జరిగిన కథ : ఏకవీరాదేవి పూజకోసం కేతకిపురానికి వెళ్లిన రుద్రమదేవిపై ముసుగు వీరుల బృందం దాడిచేసింది. అదే సమయంలో ఓరుగల్లులోనూ కలకలం రేగింది. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసిందన్న వార్త నగరంలో వ్యాపించింది. ముసుగులతో ఉన్న కొందరు దుండగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ హఠాత్పరిణామానికి పౌరులు బిత్తరపోయి చూస్తూ.. అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నారు. అది సైనిక తిరుగుబాటు అని. అయితే, ఈ దారుణానికి నాయకుడు ఎవ్వరో ఎవ్వరికీ తెలియడం లేదు.
కోట మహాద్వారాలు ఒక్కటొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఏ కోటలోని వారు ఆ కోటలోనే బందీలుగా ఉండిపోతున్నారు. ద్వారాలన్నీ మూసుకుపోవడంతో వీధులలోని పౌరులు గందరగోళమై.. భయంతో అరుస్తూ పరుగులు పెడుతున్నారు. సైనికులు, రక్షకభటులు ఎవ్వరూ కనిపించడం లేదు. కనిపించిన సైనికులు, గూఢచారులు అంతా వాళ్లతోనే ఉన్నట్లు.. ఆ ముష్కరుల వెంట కనిపిస్తున్నారు. మొత్తంగా అనుమకొండ పట్టణమంతా ఎవరో తెలియని ఓ ముసుగు ముష్కరుల అధీనంలోకి వెళ్లిపోతోంది. వాళ్లు ఎవరో.. అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
రాజప్రాసాదం దగ్గర అంతా నిర్మానుష్యం.. అంతఃపురంలో ఉన్న గణపతిదేవ దంపతులకు ఏమీ తెలిసే అవకాశం లేకుండా.. దుండగులు రాజప్రాసాద ద్వారాలను కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. అడ్డువచ్చిన రక్షకభటులను చంపివేశారు. పురవీధిలోని తన నివాసంలో ఉన్న జాయసేనాపతికి బయట కలకలం వినిపించింది. వెంటనే గవాక్షంనుండి చూశాడు. కొందరు ముసుగువీరులు అశ్వాలపై తిరుగుతూ.. కత్తులు ఝళిపిస్తూ ప్రజలను భయపెట్టడం కంటపడింది. రక్షకభటులు లేకపోవడం చూసి మనసు కీడు శంకించింది.
వీధిలో ఏదో జరుగుతోంది. సాధారణ పౌరులను ఎవరో భయపెట్టి ఏదో చేస్తున్నారు. చురుగ్గా కదిలాడు. దగ్గరున్న ఆయుధాలను అందుకున్నాడు. చురక, ఖడ్గం, కరవాలం, శిరస్ర్తాణం, బరిసె, డాలు, అంబులపొది, విల్లు అతివేగంగా శరీరానికి అమర్చుకుని భవంతి వెనగ్గా బయటకు వచ్చాడు.
విక్రమ వీపు తట్టి కళ్లెం పట్టి వేగంగా అధిరోహించి వీధిలోకి వచ్చాడు. దగ్గరలో ఎదురైన ముసుగువీరుణ్ని కత్తి చూపి బెదిరించాడు.
“ఎవరు మీరు.. ఏమిటి జరుగుతోంది?”
“రుద్రమ మరణం. మురారిదేవుని విజయం. అడ్డొచ్చిన ఎవరికైనా స్వర్గం..”
వాడి మాట పూర్తి కాలేదు. తల ఎగిరి ఆవలగానున్న ఆయన నివాసం మొదటి అంతర్వుపై పడింది. రక్తం కారుతున్న కరవాలాన్ని ఝళిపిస్తూ.. క్రోధావేశంతో వికటాట్టహాసం చేశాడు జాయసేనాపతి. అదొక యుద్ధనినాదం.. ఆంధ్రనగరి మొత్తం ప్రతిధ్వనించింది. అది విన్న పౌరులు ధైర్యంగా పెద్దపెట్టున అరుస్తూ ఆయన దగ్గరకు పరుగులు తీస్తూ వస్తున్నారు.
“ఏమైంది.. ఏమైంది..?”
అందరూ ప్రశ్నించేవారే.. జవాబులే లేవు. క్షణక్షణానికి విషయం అర్థం అవుతోంది. కాకతీయ రాజధానిలో తిరుగుబాటు!! సూత్రధారి మురారిదేవుడు! మురారి ఎంత ద్రోహానికి సిద్ధమయ్యాడు?!!
