పసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస్తి. భూదేవినగర్ (హైదరాబాద్) బస్తీలో ఓ గుడిసెలో బతికే పాలమూరు పేద కవి దేవరపాగ కృష్ణయ్య మాట్లాడితే పాట పుడతది. తెలంగాణ ఉద్యమ బాటలో పరుగులెత్తి పాటందుకున్నడు. ‘దుక్కి దున్నిన నా జీవితానికి దుఃఖమే మిగిలింది’ అని పాటగట్టిన కష్ణయ్య కథ ఆయన మాటల్లోనే..
మా నాయిన జీతం ఉండి ఎనిమిది మందిని బతికిచ్చిండు. ఆయనకు ఇద్దరు భార్యలు. మా అన్న (పెద్ద భార్య కొడుకు) నా కంటే ముప్పయ్యేండ్లు పెద్దోడు. ఆయన ఓపాలి మా అమ్మను కొట్టిండు. నన్నూ కొట్టిండు. తిరిగి కొట్టనీకి చిన్నోడిని అయిపోయిన. నా గుండె పొగిలింది. ఆ ఆవేశాన్నంతా ‘పటపట పళ్లుగొరికి.. పళ్ల సందు తునక లాగ.. పర్రున చీల్చేస్త… పాలెవాడివా? నాకు పగవాడవు…. అన్నగాడవా? నువ్వు హంతకుడవు’ అని మొదటి తూరి పాట పాడిన. పసులు కాసేకాడ దాసగాళ్లకు వినిపించిన. పదేండ్ల వయసులో బుద్ధికి పుట్టింది రాయటం మొదలుపెట్టిన. అయిదో తరగతిలో సదువు ఆపిన. పసుల కాస్తూ, సెట్ల కింద కూసోని ‘ఏం పిల్ల ఎంకటి … కానరావు కంటికి’ లాంటి జానపదాలు రాసిన. విప్లవ గీతాలూ రాసిన. మా అన్నల కింద సుతారి పనికి పోయి మాలు అందిస్తుంటిని. చేలల్లో కూలి పనులు చేసిన. అప్పట్ల.. ఎప్పుడూ నా జేబులో పెన్ను, పేపరు ఉండేటియి. ఎప్పుడు ఆలోచన వస్తె అప్పుడు రాసుకునేది. దోస్తుగాళ్లు నర్సిమ్మ, రాజేశ్‌కి ఆ పాటలు పాడి వినిపించేది. చానామంది పిచ్చోడ్ని చూసినట్టె చూస్తుంటిరి. గవన్నీ నేను పట్టించుకోకపోయేది.
మా నాయిన గాసగాడిగ పని చేసిండు. పేద బతుకు మాది. చెరువు ఎండితె కూలి లేక.. పొట్ట చేత పట్టుకొని వలస పోతుండె. చిన్నోడిని అయినా వలస బాధ తప్పలే. మా ఊరు వెన్నచర్ల (నాగర్‌కర్నూల్ జిల్లా)ని వదిలిపెట్టి జమ్మలమడుగు ఎల్లుంటిమి. అక్కడ్నుంచి పొద్దుటూరు థర్మల్ కేంద్రం పొయినం. ఆడ్నుంచి తమిళనాడుకు ఎల్లినం. చిత్తూరు వచ్చి పాటల క్యాసెట్లు కొనుక్కుని టైప్ రికార్డర్ల వింటుంటిని. ‘ఎప్పుడూ ఈ పాటలేందిరా?’ అని మా యమ్మ తిట్టేది. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, శ్రీకాకుళం, నెల్లూరు గిట్ల దేశాలు పట్టుకొని తిరిగిన. 2000 సంవత్సరంల మళ్లీ తిరిగొచ్చినం. మా ఊరు ఏమీ మారలే. అదే కరువు. చెరువు ఎండి, నేల బీడుబారి ఉండేది. ఆ కష్టాలు సూసుకుంట మా ఊరి మీద పాట రాసిన.
‘మా ఊరి తీరంత మారిపోతున్నదో
మా పల్లె హీనంగ దిగజారిపోతున్నదో
పట్టణానికి పల్లె పట్టుగొమ్మలన్నారు
పల్లె తల్లి నేల పాడుబడ్డ బీడు’
ఈ పాట తెలంగాణ రాష్ట్రం రాకముందు పల్లె గోస ఎంట్లుండెనో చెబుతది. ఊళ్లో పని లేదని ఎమ్మట్నే హైదరాబాద్ పనికి బయలుదేరినం. కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీకి వచ్చినం. తాపీ పని చేసుకుంట ఉన్న. అప్పటికే నా పెండ్లయింది. అక్కడి నుంచి ఐడీపీఎల్ దగ్గర గుడిసెలల్ల ఉన్నం. భూదేవి నగర్ రైల్వే ట్రాక్ పక్కన గుడిసెలల్ల మా ఊరి ఆయన గుడిసె ఉంది. అందులోకి మారినం. మూడు సంవత్సరాలు ఆడ్నే ఉన్నం. అక్కడ ఓ దసగాడు కలిసిండు. ‘నువ్వు పాటలు బాగ పాడుతున్నవ్. గద్దర్ పాటలు బాగా రాస్తడు. నువ్వు ఆయన దగ్గరకి పొయిరా’ అని చెప్పిండు. గుడిసెలోళ్లకు ‘పాలమూరు ప్రజల సంఘం’ ఉంది. వాళ్లంతా గద్దర్ని కలవనీకి పోతుండె. నేనూ వాళ్లతో కలిసి పోయిన. అట్ల గద్దర్ పరిచయం అయిండు. అప్పటి నుంచి మీటింగులకు పోయి తెలంగాణ పాటలు వింటుంటుని. అట్ల తిరగుతున్నప్పుడే పాట మీన ఓ పాట రాసిన.
