జరిగిన కథ : ఓరుగల్లుపై దండెత్తి వచ్చిన మహాదేవుణ్ని.. దేవగిరిదాకా తరిమితరిమి కొట్టింది రుద్రమ. దేవగిరి కోటను సర్వనాశనం చేసింది. ఆడదని చులకనగా చూస్తే.. ఫలితం ఇలా ఉంటుందని అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పింది. రుద్రమ విజయ వార్తలన్నీ వింటున్న గణపతిదేవుని ఆనందానికి హద్దులు లేవు. ఒకనాడు.. శివనామ పారాయణ వింటూ ప్రశాంతంగా శివ సాయుజ్యం చెందాడు గణపతిదేవుడు. అరవై మూడు వత్సరాల ఆయన అద్భుత పాలనా స్వర్ణయుగంలో తేలియాడుతున్న ఆంధ్రనగరి.. దుఃఖ సాగరమయ్యింది. తెలుగువాడు ఎక్కడున్నా కంటతడి పెట్టాడు.
గణపతిదేవుని ఆఖరి వీక్షణాల కోసం.. ప్రజలు కన్నీటితో రాజధానికి పోటెత్తారు. ఓరుగల్లు అంతా.. ఇసుకవేస్తే రాలనంత జనం. చివరిరోజు పురజనుల వరుసలో.. జాయపకు చిన్ననాటి మిత్రులు కనిపిస్తున్నారు. పోయినవారు పోగా ఉన్నవారంతా వృద్ధులయ్యారు.. ఒకరినొకరు గుర్తుపట్టారు. రోదిస్తూ చూస్తున్నారు. దూరంగా ఓ మహిళను చూసి నోట మాటరాక మ్రాన్పడిపోయి చూస్తున్నాడు జాయప. ఆమె?.. ఆమె! అనుమానం లేదు. ఆమె ఆమె!! కాకతి! కళ్లు చికిలించి చూశాడు. కాకతి.. తలనెరసి వృద్ధాప్యపు క్రీనీడలో.. తననే చూస్తోంది రెప్పవెయ్యకుండా. నిజమా.. భావనా! ప్చ్.. ఏమో! కళ్లు మూసుకున్నాడు జాయప. జీవితమంతా కలిసి ఉందామనుకున్నారు.. ప్చ్.. ఏమైంది!? కలిసే ఉందిగా! జీవితమంతా పెనవేసుకుని.. జీవితాన్నంతా ఆక్రమించుకుని.. లేదన్న బాధ లేదన్నట్లు.. ఉన్నదన్న తృప్తిలో నిండుగా ఉంది.. వరుస తప్పి జాయసేనాపతి వద్దకు వచ్చింది. వణుకుతున్న చేతులతో.. అతని వణుకుతున్న శరీరాన్ని స్పృశించింది. అరవై ఏళ్లనాటి పాతస్పర్శ.. కొత్తగా! ఇద్దరూ కంపనతో లిప్తకాలం వణికిపోయారు. తూలిపోకుండా ఒకరినొకరు పట్టుకున్నారు.. ఏమిటిది.. నిజమేనా.. కాదుకదా భ్రమ??! సభ్యప్రపంచం మొత్తం నిశ్శబ్దనీరవంలో.. సృష్టి ముందటి చీకటిలో ఉన్నట్లు.. కొన్ని లిప్తలపాటు!! రుద్రమ అభ్యర్థనతో వేదికపై ఉన్న గణపతిదేవుని పార్థివదేహాన్ని రెండుచేతులతో ఎత్తుకున్నాడు జాయపుడు. ఆ పుణ్యమూర్తిని పాతిక అశ్వాలు పూన్చిన మహారథంపై ఉంచాడు. కళ్లాలు పట్టి మృదువుగా కదిలించాడు. అశేష ప్రజానీకం హాహాకారాల మధ్య కదిలింది రథం. ముందు శైవఋషులు.. వెనక నడుస్తున్న కాకతీయ సామ్రాజ్యం.. అరవై మంది మండలీశ్వరులు, డబ్భు ఐదు నాయంకరముల పాలకులు.. మహాసేనానులు.. నియోగాధిపతులు.. డబ్భు మంది సామంతరాజులు.. వందమంది మిత్ర రాజ్యాధినేతలు..
