జరిగిన కథ : జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, ‘గీత రత్నావళి’, ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించిన పర్వదినం. ఆ రోజున గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పట్టమహిషి సమేతంగా సమావేశానికి విచ్చేశాడు. దాదాపు ఐదు వందలమంది మహామహా గ్రంథకర్తలు, కవి గాయక నాట్య పండితోత్తములతో పేరోలగం ఇంద్ర సభామందిరంలా భాసిస్తోంది. మహాజ్ఞాని, అపర నటరాజు, మహాయోధుడు అయిన జాయచోడుణ్ని తెలుగుజాతి వేనోళ్ల కీర్తిస్తూ.. గర్వంతో మీసం మెలివేసుకుంది. ఈ మహోత్సవంలో దిగ్దంతులైన పండితులు ఉపన్యసిస్తున్నారు.
“తెలుగు భాషలో అనేక నాట్య రూపకాలు, యక్షగానాలు రచించారు. అవన్నీ పండిత పామర ఆదరణ పొందుతున్నాయి. కానీ ఈ లాక్షణిక గ్రంథాలు అన్ని రాజ్యాలలో అన్ని ప్రాంతీయ భాషలవారికి కూడా ఉపయుక్తంగా ఉండాలని, రానున్న యుగాలలో కూడా అందరికీ అందుబాటులో ఉండాలని సంస్కృతంలో రచించాడు. పూర్తిస్థాయి తెలుగుసమాజం ఏర్పడ్డ ఈ తొలికాలంలో తెలుగు సాహిత్యంలో.. గాన, గేయ, వాద్య కళల్లో అనేకానేక సంప్రదాయాలు ఏర్పడుతున్నాయి. ఆగామికాలంలో వచ్చే ప్రవృత్తులపై, సంప్రదాయాలపై అన్నింటిపైనా శ్రీమాన్ జాయచోడుల ప్రభావం ఉంటుందని రూఢిగా చెప్పగలను. భవిష్యత్తులో తెలుగునేలపైనే కాదు.. దక్షిణావర్తంలో పుట్టే సమస్త నాట్యమేళాలకు, నాట్య సంప్రదాయాలకు ఆయనే ఆదిపురుషుడు. ఆ సంగతి దక్షిణాదిరాజ్యాలు ఎన్నడూ మరచిపోకూడదు. అందుకు కారణం దక్షిణాది గ్రామగ్రామాన విస్తరించిన వెలనాడు కళాకారులు అనేది ఆగామి కాలం చెప్పుకొంటుంది. ఆయన వెలనాడు పాలకుడు కావడం వల్ల ఆర్థిక పరిపుష్టి కలిగించడం, స్వయంగా నాట్యస్రష్ట, నాట్యద్రష్ట కావడంవల్ల వెలనాడు కళాకారులు, పండితులు సృష్టించే కొత్త కొత్త ప్రయోగాలను ప్రోత్సహించడం వల్లనే వేరువేరు రాజ్యాలకు వెళ్లి వినూత్న నాట్య, యక్షగాన ప్రయోగాలను ఊరూరా వ్యాపింపజేస్తున్నారని చెప్పగలను”
తర్వాత జాయచోడుని వెలనాడు జీవితాన్ని మొత్తంగా చూసిన ఆత్మీయ మిత్రుడు, అనుచరుడు పరాశరుడు మాట్లాడాడు. “ఒక మండలేశ్వరుడు ఆ రాజ్యంలో సాధారణ పురుషుడుగా తిరగడం.. ఒక్కరోజు కాదు.. కొన్నేళ్లు తిరగడం మీరు చేయగలరా!? ఓ పంచమకుల మహిళకు గురువుగా కృష్ణమ్మ సైకతంపై మీరు నాట్యం నేర్పగలరా!? ఆమెవెంట మీరు కృష్ణమ్మ వరదల్లో తెల్లవార్లూ ఓ తాడిచెట్టుపై బతకగలరా!? ఓ వృద్ధగుడిసాని కోసం ఓ నాట్య గురుకులం మీరు నిర్మించగలరా!? ఓ అగ్రహారం మొత్తాన్ని మీరు నాట్యాగ్రహారం చేయగలరా!? ఓ డప్పు కళాకారుడి నుంచి మీరు ప్రేరణ పొందగలరా!? నాట్యం కోసం, కాకతీయ సామ్రాజ్యం కోసం.. మీరు మీ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయగలరా..??” చెబుతూ రానురానూ ఉద్వేగంతో కంఠం గాద్గదికం కావడంతో చెప్పలేక మౌనంగా రోదించాడు పరాశరుడు. సభ యావత్తూ ఉద్వేగంతో ఊగిపోయింది. కళ్లు తుడుచుకుని ముగింపుగా అన్నాడు.. పరాశరుడు.
