జరిగిన కథ : కాకతీయ రాజప్రాసాదం. ఆనాడు తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్రపట్టడం లేదు. లోలోన ఏదో తెలియని ఇబ్బంది. యుద్ధవార్తలు భయపెడుతున్నాయి. రుద్రమ ఓటమితో పెనుగులాడుతున్నట్లు. అప్పుడే ద్వారపాలకుడు ద్వారం తట్టాడు. ఎవరో పెద్దామె వచ్చినట్లు విన్నవించాడు.
‘పెద్దామె..??’ దుప్పటి విసిరేసి చివ్వున లేచి బయటకు వచ్చాడు జాయచోడుడు. ఎదురుగా బాలాంబ అత్తమ్మ! సుబుద్ధి మామ రెండవ భార్య!! ఆ వృద్ధురాలు మూర్తీభవించిన దైన్యంగా నిలబడి బేలగా చూస్తోంది. ఎక్కడో బలింజవాడలో ఉండే అత్తమ్మ.. పేటలు, వాడలు దాటి.. అర్ధరాత్రి ఒంటరిగా.. తన పురనివాసానికి వెళ్లి, అక్కడ లేడని తెలుసుకుని.. రాజప్రాసాదానికి.. తన మందిరం వరకూ రావడం.. ఏమాత్రం ఊహించని సంగతి. గత మాసమే మామను అత్తమ్మను పల్లకి పంపి పిలిపించుకున్నాడు. ముచ్చట్లు పంచుకుని మురిసిపోయాడు. ఇంతలో ఏమైంది?! వేగంగా వెళ్లి గట్టిగా హత్తుకుని తన కడుపున పుట్టిన పసిపిల్లలా పొదవుకున్నాడు. “అత్తమా.. ఏమైంది..” “జాయ తండ్రీ! మీ మామ వద్దన్నా వినకుండా యుద్ధానికి వెళ్లారు. యుద్ధం గెలిచే పరిస్థితి లేదని ఇక్కడ చెప్పుకొంటున్నారు. నాకు రెండు రోజులుగా పీడకలలు. నువ్వు యుద్ధంలో ఉంటే నాకు ధైర్యం. కానీ, నువ్వు యుద్ధాలకు వెళ్లకుండా ఏదో రాసుకుంటున్నట్లు మొన్న వచ్చినప్పుడు చెప్పావు..” ఏడుస్తూ చెప్పింది.
జాయచోడుని పట్టునుండి జారిపోయి మోకాళ్లపై కూర్చుండి చేతులు జోడించింది. “నాకేదో భయంగా.. పీడకలలు! జాయ తండ్రీ మామను నాకు.. నా భర్తను నాకు.. తెచ్చిపెట్టు జాయా..” గుండెలు పగిలేలా కుమిలికుమిలి ఏడుస్తోంది. జాయచోడుడు నిర్ఘాంతపోయాడు. తనకు చెప్పకుండా ఈ వయసులో యుద్ధానికి ఎందుకు వెళ్లినట్లు.. యుద్ధమంటే రెచ్చిపోయే కాకతీయయోధుల్లో సుబుద్ధి ఒకడని ఆయనకు తెలుసు. కానీ, ఈ యుద్ధానికి ఆయన వెళ్తాడని ఏమాత్రం ఊహించలేదు. “అత్తమా! నేను ఇప్పుడే యుద్ధ క్షేత్రానికి వెళ్తాను. మామను క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత నాది. సరేనా..” ఆమె చేతులు పైకెత్తి జోడించి నమస్కరించింది. “ఎవరక్కడ.. ఈమెను పల్లకిలో క్షేమంగా ఇంటివద్దకు చేర్చండి..” బట్టలు మార్చుకున్నాడు వడివడిగా. ఆయుధాలు ఒంటికి అమర్చుకున్నాడు. బయటకు పరిగెత్తాడు. “విక్రమా.. సమయం లేదు. నువ్వే నన్ను యుద్ధ క్షేత్రానికి చేర్చాలి..” వికటాట్టహాసం చేసింది విక్రమ. ఎక్కడ ఆగాడో ఎక్కడ తిన్నాడో ఏ సత్రంలో నిద్రపోయాడో.. పది రోజులకు ముత్తుకూరు యుద్ధక్షేత్రానికి.. కాకతీయ స్కంధావారానికి చేరాడు. అప్పటికి అర్ధరాత్రి అవుతోంది. స్కంధావారం విషాదంగా కనిపిస్తోంది. ఓడిపోయే యుద్ధ స్థితిని చెబుతోంది. విక్రమను నడిపిస్తూ మెల్లగా అటూఇటూ చూస్తూ పోతున్నాడు. రుద్రమదేవి గొల్లెన కాబోలు.. దీపాలు వెలుగుతున్నాయి. మనుషుల అలికిడి తెలుస్తోంది. యుద్ధం సంగతి ఏమిటో తనకు ఇప్పుడు అనవసరం. సుబుద్ధి మామ ఎక్కడ ఉంటాడు?! సేనాపతి స్థాయి వాళ్ల గొల్లెనలు వెతుకుతూ పోతున్నాడు. అప్పుడు వినిపించింది.