మొత్తం ఆంధ్ర సామ్రాజ్యం అటు కాంజీపురం నుండి ఇటు ఈశాన్యాన కళింగం.. మధ్యగా మహానదితీరం వరకు.. పడమట కన్నడ రాజ్యం.. తూర్పున సముద్రం వరకు మొత్తం ఓ వేదిక కాగా.. దానిపై కైలాస శిఖరం నుండి శివుడు.. ఆ నటరాజ రుద్రుడు తాండవం ప్రారంభించాడు. ఏడు ప్రాకారాలూ చుట్టింది శకటం. లక్షలాది పురజనుల నివాళులు అందుకుంటూ చివరికి స్వయంభూ దేవాలయం వద్ద సిద్ధంచేసిన చందనపలకల మృత్యుపానుపుపై గణపతిదేవుని భౌతికకాయాన్ని మెల్లగా ఉంచాడు జాయసేనాపతి. కుమార రుద్రుడు ఆముదపు కాగడా అందించగా.. శైవఋషుల వేదమంత్ర పవిత్ర ఘోష నడుమ తండ్రి పార్థివ దేహాన్ని అగ్నిదేవునికి అర్పించింది రుద్రమదేవి. చేతులు జోడించి ఆ పార్థివ శరీరానికి నమస్కరించి చూడలేనట్లు తలతిప్పుకొన్నాడు జాయసేనాపతి. దగ్గరగా వెళ్లింది కాకతి. గణపతిదేవుని పార్థివదేహాన్ని చూస్తూ వెక్కెక్కి ఏడుస్తోంది ఆంధ్ర నగరిలా.. ఓరుగల్లులా.. దగ్గరగా వచ్చి ఆప్యాయంగా జాయసేనాపతిని రాసుకుంటూ సకిలించింది విక్రమ. తన తొండంతో ఆప్యాయంగా చుట్టుకుంది ధీర. ఇద్దరినీ మాధుర్యంగా పొదువుకుని ఆర్తిగా ముద్దుపెట్టుకున్నాడు. ధీర, విక్రమ తీసుకువెళ్లిన వైపు కదిలాడు.. అతని మోచేయివద్ద పట్టుకుని వెంట నడుస్తోంది కాకతి. జనులంతా గణపతిదేవుని పార్థివదేహం వద్ద ఉండగా ఆంధ్ర నగరి బావురుమంటోంది ఒంటరిగా. చేతులు పట్టుకుని నడుస్తున్నారు జంట. అనుమకొండ వీధులవెంట జంటగా ఏడేడు అడుగులు.. కాకతి – జాయ. “ఇన్నాళ్లూ ఎక్కడున్నావ్ కాకతీ?” “ఎక్కడెక్కడో.. ఏదో ఒక శివాలయంలో.. కాకతమ్మ ఒడిలో.. రుద్రేశ్వరుని సన్నిధిలో.. కేశవుని ముందు..” అప్పుడు కనిపించాయి మృత్యుదేవుడి కేశపాశాలు.. గుర్తించాడు జాయసేనాపతి. తనకోసమే నాలికలు చాస్తున్నాయి. నటరాజు గజ్జె కట్టడం తెలుస్తోంది. అదుగో యముడు నట్టువాంగం కోసం తాళాలు అందుకుంటున్నాడు. తలోవాద్యం తీసుకుంటున్నారు దేవతలు.
కిసలయ జటాచ్ఛటలు ముసరుకొని వ్రేలాడ..