తిరుగుబాటు లేవదీశాడు. ఊహాతీతం ఆ మేనమామకు. తను ఎప్పుడూ చూడనిది, విననిది ఈ ముదిమి వయసులో చూస్తున్నాడు. ‘జరగనివ్వను. నా బొందిలో ప్రాణం ఉండగా గణపతిదేవుని మాటకు ఎదురు ఎవ్వరు చెప్పినా బ్రతకనివ్వను..’ పరుగులు పెడుతున్న పౌరులు.. భయంతో ఏడుస్తున్న పిల్లాజెల్లా.. వణకుతున్న ముసలీముతకా.. వీధి అంతా ఒక్కసారి చూసుకుని తన ధ్యేయం నిర్ధారించుకున్నాడు. ఆకాశం దద్దరిల్లేలా మళ్లా సింహనాదం చేశాడు జాయపుడు.
“పౌరులారా.. రండి బయటకురండి. పురుషులు, స్త్రీలు.. అంతా.. అందరూ రండి. కత్తులతో కర్రలతో రండి. పిలుస్తున్నవాడు జాయ సేనాపతి.. మీకు నేనున్నాను అండగా..”
అంతే.. అతని గొంతు గుర్తించి బిలబిలమంటూ చాలామంది బయటకు వస్తున్నారు. కత్తులతో కర్రలతో మగవాళ్లు.. రాళ్లతో పిల్లలు.. కారంపొడి పిడికిళ్లతో పట్టిన స్త్రీలు.. విక్రమ వెంట వందలాదిగా పౌరులు.. పరుగులు పెడుతూ.. పోయిపోయి రాతికోట మహాద్వారం వద్దకు వెళ్లారు. అక్కడ ఇనగాల కాచయరెడ్డి ముందుండగా వెంట కొందరు ముసుగు దుండగులు.. గర్జించాడు జాయసేనాపతి.
“ఎవడ్రా నువ్వు? ద్వారం ఎందుకు మూశావ్? ద్వారం తెరువు. లేకుంటే నీ కోసం నరక ద్వారాలు తెరిచే ఉన్నాయి. లిప్తకాలంలో పంపిస్తాను..”
“జై మురారిదేవా! ఆడదానికి చక్రవర్తి సింహాసనం ఇస్తే సహకరించిన నువ్వూ ఓ కాకతీయ యోధుడివా!? జాయసేనాపతీ.. ముందు నన్ను గెలువు. ఆనక ద్వారం తెరుచుకో..” అంటూ కత్తి విసిరాడు జాయుని పైకి. కేవలం రెండుమూడు కత్తిప్రహారాలు మాత్రమే అతను చెయ్యగలిగాడు. నాలుగో ప్రహారానికి అతని తల తెగిపడింది. ఉద్వేగంతో ఊగిపోతున్న పౌరులంతా జయజయ ధ్వానాలతో ద్వారం తెరిచారు.
“జై కాకతమ్మా! జై గణపతిదేవా..” గర్జిస్తూ పదేపదే స్మరిస్తున్నాడు జాయుడు.
క్షణక్షణానికి ఆయన శక్తియుక్తులు సమీకృతమవుతున్నాయి. ఎప్పుడో యాభై ఏళ్లనాటి పిఠాపుర యుద్ధం గుర్తుకొస్తోంది. అది తొలి యుద్ధమైతే ఇది తుది సమరమని మనసు చెబుతోంది.
జాయసేనాపతితో కలిసి పౌరబృందమంతా కోట మరో ద్వారం వైపు పరుగులు పెట్టారు. “పౌరులారా.. బయటకు రండి. కత్తులు కర్రలతో దూకండి. కాకతీయ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లింది. మన ఇంటిని మనమే తగలబెట్టుకునే దుర్మార్గులు దాపురించారు. వారిని నరికివేయాలి. నేను జాయసేనాపతిని. పిలుస్తున్నాను రండి. మీ ముందు నేనున్నాను..” గొంతెత్తి స్థిరంగా పిలుస్తున్నాడు.. పిలుస్తున్నాడు.. పిలుస్తూనే ఉన్నాడు. అక్కడున్న పౌరులు జాయసేనాపతిని చూసి ఉద్వేగంతో నినాదాలు చేసుకుంటూ వెంట వస్తున్నారు.
