శ్రీ రామునీ తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో
ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో
నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దులపట్టి ఉయ్యాలో
అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా పొమ్ము ఉయ్యాలో
అత్తమామల సేవ ఉయ్యాలో ఉత్తమంగా చెయ్యి ఉయ్యాలో
భర్తను సేవించ ఉయ్యాలో వైకుంఠంబున ఉయ్యాలో
వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో
పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో
కలిగి ఉన్నంతల ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి ఉయ్యాలో
ఇరుగు పొరుగిండ్లకు ఉయ్యాలో తిరగబోకోయమ్మ ఉయ్యాలో
అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచనుండాలి ఉయ్యాలో
ఏది చూసిన గాని ఉయ్యాలో ఏది చేసినగాని ఉయ్యాలో
చేసే పనులందు ఉయ్యాలో చిత్తంబు నిలపాలి ఉయ్యాలో
పని చెడినంక ఉయ్యాలో చింతించి ఫలమేమి ఉయ్యాలో
మాట జారిన వెనుక ఉయ్యాలో మరితిరిగి రాదమ్మ ఉయ్యాలో
అందుకే ముందుగా ఉయ్యాలో అలోచనుండాలి ఉయ్యాలో
అపకీర్తి తోను ఉయ్యాలో బతికి ఫలమేమి ఉయ్యాలో
సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికేతెంచు ఉయ్యాలో
అన్నపానాదుల ఉయ్యాలో ఆదరించుము తల్లి ఉయ్యాలో
అత్తవారింటికి ఉయ్యాలో అమ్మవారింటికి ఉయ్యాలో
మంచిపేరు తెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో
కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరొప్పకలగని ఉయ్యాలో
నిండు ముత్తైదువై ఉయ్యాలో ఉండవమ్మ తల్లి ఉయ్యాలో
మంచిపేరు తెమ్ము ఉయ్యాలో మా తల్లి శాంతమ్మ ఉయ్యాలో
కొడుకులు బిడ్డలు ఉయ్యాలో కొమరొప్ప కలగని ఉయ్యాలో
నిండు ముత్తైదువై ఉయ్యాలో ఉండవమ్మ తల్లి ఉయ్యాలో
ఆడాలె పాడాలె..
తెలంగాణ జానపదుల నేల. తల్లి బతుకమ్మ వాళ్ల మది నిండిన దైవం. అలాంటి తల్లిని అచ్చంగా తమ రీతిలోనే కొలవాలని అందమైన పాటలు కట్టారు. ముచ్చటైన ఆటలు కట్టారు. గౌరమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే, మనసు నిండా పూజ చేసుకునే విభిన్నమైన రీతి ఇది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు గౌరమ్మ ఉయ్యాలో… అంటూ ఆమెను తమ పాటల్లోనే జగమంతా ఊరేగిస్తారు. కలౌ నామ సంకీర్తనం… అంటుంది శాస్త్రం. కలియుగంలో పాట ద్వారానే, నామ స్మరణ ద్వారానే భగవంతుణ్ని చేరుకోగలమట. అలా అర్చించినా యాగం చేసినంత ఫలమట. అందుకే బతుకమ్మ పండుగ నాడు ఒక్క చేయి, గొంతే కాదు తనువంతా ఆడిపాడి అమ్మను అర్చిస్తుంది. అదే గౌరమ్మకు అసలైన పూజ. అందుకే పండుగ వేళ మనమంతా గొంతెత్తి పాడాలె… ఆనందంగా ఆడాలె!