బుసలుగొని తలచుట్టు భుజగములు బారాడ
మకరకుండల చకాచకలు చెక్కుల బూయ
అకళంక కంఠహారాళి నృత్యము సేయ
ముకుజెఱమలో శ్వాసములు దందడింపంగ
బ్రకటభూతిప్రభావ్రజ మావరింపంగ
నిటలతటమున జెమట నిండి వెల్లువ గట్ట
గట యుగ్మమున నాట్యకలనంబు జూపట్ట
తకఝణుత ఝణుత యను తాళమానము తోడ
వికచనేత్రస్యంది విమలదృష్టుల తోడ
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
సమ్మోహనంతో ఆ శివుడు తాండవమాడుతున్నాడు. ముసురుకుంటున్న చీకట్లు. అప్పుడే అర్రులు చాస్తూ దూసుకొస్తున్న మృత్యు నాలికలు. వాటితోపాటు చుట్టుముడుతున్న రుద్ర కేశపాశాలు.. అంతిమంగా తనే జయించాడు. ఏదోనాడు వస్తుందని తను నమ్మి అందరికీ చెప్పినట్లు కాకతి వచ్చేసింది. ఓటమి లేదు. ఆమెను చూసుకున్నాడు తనివితీరా.. ముఖంపై ముంగురులు సవరించాడు. గాజుకళ్లతో అతణ్నే చూస్తోంది కాకతి. ఆమె కళ్ల కింద నల్లని వలయాలు.. శివుని జటాజూటాల్లా.. ఆడెనమ్మా! శివుడు పాడెనమ్మా! భవుడు… అటూ ఇటూ విక్రమ, ధీర. మధ్యలో జంటగా జాయసేనాపతి – కాకతి. ఎటో నడుస్తున్నారు చేతులు పట్టుకుని.. ఆ పట్టు ఆర్తిగా.. విడువలేనట్లుగా రానురానూ బిగుసుకుంటోంది. నటరాజు నృత్తం పెరుగుతోంది. ఆకాశమంతా నిండిన ఆ నటరాజరూపం.. ఆ దేవదేవుని నృత్త పాదముద్రలు జాయసేనాపతి పక్కగా పడుతున్నాయి.
సకల భువనంబు లాంగికముగా శంకరుడు..
సకల వాఙ్మయము వాచికము గాగ మృడుండు
సకల నక్షత్రంబులు కలాపములు గాగ..
సకలంబు దనయెడద సాత్త్వికంబును గాగ
గణన చతుర్విధాభినయాభిరతి దేల్చి..
తన నాట్యగరిమంబు తనలోనే తావలచి
నృత్యంబు వెలయించి నృత్తంబు ఝళిపించి..
నృత్త నృత్యములు శబలితముగా జూపించి
లాస్య తాండవ భేద రచనాగతులు మీఱి..
వశ్యులై సర్వ దిక్పాలకులు దరిజేర
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
మార్దవంగా మొదలై ప్రళయంలోకి పయనిస్తోంది తాండవం. అది శ్మశాననృత్తం! అర్థమవుతోంది. మృత్యువు చుట్టుముట్టినట్లు.. దగ్గరగా చావు వాసన.. తిరిగి తిరిగి గణపతిదేవుని సాన్నిహిత్యానికి వచ్చారు ఇద్దరూ. స్వయంభూ దేవాలయం!! “లోపలికి వెళదాం పద.. ఇక్కడ మన భంగిమలతో చెక్కిన శిల్పాలు ఎన్నో.. ఆ దేవుడితోపాటు..” విక్రమ కళ్లెం విడిచాడు. పెనవేసుకుని విడువడం లేదు ధీర. తొండం మృదువుగా తప్పించుకున్నాడు. విక్రమను, ధీరను ముద్దుపెట్టుకున్నాడు ఆర్తిగా.. ఆఖరిగా.. చేయిపట్టి లోపలికి వెళుతోంది కాకతి. అంతా నిర్జనం.. మనసంతా ప్రశాంతం.. అలౌకికం.. అస్పష్ట భావోద్వేగాలు నృత్తమాడుతున్నాయి. లోనా బయటా నటరాజు చేస్తోన్న ప్రళయ తాండవ నృత్తం. సమస్త లోకాలను చుడుతూ ఉచ్ఛస్థాయికి వెళ్లింది. శివము సాధించుటయే కైవల్యమును పొందడం!! అప్పుడు మొట్టమొదటిసారి భగవంతుణ్ని కోరుకున్నాడు. కాకతీయ సామ్రాజ్య చిరయశస్సు తప్ప.. ఎప్పుడూ తన గురించి ఏమీ కోరని జాయప.. జాయపుడు.. జాయచోడుడు.. జాయసేనాపతి!! ఆడి.. పాడి.. పరుగులెత్తి.. ఏనుగులను ఆడించి.. అనుమకొండ వీధులలో అనామకంగా తిరిగి.. గ్రామాలలో చిందులేసి.. యుద్ధ భూముల్లో నర్తించి, కరవాలం తిప్పి.. బాణం వదలి.. బరిసె విసరి.. శత్రువులను నిర్జించి.. అక్కల కోసం పరితపించి.. బావ కోసం ప్రాణాలు పెట్టి.. రుద్రమ వారసత్వం కోసం మేనల్లుడి గుండెల్లో పొడిచి చంపి.. కాకతీయ సంస్కృతికి ఏకైక చిహ్నంగా నిలచి, ఆగామి జనావళికి మూడు లాక్షణిక గ్రంథాలను రాసిపెట్టి, కాకతీయ సామ్రాజ్యమే ఊపిరిగా.. కాకతిని పొదువుకుని..