“ఎవరు.. ఎవరది?” యుద్ధ వేగు అనుకుంటా..
“ఆ.. ఆ.. నేనే! జాయ చమూపతిని” అంతే.. పక్క గొల్లెననుండి నలుగురైదుగురు సేనానులు బయటకు వచ్చేశారు. “మహావీరా.. మీరు వచ్చారా!? దండాలు సామీ దండాలు.. ఇక మాకు కొత్త శక్తి వచ్చినట్లే..” అవేవీ వినకుండా.. “సుబుద్ధి.. సేనాపతి సుబుద్ధి ఎక్కడ?” అడిగాడు.“ఆయనా.. ఆయన ఈరోజు యుద్ధభూమి నుండి.. వచ్చాడా?” “వచ్చినట్లు లేడు” “నాకు కనిపించలేదు..” “ఏదో గాయమైంది. నేను చూశాను..” మరి వినలేదు. మనసు కీడు శంకించింది. విక్రమ యుద్ధక్షేత్రం వైపు దూకింది. శవాలు కుప్పలు కుప్పలు. క్షతగాత్రులు.. వేలకు వేలు. వైద్య శిబిరాలు నిండిపోయి ఉంటాయి. చాలామందిని ఇక్కడే వదిలేశారు. యుద్ధం ఓడిపోయే స్థితికి చిహ్నం.. ఈ దుస్థితి. సగం చచ్చినవాళ్లు, కొనఊపిరితో ఉన్నవాళ్లు, చచ్చారో బతికారో వాళ్లకే తెలియనివాళ్లు, కాళ్లు సగం తెగినవాళ్లు, చేతులు విరిగినవాళ్లు, ముఖం సగంలేని వాళ్లు, కనుగుడ్లు బయటకు పొడుచుకువచ్చిన వాళ్లు.. హాహాకారాలు.. ఆర్తరావాలు.. ఏడుపులు.. మూల్గులు..
“దేవుడా! మమ్మల్ని తీసుకుపో..” ఉన్నట్టుండి బిగ్గరగా అరుపులు.. పెడబొబ్బలు.. ఇవన్నీ జాయచోడునికి అనుభవమే. అతని కళ్లు, మనసు, ప్రాణాలు ఒకే ఒక్కని కోసం వెతుకుతున్నాయి.. మామా.. మామా.. ఉన్నట్టుండి పెద్ద అరుపు.. “జాయా.. జాయ తండ్రీ..” భయపడిందే జరిగింది. వేగంగా ఆ పిలుపు వినిపించిన వైపు వెళ్లాడు. మబ్బుల మాటుగా భయంభయంగా చూస్తోన్న చంద్రుని మసక వెలుగులో సుబుద్ధి.. సుబుద్ధి సేనాపతి! ఎనభై ఏళ్ల కాకతీయ యుద్ధవీరుడు!! నాలుగైదు శవాలమధ్య డొక్కలో గుచ్చుకున్న పొడవాటి బరిసెను పట్టుకుని.. చావు బతుకుల మధ్య యమకింకరులతో పోరాడుతున్నాడు. “మామా..” ఆక్రోశపు గావుకేక.. జాయచోడుని నోటినుండి. చుట్టూ ఉన్న శవాలను ఇవతలకు లాగి.. సుబుద్ధిని ఒడిలోకి తీసుకున్నాడు. “అయ్యా.. జాయ తండ్రీ! నాకోసం వచ్చావా..” నీటి చెరువుల్లాంటి కళ్లు జాయచోడుణ్ని చూసి మెరుస్తున్నాయి. “మామా.. నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు..” బాధతో అరిచాడు జాయచోడుడు. “తప్పుచేశాను తండ్రీ! చెబితే నువ్వు ఒప్పుకోవని.. తప్పే..” “నిన్ను తీసుకువస్తానని అత్తమకు మాట ఇచ్చాను. లే.. నన్ను పట్టుకో..” నొప్పితో విలవిలలాడి పోతున్నాడు. డొక్కలోని బరిసెను సున్నితంగా లాగడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. “ఆలస్యమైంది జాయా! రెండు ఘడియలు.. రెండే రెండు ఘడియలు ముందువచ్చి ఉంటే బావుండేది. నీ కంటే ముందే యముడు నన్ను వాటేసుకు..” ఆకాశం దద్దరిల్లేలా పెనుకేకపెట్టి బరిసేను లాగేశాడు. మరుక్షణం ప్రాణాలు విడిచాడు. కళ్లు మాత్రం అల్లారు ముద్దుగా చూసుకున్న జాయతండ్రిని చూస్తూనే ఉన్నాయి. కుమిలికుమిలి ఏడవసాగాడు జాయచోడుడు. “ఓడిపోయాను అత్తమా! తొలిసారి.. మొదటిసారి.. యుద్ధభూమిలో కూడా ఓడిపోయాను”