‘పాట కవి నోట .. నీవు రాలుతుంటవా
పాటా ప్రతి చోట నిను పాడకుంటరా
కులములేని పాట మతములేని పాట
మనిషి నోట ఆడుతుంటవు నువ్వు
ఉద్యమాలకు ముద్దు బిడ్డవు నువ్వు’
ఆ పాట డప్పు రమేశన్నకు వినిపించిన. మహాప్రస్థానం సదువమన్నడు. అది సదివిన. కొన్ని అర్థమయినయ్. కొన్ని అర్థం కాలే. గద్దర్ అన్న రాసిన ‘తరగని గని’ పుస్తకం రమేశన్న దగ్గర కనిపించింది. అది తీసుకోని సదివిన. అందులో పాట ఎట్ల రాయాలె. బాణీ ఎట్లుండాలె. పల్లవి ఎట్ల ఎత్తుకోవాలె సంగతులన్నీ ఉన్నయ్. అది సదివినాంక పాటలు ఇంకొంచెం మంచిగ రాసిన.
నేను రాసిన జానపదాల్ని క్యాసెట్ తీద్దామనుకున్న. మహబూబ్‌నగర్‌లో ఒక స్టూడియోకి పోయిన. స్టూడియో నడిపేటాయన పాటలు తీసుకున్నడు. బాణీలు పాడిచ్చుకున్నడు. ‘పాడనీకి పిలుపిస్త పో’ అన్నడు. కానీ, పిలువలే. బతుకుదెరువుకి హైదరాబాద్ వచ్చినం. ఓ రోజు ఆల్వాల్ల సుతారి పని చేస్తున్న. ఉశికె లారీల నుంచి పాట ఇనబడుతున్నది. ఆ అది నేను రాసిన పాటే. మోసపోయినని బాధపడ్డ. రాసుకోని ఏమీ చేయలేకపోతున్న. ముందుకి పోలేనప్పుడు రాసుకొనుడు ఎందుకులే అని, పాటలు రాసుడే బంద్ చేసుకున్న.
కరోనా వచ్చినప్పుడు.. నమస్తే తెలంగాణ పేపర్లో ‘తెలంగాణ సమాజం గురించి కవితలు ఆహ్వానిస్తున్న’మని యాడ్ వచ్చిందని మా దోస్తు చెప్పిండు. మొదటిసారి కవిత రాసిన. ‘చూడు చూడు తెలంగాణ చూడు.. నాటి నేటి తెలంగాణ చూడు’ అనే నా కవిత కవిత పేపర్ల వచ్చింది. అప్పటి నుంచి కవితలు రాస్తూనే ఉన్న. నా కవితలు చదివి కవి వనపట్ల సుబ్బయ్య ఫోన్ చేసి మెచ్చుకునేది. కవి సమ్మేళనాలకు పిలిచేటోడు. నెల పొడుపు సాహితీ సంఘం (నాగర్‌కర్నూల్)లో చేరిన. ఇప్పుడున్న తెలంగాణ సర్కార్ హామీలిచ్చి గెలిచింది. అమలు సంగతి మరిచింది. ఆ హామీలను గుర్తు చేసుకుంట ‘హామీల గమ్యం.. అభివృద్ధి గాయం’ కవిత రాసిన. అది చదివి కొంతమంది ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఓ మంత్రి అనుచరుడు ఫోన్ చేసి ‘నువ్వు ఇట్ల రాస్తున్నవ్.. అట్ల రాస్తున్నవ్’ అని బెదిరించిండు. రుణమాఫీ కాలే, నిరుద్యోగ భృతి రాలే. సిలిండర్‌కి అయిదు వందలు ఇయ్యలే. నువ్వేమన్నా లబ్ధి పొందితే చెప్పని అడిగితే ఫోన్ కట్చేసిండు.
ఇన్నేండ్లు కష్టపడ్డా భూదేవి నగర్ గుడిసెలోనే నా బతుకు నడుస్తున్నది. ఎంతోమందికి గూడు కట్టిన కానీ, నా బిడ్డల కోసం గూడు కట్టలేకపోయిన. వారం పని ఉంటే ఒక వారం ఉండదు. నా భార్య కూడా నాతోపాటే సుతారి పనికి వస్తది. మాలు అందిస్తది. నలుగురు పిల్లల్ని హాస్టల్లనే సదివిచ్చిన. ఇప్పుడు కాలేజీల్ల చదువుతున్నరు. ఎన్ని బాధలున్నా కవిత్వం వదల్లే. పాటని మరువలే. సెల్లు పక్కన పెట్టుకుంట. ఇటుకల వరుసలు పెట్టుకుంటా… ఆలోచన వచ్చినప్పుడు కవిత్వం సదువుత. సెల్ఫోన్లో రికార్డ్ చేసుకుంట. గిప్పుడు కాగితంతో పనిలే.. సెల్‌ఫోన్‌తో పనికి, కవిత్వానికి ఇబ్బందిలేకుండ పోయింది!