‘రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఎన్నో చట్టాలొచ్చాయి. సంస్కరణలు జరిగాయి. ఎంతో అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు, పార్టీలు, గణాంకాలు చెబుతున్నాయి. అయినా రిజర్వేషన్లు కావాలని, రిజర్వేషన్లు పెంచాలని దేశంలో ఊరేగింపులు సాగుతూనే ఉన్నాయి. ఎందుకు? ‘ఈ దేశం ఆర్థికాభివృద్ధి సాధించింది. కానీ, ఆర్థికాభ్యుదయం సాధించలేదు. అందుకే వెనుకబడిన కులాలు (తరగతులు) ఇంకా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో సమాన భాగస్వామ్యం వాటికి లేదని చెబుతున్నారు’ అని సమాధానం చెబుతున్నాయి సామాజిక రచయిత కోడెపాక కుమారస్వామి వ్యాసాలు.
విద్య, ఉద్యోగం, కుల వివక్ష, రాజకీయ ప్రాతినిధ్యం, చట్టాలు, కోర్టు తీర్పులతోపాటు ఎన్నికల హామీల గురించి బీసీ జీవితాల్లోంచి వాస్తవాలను కుమారస్వామి వీటిలో విశ్లేషించారు. ఓబీసీ క్రీమీలేయర్, మహిళా బిల్లులో ఉపకోటా, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, మానవహక్కులు, కుల నిర్మూలన మొదలైన సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించే 77 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ వ్యాసాలు కేవలం బీసీల సంక్షేమాన్ని ఆశించి రాసినవి అనుకుంటే పొరపాటు. ఈ దేశ అభివృద్ధికి సామాజిక సమానత్వం ఒక అవసరమనే రాజ్యాంగ స్ఫూర్తిని రచయిత తెలియజేశారు.
రచన: కోడెపాక కుమారస్వామి
పేజీలు: 303; ధర: రూ. 300
ప్రచురణ: భూమి బుక్ ట్రస్ట్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
-నాగవర్ధన్ రాయల
నేరం ఇతివృత్తంగా సాగే వాస్తవ కథనాలు పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో.. నమ్మక ద్రోహాలు, ఆర్థిక నేరాలు, మతపరమైనవి, రాజకీయ కుట్రలు, ఆవేశకావేషాలతో చేసే హత్యలు మొదలైనవి ప్రముఖంగా కనిపిస్తాయి. ఇలాంటి 30 కథనాలతో ప్రముఖ రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ తాజాగా ‘క్రైమ్ కథనాలు 1’ని వెలువరించారు. ఇందులో మొదటిదైన ‘పబ్లిసిటీ ఫ్రాడ్’లో రష్యా మహారాణి కోసం ఏకంగా ఓ మాయా లోకాన్నే సృష్టించి మోసం చేసిన గ్రిగరీ పోటెమ్కిన్ దుస్సాహసం విస్మయం కలిగిస్తుంది. ఇక భౌతికశాస్త్రంలో ప్రతిభావంతుడైన ధర్మతేజ అనే ఆసామి షిప్పింగ్ కంపెనీ పెట్టి మోసానికి ఒడిగట్టిన వైనాన్ని ‘అ‘ధర్మ’ తేజం’ కళ్లకు కడుతుంది.
చౌక పెట్రోలు పేరుతో రామర్ పిైళ్లె నడిపిన ప్రహసనం భారతీయులకు బాగా తెలిసిందే. ఇతగాడికంటే చాలా ఏండ్ల ముందే 1916లోనే చౌక పెట్రోలు పేరుతో లూయీ ఎన్రిక్ట్ అనే అతను హెన్రీ ఫోర్డ్ లాంటి మహామహులనే బురిడీ కొట్టించే ఇతివృత్తంతో ఓ కథనం నడుస్తుంది. ఇవేకాదు సంచలనం సృష్టించిన ఆరుషి హత్యోదంతం, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఆర్థిక నేరాలు, ఆధ్యాత్మికత ముసుగులో వంచనకు దిగి ఆశారాం బాపు, స్వామి నిత్యానంద ఎదిగిన వైనం, చర్చి ఫాదరీల అకృత్యాలు తదితర దేశ, విదేశ నేర కథనాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతాయి. ఎంత పకడ్బందీగా చేసినప్పటికీ మోసం, నేరం ఎప్పటికైనా బయటపడతాయని హెచ్చరిస్తాయి.
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 248; ధర: రూ. 150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413