* * *
చివరికి దురదృష్టం రుద్రమదేవినే వరించింది. ముఖ్యులైన సేనానుల శక్తిసామర్థ్యాలు సరిపోవడం లేదు. యుద్ధరంగం నుండి పారిపోతున్నారు. సైన్యం వెన్నుచూపింది. ఘోర అవమానం! రుద్రమను యుద్ధరంగంలో ఘోరంగా అవమానించారు. “నీకెందుకు రుద్రమా యుద్ధం! పోయి వంట చేసుకో చాలు!! కత్తి తిప్పినా గరిటె తిప్పినట్లుగా ఉంది..” యుద్ధరంగంలో ఆమె రథం చుట్టూ చేరి హాస్యమాడసాగారు శత్రురాజులు. ఆమెను చుట్టుముట్టి సంహరించే సమయానికి ప్రసాదిత్య ఆమెను కాపాడి.. యుద్ధభూమినుండి తప్పించి దూరంగా తీసుకుపోయాడు. ఫలించని యుద్ధ వ్యూహాలు, మొద్దుబారిన కత్తులు, కాళ్లువేళ్లు తెగిన అశ్వాలు, తొండాలు లేని ఏనుగులు.. కాకతీయ స్కంధావారం పీనుగుల పెంటలా ఉంది. గణపతిదేవుని జీవితంలో మొదటి పరాజయం. ఘోర ఓటమి. ఇంతవరకూ లేని అవమానం ఇప్పుడు ఈ వయసులో అనుభవమయ్యింది. ఆయన కళ్లవెంట నీరు రావడంలేదు. రౌద్రంగా విస్ఫులింగాలు వెదజల్లుతున్నాయి. మళ్లీ కత్తిపట్టి యుద్ధరంగానికి వెళ్లాలని ఉంది. ప్చ్.. పరిచారికలు పట్టిలేపితే కానీ కదలక శిథిలమై సహకరించని శరీరం.. నారాంబ మంచం పట్టింది.
దీపాలుకూడా వెలిగించని నివాసంలో జాయచోడుడు.. చీకటిలో ఒంటరిగా.. ఆంధ్రనగరి తన చండప్రచండ వెలుగులు కోల్పోయి స్తబ్ధుగా ఉంది. అత్యంత దారుణంగా ఓడిపోయిన కాకతీయసేన అవమానభారంతో ఆంధ్రనగరికి తిరిగి వస్తోంది. తిరిగివస్తున్న ప్రతి రథంలోనూ శవాలు. ప్రతి ఎడ్లబండిలోనూ క్షతగాత్రులు.. ఎదురేగి భర్త, అన్న, తమ్ముడు మరణవార్త తెలుసుకుని కుమిలిపోతున్నారు అతివలు. మరోపక్క సతీసహగమనాలు. ఆంధ్రనగరి పౌరులెవ్వరూ మెతుకు ముట్టలేదా రోజు. రుద్రమదేవి మౌనంగా విలపిస్తోంది. ఆమె కంట కన్నీరు కాలువలు కడుతోంది. మహానేత గణపతిదేవుని చరిత్రలో ఓడిన ఒకేఒక్క యుద్ధం! ఈ యుద్ధం ముత్తుకూరులో శ.సం. 1185 రుదిరోద్ఘారిలో జరిగినట్లు చరిత్ర లిఖించింది. అన్ని శవాలతో పాటే సుబుద్ధి శవం కూడా ఎడ్లబండిలో అనుమకొండ చేరింది. వెంటే ఉన్నాడు జాయచోడుడు. బలింజవాడ మొగదలలోనే కొడుకులు ఎడ్లబండిని అందుకున్నారు. ఇంటి దగ్గరకు వెళ్లలేకపోయాడు. వెనక్కు తిరిగాడు. రెండురోజుల తర్వాత మరో ఘోరం విన్నాడు. బాలాంబ అత్తమ సుబుద్ధి మామతో సహగమనం చేసింది!! తల కుడ్యానికేసి బాదుకున్నాడు.. నిస్సహాయుడైన జాయచోడుడు. సుబుద్ధి శ్రాద్ధకర్మల వేళ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన బిరుదులు, వంశనామం.. ఇత్యాదులు త్యజించాడు. సుబుద్ధి మామ సేనాపతిగా మరణించాడు. ఆయన గుర్తుగా.. అదే తన పేరుతో ఉంటుంది. ఇకపై తను జాయచోడుడు కాదు.. జాయసేనాపతి!!