మరో కోట గవనికోట ప్రాకారద్వారం వద్ద అదే దృశ్యం. ఇక్కడ ఉన్నది ముమ్మిడి బసవ!
పౌరులు బిలబిలమంటూ బయటకు రావడం.. ముసుగు దుండగులపై దూకుడుగా దాడి.. ఒక్కొక్క ద్వారంవద్ద ఒక్కొక్క దుండగుడైన సేనాని ఉన్నాడు. వీళ్లంతా మురారి బృందం. అసలు వాడెక్కడ? వీళ్లు రాజప్రాసాదంలోకి పోయి గణపతిదేవుడికి, రుద్రమకు ప్రమాదం తలపెట్టలేదు కదా?! ద్వారాలు ఎందుకు మూశారు.. రుద్రమ కోట బయట ఉన్నదా.. ఆమె కేతకిపురం వెళ్లే సమయం ఇదే. అంటే ఆమెను బయట ఉంచి ద్వారాలు మూసి ఆమెను బయటే సంహరించే కుట్రలు చేశారా.. ఆమె మరణిస్తే ప్రయోజనం ఎవ్వరికి??.. మురారికే కదా. సందేహం లేదు. వాడే ద్రోహి!!
ఒక ద్వారంవద్ద జాంబయరెడ్డి, మరోద్వారం వద్ద మాచప, మరోద్వారం వద్ద రేచర్లగొంక, తర్వాతి ద్వారం వద్ద సాంబనాయడు, తర్వాత సారంగదేవుడు..
చివరగా మురారి దేవుడు! పక్కన హరిహరుడు!!
ఎంత పెద్దకుట్ర పన్నాడు మురారి?!
జాయసేనాపతి ఒక్కొక్క ద్వారం వద్ద ఉన్న సేనానిని చంపుతుంటే.. వెంట వస్తోన్న జనవాహిని ఆ ద్వారం తెరుస్తున్నారు. చివరి ద్వారం దగ్గరకు వెళ్లేసరికి అశేష పౌరసైన్యం అయ్యింది.
అక్కడున్న మురారి.. జాయసేనాపతిని, ఆయన వెంట ఉన్న పౌరులను చూసి తత్తరపడ్డాడు. “మామా.. అనుకున్నాను. ప్రజల్ని మభ్యపెట్టి తీసుకువచ్చేది మీరే అనుకున్నాను. మీ మేనల్లుడిని కనికరించండి. తప్పులు మన్నించండి. ఇంతకంటే మార్గం లేకపోయింది. అవతల ఆ ద్రోహి రుద్రమాంబ మరో లిప్తకాలంలో నా వీరుల చేతిలో చావబోతోంది. మీరూ, తండ్రిగారు ఇవ్వాళో రేపో చస్తారు. తర్వాత నేనే ఈ కాకతీయ సామ్రాజ్యానికి దిక్కు..”
హరిహరుడు అన్నాడు..
“జాయ సేనాపతి.. ఆలోచించండి మామా! మురారిని కనికరించండి. అసలు రుద్రమ ముత్తుకూరు యుద్ధంలోనే చావాలి. ఆ యుద్ధంలో ఆమె చస్తే మురారికి అడ్డు ఉండదని ప్రణాళిక వేశాం. అలాగే ఓడిపోయింది. కానీ, చావలేదు. ఆఖరి క్షణంలో ప్రసాదిత్యుడు రక్షించాడు. కానీ ఇక్కడ, ఇప్పుడు ఆమెను కాపాడేవాడే లేడు. దయచేసి అర్థం చేసుకోండి మామా..”
“మామా.. ఈ మేనల్లుడిని కనికరించి అర్థం చేసుకోండి..”
విక్రమ ముందు మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించాడు మురారి.
దిగ్భ్రమతో చూస్తున్నాడు జాయసేనాపతి.
అర్థమైంది. ముత్తుకూరు యుద్ధంలోనే శత్రువులతో చేయి కలిపాడు మురారి. ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు.
“అర్థం చేసుకుంటున్నాను మురారి. అర్థం చేసుకున్నాను. ద్రోహి.. శత్రువులతో చేయికలిపావు. మొట్ట మొదటిసారి మహావీరుడు గణపతిదేవుడు బతికి ఉండగానే ఆయన చరిత్రకు ఓటమి మరక అంటించావు. యుద్ధరంగంలో తోడబుట్టిన అక్కకే ప్రాణాపాయం తలపెట్టావు..”
