దుబాయ్: ఆసియా కప్‌లో సూపర్-4 దశను బంగ్లాదేశ్ విజయంతో ఆరంభించింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ దశలో లంకేయుల చేతిలో తమకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. లంక నిర్దేశించిన 169 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని బంగ్లా.. 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.
ఓపెనర్ సైఫ్ హసన్ (45 బంతుల్లో 61, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)కు తోడు తౌవిద్ హృదయ్ (37 బంతుల్లో 58, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో విజృంభించి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో హసరంగ (2/22) మినహా మిగిలినవారంతా తేలిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. దసున్ శనక (37 బంతుల్లో 64 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (34) ధాటిగా ఆడి ఆ జట్టుకు పోరాడే స్కోరును అందించారు. ముస్తాఫిజుర్ (3/20) లంక బ్యాటర్లను కట్టడి చేశాడు.