ముత్తుకూరు యుద్ధ ఓటమికి ఆనందించి పండుగ చేసుకున్నవాడు అనుమకొండలో ఒక్కడున్నాడు. వాడే కాకతీయ వారసుడిగా చెప్పుకొనే మురారిదేవుడు. తల్పంపై కదలలేని తండ్రి.. అయోమయంగా వెర్రి చూపులు చూస్తున్న తల్లి.. ఓటమితో మందిరం దాటని అక్క రుద్రమ. మురారి ఆడింది ఆట. పాడింది పాట. విశృంఖల నియంతృత్వం వేయిపడగల మహాసర్పమై పడగవిప్పింది. ఆంధ్రనగరి అతని ఆటస్థలమైంది. సంఘీయుల నియోగం, ప్రజావార్త సంబంధి నియోగాలను తొలగించాడు. రాజప్రాసాదంలో ఏం జరుగుతున్నదో పురవాసులకు తెలియడం లేదు. ప్రజల అభిప్రాయాలేమిటో పాలక నియోగాలకు తెలియడం లేదు. మురారిదేవులవారు పలికిందే వేదం.. చెప్పిందే చట్టం! ఆ సమయంలో కాకతీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన, విభ్రాంతికరమైన సంఘటన ఆంధ్రనగరిలో సంభవించింది. రుద్రమదేవి నిత్యమూ కేతకిపురం గ్రామంలో ఆమె కట్టించిన ఏకవీరాదేవి ఆలయానికి వెళ్లి దేవిని అర్చించి వస్తుంటుంది. ఓరుగల్లులో ఉంటే అది నిత్యకృత్యం. ఆరోజు కూడా ఆమె వెళ్లింది. ఆంధ్రనగరికి కేతకిపురం అర్ధ గవ్యూతి దూరం.
ఆమె ఒక్కొక్కసారి పల్లకిలోనూ, జంట అశ్వాల రథంలోనూ, ఒంటరిగా సొంత అశ్వంపైనా వెళ్తుంటుంది. అంగరక్షకులైన లెంకల బృందం అనుసరిస్తుంది.
ఈరోజు కూడా లెంకల బృందం అనుసరించగా పల్లకిలో వెళ్లింది. గుడిలో పూజాపునస్కారాలు పూర్తయ్యాక తిరిగి వస్తోన్నవేళ.. ఆమె బృందాన్ని ఓ ముసుగు వీరుల బృందం అనుసరిస్తున్నట్లు లెంకల నాయకుడు కృష్ణమలెంక పసిగట్టాడు. పల్లకి పక్కగా నడుస్తున్న ఆమె వ్యక్తిగత సహాయకుడు కుశనాయణ్ని హెచ్చరించాడు. ఆయన ఆమెకు నివేదించాడు. అప్పటికే ముసుగువీరులు లెంకలపై విరుచుకుపడ్డారు. లిప్తకాలంలో రుద్రమ పల్లకినుండి ఉరికి కుశుని నుండి తన ఖడ్గాన్ని అందుకుని ఓ అశ్వాన్ని అధిరోహించి ఉరికించింది. లెంకల బృందానికి, దుండగులకు మధ్య పోరు.. అదే సమయంలో ఓరుగల్లులో కలకలం… సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేశారని వార్త. ముసుగులతో ఉన్న దుండగులు కొందరు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. “అందరూ ఇళ్లలోనే ఉండండి. ఎవ్వరూ బయటకు రాకండి..” అని అరుస్తూ ఎదురైనవారి తలలు తెగ నరుకుతూ వీధులన్నీ నిర్మానుష్యం చేస్తూ అశ్వాలపై తిరుగుతున్నారు. ముందే నిర్ణయించుకున్నట్లు కోట ప్రాకారాల మహాద్వారాలను మూసివేస్తున్నారు. ఈ హఠాత్పరిణామానికి పౌరులు బిత్తరపోయి చూస్తూ అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్నారు. అది సైనిక తిరుగుబాటు అని. ఈ దారుణానికి నాయకుడు ఎవ్వరో ఎవ్వరికీ తెలియడం లేదు.
ముత్తుకూరు యుద్ధ ఓటమికి ఆనందించి పండుగ చేసుకున్నవాడు అనుమకొండలో ఒక్కడున్నాడు. వాడే కాకతీయ వారసుడిగా చెప్పుకొనే మురారిదేవుడు.