఫ్ భువనగిరి కోట.. దాని ప్రత్యేకతలు తెలుసా?
కరీంనగర్‌లోని ఈ గుట్టల వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిందా?
Mystery | ఈ ఊళ్లో ఒకరు పోతే.. వారంలో ఇంకొకరు చావాల్సిందే.. వందల ఏళ్లుగా ఇదే సీన్