ప్రశాంత కాకతీయమే పరమావధిగా.. నాడుల తీగెలలో నవరసాలు ప్రవహిస్తుంటే ఎప్పుడూ సమాజహితం కోసమే ఆడి పాడిన మహాపురుషుడు జాయసేనాపతి.. ఆ రుద్రుణ్ని.. తనకోసం తొలిసారి గొంతెత్తి ప్రార్థించాడు. చేతులు జోడించి విశ్వంభరలో నృత్తమాడుతున్న రుద్రేశ్వరుణ్ని చూస్తూ సజల నయనాలతో పాడుతూ లోపలికి కదిలాడు.“అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరా!!” (ఓ పరమేశ్వరా.. నాకు నొప్పి, బాధ లేని మరణాన్ని ప్రసాదించుగానీ దైన్యమైన జీవితం వద్దు.. మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నీ సాన్నిహిత్యాన్ని ప్రసాదించు చాలు!! ) కాకతితో కలిసి ఏడడుగులు నడుస్తూ లోలోపలికి వెళ్లి పోయాడు.. వెళ్లిపోయాడు!! ఆ గొంతు మరి వినరాలేదు. ఆ కాలి అందియ మరి మోగలేదు. దేవళం అంతా నిశ్శబ్దం.. బయటా చుట్టూ అంతా నిశ్శబ్దం.. అక్కడెక్కడో పాలపిట్టలు మెల్లగా కబుర్లు చెప్పుకొంటున్నాయి. బాలసముద్రం చెరువులో అలముకున్న చీకట్లలో అలలు మెల్లగా.. భయం భయంగా కదలుతున్నాయి. శ్మశాన నిశ్శబ్దం.. కరాళ నృత్తం పూర్తయ్యింది. కేశపాశాలు ముడివేసుకున్నాయి. నాలికలు గుటక వేశాయి. నిశీధి రానురానూ చిక్కబడుతోంది. పశ్చిమం రుధిరం కక్కుకున్నట్లు.. ఎటుచూసినా ఎరుపు.. ఆకాశంలో ఏరులై పారుతున్న ఎరుపు.. అంతా ఎరుపు.. నలుదిక్కులా.. భూమ్యాకాశాలు.. సమస్త ప్రకృతి అంతా ఎరుపు.. ఎర్రెర్రని నభోభాండం కింద చిన్ననల్లని కన్నీటి చుక్కలా స్వయంభూ దేవాలయం.. దేవాలయానికి దగ్గరగా వెళ్లిన అశ్వం విక్రమ, ఏనుగు ధీర తలెత్తి జాయసేనాపతి వెళ్లినవైపు దిగులుగా చూస్తూ మెల్లగా మౌనంగా కన్నీరు కారుస్తున్నాయి.
