Customized School bags | స్కూళ్లు మొదలయ్యాయి. పిల్లల కోసం పుస్తకాలు, స్టిక్కర్లు, బ్యాగులు, బాటిళ్లు… కొని తీరాల్సిందే. అవన్నీ పిల్లలకు నచ్చేలా, చూడగానే చిన్నారుల మొహం వెలిగిపోయేలా ‘కస్టమైజ్డ్’గా రూపొందిస్తున్నాయి చాలా సంస్థలు. అంటే, ఎవరి నోట్‌బుక్ మీద వారి బొమ్మ ఉంటుంది. ఎవరి బాటిల్ మీద వాళ్ల అభిమాన హీరో చిత్రం దర్శనమిస్తుంది. కొంత ఖరీదైన వ్యవహారమే అయినా.. పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి, కష్టమైనా భరిస్తున్నారు కన్నవాళ్లు.
‘అమ్మా! నాకు బార్బీ స్టిక్కర్లు తీసుకురావా?’, ‘నాన్నా! నాకు డోరెమాన్ బ్యాగుకావాలి?’, ‘పప్పా! నాకు చోటాభీమ్ బాటిల్ కొనూ?’.. పిల్లలు తమకు ఇష్టమైన కార్టూన్లు, బొమ్మలకు సంబంధించిన చిత్రాలుండే వస్తువులను కొనిపెట్టమని మారాం చేస్తుంటారు. కొన్నాక వాటిని మాటిమాటికీ చూసుకుని మురిసిపోతుంటారు. చిత్రాలకు, పిల్లలకు మధ్య అనుబంధం నిజంగానే ప్రత్యేకమైంది. అందుకే పిల్లల గదుల్లో గోడల నిండా రకరకాల బొమ్మలు అతికించి ఉంటాయి. వాళ్ల దుస్తులూ, బ్యాగుల మీదా మళ్లీ ఆ బొమ్మలే. ఆ చిత్రాల స్థానంలో ఏకంగా వారి ఫొటోనే ఉంటే సంబరపడిపోరూ! ఎగిరి గంతేయరూ!
చిన్నారుల మొహంలో అలాంటి ఆనందం చూడటానికే కస్టమైజ్డ్ బ్యాగులు, బాటిళ్లు, నోట్‌బుక్స్ లాంటివి తయారుచేయించి బహుమతిగా ఇస్తున్నారు. ‘క్లాస్మేట్’ లాంటి సంస్థలతోపాటు అమెజాన్ తదితర వెబ్సైట్లు వీటిని రూపొందించి ఇస్తున్నాయి. ఆయా సంస్థల వెబ్సైట్లోకి వెళ్లి, ముద్రించాలనుకున్న ఫొటో అప్లోడ్ చేస్తే సరి… ఎంచక్కా ఆ ఫొటోతో బ్యాగో, బాటిలో మన ఇంటికి వచ్చేస్తుంది. స్టిక్కర్ల మీదైతే పేరు, క్లాసు, సెక్షను, రోల్ నంబర్ కూడా అచ్చు వేయించుకోవచ్చు. పిల్లల ఫొటోతోపాటు వాళ్లకు నచ్చిన కార్టూన్ చిత్రాన్నీ జోడించి ముద్రించుకోవచ్చు. కస్టమైజ్ చేసి ఇచ్చేవాటిలో బ్యాగులూ, పౌచ్లూ, పెన్నులూ, నోట్సులూ, స్టిక్కర్లూ, బాటిళ్లూ, లంచ్బాక్సులూ… ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఇంకేం, మీ పిల్లలకు ఇష్టమైన ఫొటో ఎంపికచేసి, ఆశ్చర్యానికి గురిచేసేయండి మరి! వాళ్లు కూడా మంచి మార్కులతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు.
“కొడుకు ఆడుకునేందుకు సరైన బొమ్మలు లేవని టాయ్స్ తయారీ కంపెనీనే స్టార్ట్ చేసింది”
మీ పిల్లలు నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!!”
మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”