“మామా. సమయం వృథా చేయకు. నాకు తండ్రి, తల్లి, అక్క, మామ ఎవ్వరూ లేరు. కాకతీయ సింహాసనం నాకు కావాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ముందు దారి తొలగండి.. వెళ్లిపోండి. ఈ వయసులో నాతో పోరాటానికి మీ సామర్థ్యం సరిపోదు..”
హరిహరుడు అన్నాడు..
“విన్నారా సేనాపతీ. మీ మేనల్లుడు మీకంటే మహావీరుడు. తాను అనుకున్నది సాధించేవరకు విశ్రమించడు. దయచేసి మీ ప్రాణాలమీదికి తెచ్చుకోకుండా మురారికి పట్టాభిషేకం చెయ్యండి. మీరనుకుంటున్న పాండ్యులు, కళింగులు, దేవగిరి యాదవులు శత్రువులు కాదు. అంతా మన మిత్రులే. మురారి మిత్రులు వాళ్లు. వారంతా మహిళ సింహాసనానికి అంగీకరించరు..”
పూర్తిగా అర్థమైంది జాయునికి. శత్రువులు కుట్రతంత్రాలతో కాకతీయ సైన్యాన్ని ఎలా ఓడించగలిగారో అర్థమైంది. పూర్తిగా మురారి శత్రువులతో చేతులు కలిపాడు. అందరిని అన్నివైపులా సమాయత్తపరచాడు. గణపతిదేవుని సారథ్యంలో ఇటు కన్నెత్తి చూడటానికి కూడా భయపడే భీరులంతా కాకతీయ వీరులను దారుణంగా చంపి.. రుద్రమను ఒంటరిని చేసి ఓడించారు. చంపడానికి కూడా సిద్ధమయ్యారు. అన్నిటికీ మూల కుట్రదారు మురారి. వాడికి అండదండగా ఉన్నవాడు ఈ స్వామిద్రోహి హరిహరుడు.
“ప్రజలారా.. విన్నారా.. అసలు సిసలు కుట్రదారుడు మనవాడే. మన మురారిదేవుడే కాకతీయుల ఓటమికి కారకుడు. వాణ్ని ఏమి చెయ్యాలి?”
“చంపాలి.. చంపాలి..” ముక్తకంఠంతో అరిచారు ప్రజలు. అందరూ ఆ ఇద్దరినీ అసహ్యంగా చూస్తున్నారు. అవతల ద్వారం బయట సంకుల సమరం జరుగుతున్నట్లు కత్తుల ధ్వని.. “విన్నావా మామా.. రుద్రమ ఏడుపులు. చావబోతోంది. ఆమె ఆర్తరావాలు మన చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాయి.. విను విను..” వికృతంగా అన్నాడు మురారిదేవుడు.
ఇద్దరూ వికటంగా నవ్వుతున్నారు. ప్రజలు వేగంగా వారివైపు దూకారు. హరిహరుడు తన కరవాలం ప్రజలపైకి విసిరాడు. కానీ, అప్పటికే జాయ సేనాపతి విసిరిన బల్లెం అతని కరవాలాన్ని దూరంగా విసిరివేసింది. మరుక్షణం ప్రజలు కర్రలతో, కత్తులతో హరిహరుణ్ని కార్చిచ్చులా చుట్టుముట్టి పట్టుకుని ముక్కలు చేయసాగారు. జాయసేనాపతి అశ్వంపై వేగంగా కదిలి ద్వారం తీయబోయాడు. కానీ, మురారి తన కరవాలాన్ని అడ్డుపెట్టాడు.
“ఆ ద్వారం తీయాలంటే నా కరవాలాన్ని ఛేదించాలి. మామా..” అన్నాడు వికటంగా నవ్వుతూ. ద్వారం ఆవల తీవ్రయుద్ధం జరుగుతున్నట్లు కత్తుల శబ్దాలు.. అరుపులు. రుద్రమ ప్రాణాపాయంలో ఉంది. వెంటనే ఆమెను రక్షించాలి. అర్థమైంది. మాటలతో మురారి ద్వారం తీయడు.
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి
లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే ॥
(విష్ణువుచేత గానీ శివునిచేత గానీ బ్రహ్మచేత గానీ ఇతర దేవతల చేతగానీ నొసట రాయబడిన రాత తుడిచి వేయనలవికాదు)
తప్పదు నొసటి రాత!!
విక్రమ మీద నుండి కిందికి దూకాడు..
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284