‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్‌లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్’ రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చిన మరో తాటాకు ప్రతిలో ఇలా రాసి ఉంది. ‘ఒరేయ్ పిచ్చోడా.. జ్వాలా తటాకం శక్తిని సైన్స్‌కు ముడి పెడదామనుకొన్నావా? అసలు నిజానికి అక్కడ ఇప్పుడు చెరువు ఉంటే కదరా?? శ్వేతరక్కసి అమాంతం ఆ చెరువును ఎప్పుడో మింగేసింది’ అంటూ వనరాచి రక్తాక్షరాలతో రాసింది.
ఆ తాటాకుపై వాక్యాలు చదివిన రుద్ర అండ్ కో.. భయంతో పరుగు పరుగున జ్వాలా తటాకం దగ్గరికి వెళ్లారు. ఆశ్చర్యం.. అప్పటివరకూ నీటితో కళకళలాడిన ఆ ప్రాంతం తెల్లని ఇసుకతో ఓ మైదానంలా ఉండటాన్ని చూసి అంతా షాకయ్యారు. అది చూసిన హెడ్ కానిస్టేబుల్ రామస్వామి, స్నేహిల్, శివుడు భయంతో ఊగిపోతున్నారు. చెరువు ఒడ్డున ఉన్న మట్టిని ఏదో పరీక్షగా చూస్తున్న రుద్రతో.. ‘ఒరేయ్ రుద్ర.. ఇంతకు ముందు నీటి కోసం మేం వచ్చినప్పుడు నిప్పులుజిమ్ముతూ నీటిలోంచి ఓ పెద్ద మంట వచ్చిందిరా.. అయితే, అప్పుడు చెరువు నిండా నీరు ఉంది. పది నిమిషాల్లోనే ఆ నీరంతా ఏమైనట్టు?’ వణుకుతున్న గొంతుతో స్నేహిల్ అన్నాడు. ‘దీని వెనుక కూడా సైన్స్ ఉందని మాత్రం అనకండి సార్.. నమ్మడానికి కూడా విడ్డూరంగా ఉంటుంది. వేల లీటర్ల నీరు పది నిమిషాల్లో మాయం చేసే సైన్స్ ట్రిక్కును మాత్రం నేను ఎక్కడా చూడలేదు. వినలేదు’ తడారిన గొంతుతో గుక్క తిప్పుకోకుండా చెప్తూ పోయాడు రామస్వామి. ‘బాబాయ్..’ అంటూ రుద్ర ఏదో చెప్తూ పోతుండగా.. ‘సార్.. ఈ నల్లమలతో మన సావాసం, వనరాచితో డెత్ గేమ్, దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు.. నా వల్ల కాదు. ప్రతీ క్షణం భయంతో చస్తున్నా. ఇక, నేను ఈ మిషన్‌లో ఉండలేను. క్షమించండి. దయచేసి నన్ను డిటాచ్మెంట్ చేయండి.. ప్లీజ్’ అంటూ రామస్వామి ప్రాధేయపడ్డాడు. జయ, స్నేహిల్, శరత్, శివుడుతో పాటు మిగతా పోలీసు సిబ్బంది పరిస్థితి కూడా ఇంచుమించూ అలాగే ఉంది. దీంతో చేసేదేమీలేక.. మిషన్‌కు ఎండ్‌కార్డ్ వేస్తానన్న రుద్ర.. అంతకంటేముందు తాను చెప్పేది ఒక్కసారి వినాలని సహచరులను రిక్వెస్ట్ చేశాడు. దీంతో అందరూ రుద్ర మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభించారు.
‘చూడండి.. డీఎస్పీ సత్యనారాయణ సార్ చెప్పడంతోనే నల్లమల మిషన్‌ను స్టార్ట్ చేశాం. దీనికోసం స్వతహాగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకొని మీతో కలిసే హైదరాబాద్ నుంచి బయల్దేరా. ఇంతలో మారువేషం వేసుకొని అమాయకులైన తండావాసులను నారాయణాద్రుల స్వామీజీ ఎలా మోసం చేశారో కండ్లారా చూశాం. మంత్రాలు, తంత్రాలూ అంటూ ఆయన ఎన్ని కథలు చెప్పినా.. సైన్స్ సహాయంతో ఆ గుట్టును రట్టు చేశాం. ఇక, ఆ ఎపిసోడ్ అయిపోయి ఎప్పుడైతే నల్లమలలోకి ఎంటరయ్యామో.. వనరాచి పేరిట కొందరు మరో గేమ్ స్టార్ట్ చేశారని నేను గమనించా. తాటాకు పత్రాలపై రక్తాక్షరాలతో వనరాచి పేరిట మనమందరం గాబరాపడేలా కొందరు ఈ ట్రిక్స్‌ను ప్లాన్ చేశారు. మనల్ని భయపెట్టడానికి రసాయనంతో నింపిన డ్రోన్‌ను భయంకర పక్షిగా చూయిస్తూ ఉసిగొల్పారు. చెరువులోనూ మంటలు సృష్టించి భయపెట్టారు. ఇప్పుడు ఏకంగా చెరువునే మాయం చేశారు. ఎందుకు??’ అంటున్న రుద్ర ప్రశ్నకు అందరూ ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారు. రుద్ర మళ్లీ కొనసాగించాడు. ‘ఎందుకంటే.. వాళ్ల లక్ష్యం ఒక్కటే. మనం నల్లమలలోకి రావొద్దు. ఒకవేళ, వస్తే.. ఇక్కడ జరుగుతున్న మిస్టరీ మరణాల గుట్టును మనం బయటపెడ్తాం. అలా చేస్తే అది వారికి ప్రమాదం. అందుకే ఇదంతా చేస్తున్నారు. అయితే, వాళ్ల ఆటలు ఇకపై సాగవు. ఎందుకంటే, దీన్నంతా వెనుకుండి నడిపిస్తున్నది ఎవరో నాకు ఇప్పుడే అర్థమైంది’ అంటున్న రుద్ర మాటలకు అందరూ షాక్ అయ్యారు. ‘అది ఎవరు?’ అంటూ ముక్తకంఠంతో ప్రశ్నించారు శరత్, జయ, స్నేహిల్, శివుడు, రామస్వామి అండ్ మిగతా టీమ్.
