దుబాయ్: ఆసియా కప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ఇండియా.. సూపర్-4 దశను దాయాదితోనే మొదలుపెట్టనుంది. ఆదివారం (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. గత మ్యాచ్‌లో ఆట కంటే ఆటేతర విషయాలతో వివాదాన్ని సృష్టించిన పాకిస్థాన్ నేటి పోరులో అయినా టీమ్ఇండియాకు కనీస పోటీనిస్తుందా? అనేది ఆసక్తికరం! నేటి పోరు లోనూ భారత్.. గత మ్యాచ్‌లో మాదిరిగానే ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్నే అవలంభించనున్నది.
బలాబలాల పరంగా చూస్తే పాక్ కంటే టీమ్ఇండియా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఎంతో మెరుగ్గా ఉంది. టాపార్డర్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫుల్ స్వింగ్‌లో ఉండగా గిల్ ఇంకా పూర్తిస్థాయిలో విజృంభించలేకపోతున్నాడు. ఒమన్‌తో పోరులో మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ అర్ధ శతకంతో జోరుమీదున్నాడు. సారథి సూర్య, తిలక్ వర్మ సైతం మంచి టచ్‌లో ఉన్నారు. మిడిలార్డర్లో హార్ధిక్, దూబే వంటి హిట్టర్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్ విషయానికొస్తే స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.. స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ పాక్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు. కానీ ఒమన్‌తో మ్యాచ్‌లో అక్షర్ తలకు గాయమవడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. అతడు పాక్‌తో మ్యాచ్‌లో ఆడుతాడా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ అతడికి రెస్ట్ ఇస్తే వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో అవకాశం దక్కొచ్చు. బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. హార్ధిక్‌తో కలిసి అతడు పేస్ బాధ్యతలను మోయనున్నాడు.
భారత్‌తో పోల్చితే పాక్ పరిస్థితి దారుణంగా ఉంది. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్న వేళ ఆ జట్టును లోయరార్డర్ ఆటగాళ్లు ఆదుకుంటున్నారు. ఓపెనర్ సయీ మ్ అయూబ్.. వరుసగా సున్నాలు చుడుతున్నాడు. ఫకర్ జమాన్, వికెట్ కీపర్ మహ్మద్ హరీస్, ఓపెనర్ ఫర్హాన్ ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తున్నారు. అందరికంటే ఎక్కువగా బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఆఖర్లో మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్లు చేయగలుగుతున్నది. కెప్టెన్ సల్మాన్ అఘా ఈ టోర్నీలో ఇప్పటిదాకా తన మార్కును చూపలేదు. టోర్నీ లో ఆ జట్టు బౌలిం గ్ కూడా నాసిరకంగానే ఉంది. అయూబ్‌తో పాటు అహ్మ ద్, నవాజ్ స్పిన్ త్రయం.. భారత బ్యాటింగ్ లైనప్‌ను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి.
గ్రూప్ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్టే ఈ మ్యాచ్‌కూ తన బాధ్యతల్లో కొనసాగనున్నాడు. గత మ్యాచ్ టాస్ సందర్భంగా నెలకొన్న వివాదంతో పాటు టీమ్ఇండియా ఆటగాళ్లు తమకు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడంతో దానికి పైక్రాఫ్ట్‌ను బాధ్యుడిని చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై ఐసీసీలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిని ఐసీసీ పట్టించుకోకపోగా పాక్ యూఏఈతో ఆడిన మ్యాచ్‌లోనూ పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించింది. తాజాగా దాయాదితో పోరులోనూ మళ్లీ అతడికే బాధ్యతలను అప్పగించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా పైక్రాఫ్ట్‌ను రిఫరీగా నియమించడంతో పాక్.. భారత్‌తో పోరుకు ముందు మీడియా సమావేశాన్ని బహిష్కరించింది.