తెలంగాణ గడ్డపై వందలాది జానపద కళలు, కళా రూపాలు పురుడు పోసుకున్నాయి. ఇక్కడి ప్రజల జీవితాలతో పెనవేసుకున్నాయి. సమాజానికి విజ్ఞానాన్ని పంచుతూనే.. ఎందరికో ఉపాధిని కల్పిస్తున్నాయి. వృత్తి కళారూపాలుగానూవిరాజిల్లుతున్నాయి. అలాంటివాటిలో ‘దుబ్బు కొలుపు’ ఒకటి. దుర్గమ్మను మేలుకొలిపే జానపద కళారూపమిది.
పెద్ద సైజు డమరుకంలా కనిపించే ‘దుబ్బు’ అనే సంగీత పరికరాన్ని వాయిస్తూ చేసే కళా ప్రదర్శనే ‘కొలుపు’. దుబ్బును వాయిస్తూ, దుర్గమ్మ కథలను కొలుపుల రూపంలో చెబుతారు కాబట్టి.. ఈ ప్రదర్శనను ‘దుబ్బు కొలుపు’ అంటారు. ప్రదర్శకులను దుబ్బులోళ్లు, కొలుపులోళ్లు, దుర్గమ్మలోళ్లు అని పిలుస్తారు. గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన బెస్తవారు ఈ ప్రదర్శనలు చేస్తారు. గంగపుత్రుల నేపథ్యం, చరిత్ర చెబుతూ గంగమ్మ, దుర్గమ్మ మేలుకొలుపులు చేస్తారు.
‘దుర్గమ్మ కొలుపు’నకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, దుర్గమ్మకు మొక్కులు అప్పగించడానికి ‘దుర్గమ్మ కొలుపు’ నిర్వహిస్తారు. ‘దుర్గమ్మ కొలుపు’తో మొక్కు చెల్లిస్తే, అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. అర్ధరాత్రి ప్రారంభమయ్యే ఈ కొలుపు, తెల్లవారేదాకా నిర్విరామంగా సాగుతుంది. అనర్గళంగా, గంటల తరబడి కథ చెప్పగల నైపుణ్యం దుబ్బులోళ్ల సొంతం. జన్మతః అబ్బిన నైపుణ్యం. ఈ మొక్కులనే కొలుపు చేయడం, దుర్గమ్మకు చేసుకోవడం, దుర్గమ్మ పండుగ చేయడం.. అని వ్యవహరిస్తారు.
దుర్గమ్మ పండుగ రోజున ఆడబిడ్డలను, బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానిస్తారు. ఉదయాన్నే దుబ్బు చప్పుళ్లతో పుట్టమన్ను తెస్తారు. అందులో నవధాన్యాలు, పగడం, ముత్యం, బంగారం, వెండి వేసి దుర్గమ్మ గద్దెను తయారుచేస్తారు. కలపతో చేసిన సాంచె మీద ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రంగులతో ‘పటం’ వేస్తారు. అందులో పుట్టమన్నుతో చేసిన దుర్గమ్మ గద్దెను పెట్టి అలంకరిస్తారు. ముగ్గు మధ్యలో పై నుంచి ఈత ఆకులు, సుతిలి తాడు, కొత్త రవిక ముక్క, పిండి వంటలతో చేసిన తొట్టె కడుతారు. నలువైపులా దీపాలు, నైవేద్యం పెట్టి ఊదు, సాంబ్రాణి పొగలు వేస్తూ తొట్టెలను ఊపుతూ కొలుపు చెబుతారు.
దుర్గమ్మ కొలుపులో ఏడు రకాల కథలు ఉంటాయి. దుర్గమ్మ పుట్టినప్పటి నుంచి ఆమె వివిధ కులాల వారి ఇండ్లకు రావడం, పండుగలు కోరుకోవడం లాంటి ఘట్టాలను కొలుపుల రూపంలో సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్తారు. దుర్గమ్మకు బోనం సమర్పించి.. గ్రామ దేవతలను శాంతింపజేస్తారు. కోళ్లు, మేకలను సమర్పించి, బలి చల్లుతారు. తిరిగి దుర్గమ్మను పూజ గదిలో పెట్టేస్తారు. మళ్లీ మూడేండ్లు, ఐదేండ్లకు వీలును బట్టి కొలుపులు చెప్పించుకుంటారు. అయితే, వృత్తికళగా ఉన్న ‘దుబ్బు కొలుపు’నకు క్రమంగా జనాదరణ కరువవుతున్నది. సంప్రదాయాలను పాటించేవారే ఎక్కువగా దుర్గమ్మ కొలుపులు చెప్పించుకుంటున్నారు. వారివల్లే, దుబ్బు కళాకారులకు పని దొరుకుతున్నది. వారిచ్చే మొత్తమే జీవనాధారం అవుతున్నది. మిగతా సమయాల్లో చేపలు పడుతూ, కూలి పనులు చేసుకోవాల్సి వస్తున్నది. ఈ దుస్థితి పోవాలి.
డమరుకం ఆకారంలో ఉన్నా పరిమాణంలో మాత్రం పెద్దదే. దుబ్బును గుమ్మడి టేకు అనే కలప, మేక లేదా బర్రె చర్మంతో తయారు చేస్తారు. గుమ్మడి టేకును రింగులా సంగడి పట్టించి, రెండువైపులా ఏడు రంధ్రాలు చేస్తారు. ఈ రెండు వైపులను మేక లేదా బర్రె చర్మంతో మూసేస్తారు. పైన మువ్వలు కడతారు. ప్రదర్శన సమయంలో దుబ్బును పాదానికి అదిమిపెట్టి, ఒకవైపు సన్నటి పుల్లతో కొడుతూ మరోవైపు చేతితో వాయిస్తారు. అదే సమయంలో కాలితో దుబ్బును ఊపుతుంటే ‘రుమ్..రుమ్..’ అంటూ ఉరుములాంటి శబ్దం వస్తుంది. దుబ్బు, గజ్జెలు కలగలిపి విభిన్నమైన శబ్దం చేస్తూ.. దుర్గమ్మ కథ చెప్తారు. దీంతోపాటు అడవిబర్రె, దున్న, ఎద్దు కొమ్ముతో చేసిన కొమ్ముబూరనూ దుర్గమ్మ కొలుపులో
వాడుతారు.
-అరవింద్ ఆర్య
7997 270 270