జాయసేనాపతి మరి బయట కనిపించలేదు.. ఎప్పుడూ! శివునిలో ఐక్యం అయ్యాడో.. గణపతిదేవునిలో లీనం అయ్యాడో.. తన శరీర భంగిమల్లో ప్రభవించి శిల్పుల చేతిలో ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలలో కాకతితో కలగలసిపోయి ఓ శిల్పమై.. అప్పటికే రుద్రునిలో ఐక్యమైన గణపతి దేవుని ఆత్మను ఆ రుద్రుడిలో చూస్తూ ఉండిపోయాడో.. తెలియదు. అడిగిన వాళ్లెవ్వరూ లేరు. అడిగే వాళ్లెవ్వరూ కూడా లేరు. అడిగేవాడు, అడగ గలిగినవాడు ఒక్కడే.. మహామనిషి, చరిత్రలో తనకొక అధ్యాయం లిఖించుకుని కీర్తిశేషుడైన శ్రీశ్రీశ్రీ రాయగజకేసరి, మన్మహా మండలీశ్వరుడు కాకతీయ గణపతిదేవుడు.. రుద్రేశ్వరాలయం ముందు చందనపు కట్టెలపై ఉన్న ఆయన పార్థివదేహం అగ్నిప్రీతమౌతోంది. తకిటతక.. తకతకిట.. తకతకిట.. తకిటతక తకతదిగిణతోగిణతో.. కిటతకతదిగిణతో.. కిటతకతదిగిణతో.. కిటతకతదిగిణతో.. ఓం నమః శివాయ!.. రుద్రం నమః !! సమాప్తం పాఠక దేవుళ్లకు నమస్సు మనస్సులు.. 22 సెప్టెంబర్ 2022న ప్రారంభించి ఈ వారంతో ముగుస్తోంది. మొత్తంగా 132 వారాలు. ఆ మహాపురుషుని జీవితమనే నృత్త హేల!! ఈ ‘జాయ సేనాపతి’ అనే మహానుభావుణ్ని తెలుగు సమాజం ముందు మహోన్నతంగా నిలిపిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక యాజమాన్యానికి, వారి ఎనలేని సహకారానికి నా కృతజ్ఞతలు..
అలాగే ముల్కనూరు సాహితీ పీఠం వారికీ, ముఖ్యంగా మాన్యులు వేముల శ్రీనివాసులు గారికి శతకోటి వందనాలు. కాకతీయ చరిత్ర పట్ల శ్రీనివాసులుగారి అభిమానం వెలకట్టలేనిది. ఓ మహాయుద్ధ యోధుడు, ఓ నాట్యాచార్యుడు, ఓ మండలేశ్వరుడు.. అయిన మహాపురుషుడు భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే మరొకరు లేరు. అలాంటి మన తెలుగు ముద్దుబిడ్డను తెలుగు చరిత్రకారులు, సాహితీవేత్తలు, నాట్య వర్గాలు చాలా సింపుల్గా చూడటం.. మన సంస్కృతికే మాయని మచ్చ. ‘అవునూ.. ఆయన జాయప కదూ.. మాకు తెలుసు..’ అంటారు. వివరాలు చెప్పమంటే చెప్పేవారు ఎవ్వరూ లేరు. ప్రముఖ నాట్యకారులు కూడా.. ‘ఆయన గురించి విన్నాం.. ఎక్కడో చదివాం..’ అంటారు గానీ, అంతకుమించి చెప్పలేకపోయారు.
అది నిన్నటి వరకు.. ఈరోజున జాయసేనాపతి సమస్త తెలుగు జాతికి తెలిసిన ప్రసిద్ద నామం!! ఆయన వేసిన నాలుగు శాసనాలు, ఆయన రచించిన నాట్య ప్రామాణిక గ్రంథం నృత్త రత్నావళి చదివి.. ఆయన పూర్తి వివరాలు సేకరించి మరికొన్ని ఇతర పరిశోధనలు పరిశీలించి.. ఆయన జీవితాన్ని నేనే డిజైన్ చేసుకుని ఈ నవల రాశాను. అనేక గ్రంథాలు కోరినవెంటనే ఇచ్చిన “అన్నమయ్య గ్రంథాలయం గుంటూరు, మహాపుస్తక సేకర్త శ్రీలంకా సూర్యనారాయణ గారికి, సుహాసిని మేడం గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను రాసిన పాత్రలకు, సన్నివేశాలకు అపురూపమైన తన ఆలోచనలతో చిత్రించి ప్రాణం పోసిన చిత్రకారుడు, సోదరుడు శ్రీ దాకోజు శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు. నవలను ఆదరించి ప్రేమించి స్పందించి కాల్స్ చేశారు పెద్దలు, ప్రముఖులైన చరిత్రకారులు, వందలాదిమంది చరిత్ర ప్రేమికులు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.