“జాయచోడులవారి జీవితమే లోకధర్మి, నాట్యధర్మిల సమ్మేళనం.. అపూర్వ సమ్మేళనం!” చప్పట్లతో భవనం మారుమోగిపోయింది. పక్కగా కాకతి ఆనందబాష్పాల ధ్వని వినిపించడంతో ఉత్తరీయంతో కళ్లు తుడుచుకున్నాడు జాయచోడుడు! తర్వాత ఆయన లేచి అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
“గీతం, నాట్యం, సంగీతం నిరంతర ప్రవాహశీలమైనవి. ఆదిమ, చరిత్ర పూర్వ యుగాలనుండి ఇవి నిరంతరం కొత్త కొత్త మార్పులు చెందుతూ, కొత్తవాటిని కలుపుకొంటూ, మనలను అలరిస్తూ, అంతర్లోకాలకు తీసుకుపోతూ హృదయానందం కలిగిస్తున్నాయి. ప్రాంతీయ భాషలు స్పష్టం కావడంతో లిఖిత సాహిత్యం, కళారూపాలు కూడా సమున్నతంగా వికసిస్తున్నాయి. నిన్నటివరకు ఉన్నవాటిని పరిశీలించి నేటి సమాజంలో ఉన్నవాటిని ఒడిసి పట్టి.. గ్రంథరూపం ఇచ్చాను. ఇప్పటికి నృత్త రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి సంపూర్ణమయ్యాయి. అలాగే యుద్ధ తంత్రాలపై యుద్ధ తంత్రావళి కూడా ప్రారంభించాను. అది సంపూర్ణం అయ్యాక దానిని మీ సమక్షంలో సార్వభౌములవారికి సమర్పిస్తాను. ఇవి లాక్షణిక గ్రంథాలు. అందువల్ల వాటికీ చిరయశస్సు ఉండాలని మాతృభాష తెలుగులోకాక దేవనాగరిలో లిఖించాను. మళ్లీ కలియుగాంతం తర్వాత ఆగామియుగంలో ఆ భరతమహర్షి నా ఈ గ్రంథాన్ని తప్పక చూస్తాడని నేను కలలు కంటున్నాను. నా గ్రంథం ఏమాత్రం నా కలను నెరవేరుస్తుందో ఆగామి కాలం చెప్పాలి. నేను నేనుగా చెప్పుకోవడానికి నాకేమీ లేదు. నా సర్వస్వం నా దైవం మహామండలేశ్వరులు శ్రీగణపతిదేవులే! నన్ను గుర్తించి నాట్యం నేర్పించినా.. యుద్ధానికి సిద్ధం చేసినా.. గ్రంథం రాయమని ఆదేశించినా ఆయనే. కాబట్టి ఏదైనా నేను చేశాను అనేది ఉంటే.. అది ఆ మహానుభావుడికే దక్కుతుంది. ఇక నా రచనలోని అంశాలు నేను చెప్పడం కంటే మా నాట్యమేళం చేసి చూపిస్తారు” తర్వాత జాయచోడుని రచనలో సహకరించిన విభిన్న నాట్యబృందాలు తాము నేర్చుకున్న కొత్త ప్రయోగాలను రోజుకో బృందం జాయచోడుని వివరణతో ప్రదర్శించి చూపారు. అన్ని బృంద నాట్యాలవెంట జాయునికి సైదోడు కాకతి.. కొత్త రాజధాని ప్రారంభోత్సవం, జాయచోడుని గ్రంథాల ఆవిష్కరణ.. ఓరుగల్లును కళల రాజధానిని చేశాయి. విచ్చేసిన ప్రముఖులందరూ జాయ నాట్యమేళం ప్రదర్శనలతోపాటు ఆంధ్రనగరిలోని అందచందాలను, అద్భుతాలను చూసి మైమరచిపోయారు. గణపతిదేవుడు, రుద్రమదేవి, మురారిదేవుడు ఆ మాసంరోజుల కాలం ఆహూతులను విందు వినోదాలతో పూర్తి రాచమర్యాదలతో గౌరవించి వీడ్కోలు పలికారు. శ. సం.1164 ఆనంద నామ సంవత్సరంలో జరిగిన ఈ బృహత్తర చారిత్రాత్మక సంఘటనలకు ఓ అద్భుతంతో ముగింపు లభించింది. అది రుద్రమదేవి అమ్మమ్మ కావడం. ఆమె పెద్ద కుమార్తె ముమ్మడమ్మ క్షేమంగా ప్రసవించింది. మగ శిశువు. నామకరణం చేశారు.. ప్రతాపరుద్రుడు అని.
