‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఉత్తరాది భామ రితికా నాయక్. మొదటి సినిమాకే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తూ కథలను ఎంచుకుంటున్నది. ‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా మెరిసిన రితిక తాజాగా ‘మిరాయ్’ సినిమాలో మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా వైరలవుతున్న రితికా నాయక్ పంచుకున్న కబుర్లు..
మాది ఒడియా కుటుంబం. మా కుటుంబం ఒడిశా నుంచి ఢిల్లీకి వెళ్లి స్థిరపడింది. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. జీవితంలో ప్రతి విషయంలోనూ నా తల్లిదండ్రులు అండగా ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోవడం ఇష్టం ఉండదు. డ్యాన్స్, ట్రావెలింగ్ అంటే ఇష్టం.
డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్, యాక్టింగ్‌పై ఆసక్తి కలిగింది. స్నేహితుల ప్రోత్సాహంతో ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొన్నాను. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12లో విన్నర్‌గా నిలిచాను. అది నా కెరీర్‌కు మొదటి మెట్టు. ఆ పోటీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అక్కడ నుంచి మోడలింగ్‌తోపాటు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో వసుధ పాత్రలో నటించాను. కరోనా, లాక్డౌన్ అంశాల మీద
చక్కని కథతో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నా మొదటి సినిమానే ప్రేక్షకులు
ఆదరించడంతో తెలుగు పరిశ్రమ నా రెండో పుట్టిల్లుగా మారింది. విశ్వక్సేన్తో కలిసి పని చేయడం
వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను.
‘మిరాయ్’ థ్రిల్లర్ మూవీ. చాలా డైనమిక్ పాత్ర కావడంతో కథ వినగానే ఎైగ్జెట్గా ఫీలయ్యాను. తేజ చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్. స్క్రీన్‌పై మా కెమిస్ట్రీ బాగా కుదిరింది.
సమంతా, అనుష్కా శెట్టి, దీపికా పదుగొణె అంటే ఇష్టం. వారి నటన నాకు ఇన్స్పిరేషన్. కథలో ప్రాధాన్యం ఉంటే ఏ తరహా పాత్ర అయినా నేను చేయడానికి సిద్ధం. నటనకు స్కోప్ ఉన్నప్పుడే కదా.. మన సత్తా ఏంటో
తెలుస్తుంది.
ఖాళీ సమయాల్లో బుక్స్ చదువుతాను. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతాను. సినిమాలకు ఫిట్‌గా ఉండాలి కదా! అందుకే, డైలీ యోగా, జిమ్ చేస్తాను. మంచి డైట్ ఫాలో అవుతాను. జిలేబీ నా ఫేవరెట్ ఫుడ్. సాయంత్రం వేళల్లో అప్పుడప్పుడూ బయటికి వెళ్లి సమోసా, జిలేబీ, పిజ్జా తింటుంటాను. కొత్త ప్రదేశాలకు వెళ్తూ అక్కడి ప్రత్యేకతలు తెలుసుకోవడం అంటే ఆసక్తి.
మొదటి సినిమాకే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ-తెలుగు కేటగిరీలో సైమా అవార్డు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడం చాలా గర్వంగా అనిపించింది. ఇది నా ప్రయత్నాలకు గుర్తింపుగా భావిస్తున్నా. ‘హాయ్ నాన్న’లో మహి పాత్రలో కనిపించాను. కేవలం ఐదు నిమిషాల నిడివి ఉన్న పాత్రే అయినా.. నా కెరీర్‌కి ఎంతో బూస్ట్‌నిచ్చింది. నానితో పని చేయడం ఆనందంతోపాటు మంచి అనుభవం కూడా!