‘ఈ నల్లమల గేమ్ ఎవరు ఆడిస్తున్నారో.. తర్వాత చెప్తానుగానీ, ముందు.. చెరువును మింగిన ఆ శ్వేతరక్కసిని నాలో ఆవాహన చేసుకొంటా’ అంటూ కండ్లుమూసుకొన్నాడు రుద్ర. అసలేం జరుగుతుందో అర్థంకాక ఒకరిముఖాలు ఒకరు చూసుకొన్నారు అందరూ. ఇంతలో కారులో నుంచి ఓ ఖాళీ గ్లాసును, బాటిల్లో నీటిని తీసుకురమ్మని శివుడిని పురమాయించాడు రుద్ర. కాసేపటికి వాటిని తెచ్చిచ్చాడు శివుడు. ఏం జరుగుతుందో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ‘ఇప్పుడు నా శరీరంలోని శ్వేత రక్కసిని ఈ ఖాళీ గ్లాసులోకి పంపిస్తా’ అంటూ ఏవేవో మంత్రాలు చదివాడు రుద్ర. ‘మీ కండ్ల ముందే ఈ ఖాళీ గ్లాసులో నీటిని పోస్తున్నా. నేను పోసిన నీటిని శ్వేతరక్కసి అమాంతం మింగేస్తుంది’ అంటూ అందరిముందూ నీటిని పోశాడు రుద్ర. కాసేపయ్యింది. సన్నగా గ్లాసు నుంచి ఏదో శబ్దం. అసలేం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని సెకండ్ల తర్వాత.. నీటిని పోసిన ఆ గ్లాసును పూర్తిగా వంచి చూయించాడు రుద్ర. ఆశ్చర్యం. ఆ గ్లాసులో పోసిన నీరు మొత్తం మాయమైంది. ఖాళీ గ్లాసే మిగిలింది. దీంతో అందరూ కంగుతిన్నారు. అప్పుడు రుద్ర మాట్లాడుతూ.. ‘చెరువులో కూడా ఇదే జరిగింది. శ్వేతరక్కసి అనేది ఏమీలేదు. ఉన్నదల్లా సైన్స్ మాత్రమే’ అని వివరించాడు. మీకు రుద్ర సైన్స్ లాజిక్ ఏమైనా అర్థమయ్యిందా??
సమాధానం : సోడియమ్ పాలి అక్రిలేట్ అనే తెల్లని ఉప్పులాంటి పౌడర్ తన బరువుకు 200 నుంచి 300 రెట్లు ఎక్కువ బరువు ఉన్న నీటిని పీల్చుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నీటిని పీల్చుకొన్న తర్వాత తెల్లని ఇసుకలా కనిపించడం దాని స్పెషాలిటీ. చెరువులో నీటిని కూడా మాయం చేయడానికి ఎవరో వంద, రెండొందల బస్తాల సోడియమ్ పాలి అక్రిలేట్ పౌడర్‌ను కలిపి ఉండొచ్చని, అందుకే నీరు మాయమై, అక్కడ తెల్లని ఇసుక తయారైందని రుద్ర వివరించాడు. చెరువు గట్టున దొరికిన కొంత సోడియమ్ పాలి అక్రిలేట్ పౌడర్‌ను ఎవరికీ కనిపించకుండా గ్లాస్లో వేసిన రుద్ర.. అలా శ్వేతరక్కసి పేరిట నీటిని మాయం చేశాడు. కాగా, నల్లమల డెత్గేమ్ను ఎవరు వెనకుండి ఆడిస్తున్నారో రివీల్ చేయడానికి రుద్ర సమాయత్తమయ్యాడు.
రాజశేఖర్ కడవేర్గు