* * *
‘ఎన్నాళ్లు ఈ కాకతీయ సామ్రాజ్యానికి కప్పాలు కట్టి బతకాలి? మధ్యాహ్న మార్తాండునిలా ప్రకాశించిన తెలుగు చక్రవర్తి గణపతిదేవుడు వృద్ధాప్యంతో బాధపడుతున్నాడు. రాణిరుద్రమ మహాయోధురాలే కానీ, ఆడదాని పెత్తనమా.. శాస్త్రం ఒప్పదు. కొడుకు యుద్ధానికి తక్కువ.. కర్ర పెత్తనానికి ఎక్కువ. వాడు యుద్ధానికి రాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాకతీయ వంశాన్ని నిర్మూలించలేము’ ఇది శత్రువుల అభిప్రాయం. అఖండ భారతరాజ్యాల చరిత్రలో దక్షిణాపథం లాంటి ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో ఉన్న ఆంధ్ర సామ్రాజ్యం మహాపురుషుడు గణపతిదేవ చక్రవర్తి సారథ్యంలో అఖండంగా వెలుగొందుతుండగా.. ఆయన వృద్ధాప్యదశకు చేరుకున్నారని.. ఆయన స్థాయి వారసులు లేరని గట్టిగా నమ్మిన శత్రువులంతా ఏకమయ్యారు. కత్తి కట్టారు. యుద్ధ ప్రకటన చేశారు. ప్రధానంగా దక్షిణం నుండి పాండ్యరాజు, ఈశాన్యం నుండి కళింగ గాంగ నారసింహుడు, ఉత్తరాన దేవగిరి మహాదేవుడు కాకతీయ వంశాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా ఏకమై మంత్రాంగాలోచనలు చేస్తున్నట్లు యుద్ధ గూఢచారుల విశ్వసనీయమైన సమాచారం. కొద్దిరోజులకు అది నిజమైంది. మహాయోధురాలు రుద్రమదేవి క్రోధంతో రగిలిపోయింది. తండ్రి స్థాపించిన ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి ఎవరు సంకల్పించినా చూద్దాం లెమ్మని వదలి వేయరాదు. చిన్నపాముపై అయినా పెద్దకర్రతో దాడి చేయాల్సిందే! “మూడు వైపులా సిద్ధమే. ముగ్గురూ కలిసి వచ్చినా సిద్ధమే.. మీ శిరస్సులతో కందుక క్రీడలాడి మా కీర్తి తోరణాలకు వేలాడదీస్తాను..” రుద్రమదేవి యుద్ధరావాలతో.. కాకతీయయోధుల కరవాలాల కణకణ శబ్దాలతో అనుమకొండ యుద్ధ ఉద్వేగంతో రగిలిపోతోంది. కాకతీయ సామ్రాజ్య మహా సైనిక పారావారం పూర్తి యుద్ధ సన్నద్ధమైంది.
మొదట దక్షిణం వైపుగా కదిలింది రాణిరుద్రమ మహాసేన. సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రసాదిత్యనాయకుడు ఆమె వెంబడి ఉండగా.. గోన గన్నారెడ్డి సారథ్యంలో కొన్నిసేనలు, కొందరు సామంత రాజులు.. మల్యాల కాటయ నాయకత్వాన మరొక పటాలం, మరికొందరు సామంతరాజులు కలసి మరోవైపు.. చెరకు బ్రహ్మిరెడ్డి ఆధ్వర్యంలో మరోపటాలం ఉత్తరానికి.. ఇలా తెలుగునేల అంతా కాకతీయ సైన్యం మోహరించింది. ఓ శుభ ముహూర్తాన దక్షిణం నుండి పాండ్యరాజు, ఈశాన్యం నుండి కళింగ గాంగ నరసింహుడు, ఉత్తరాన దేవగిరి మహాదేవుడు రుద్రమదేవిని ఓడించడమే లక్ష్యంగా ఏకమై కదిలారని వార్తలు వచ్చాయి. కంచి, తంజావూరులను అప్పటికే వశపరచుకున్న పాండ్యులు మొదట సింహపురిపై దాడికి కదిలారు. వెంటనే రుద్రమ తన సైన్యాన్ని అటు మళ్లించింది.
అయితే పాండ్యరాజు.. కొప్పెరుజింగ నాయకత్వంలో కొంత సైన్యాన్ని సింహపురి వెళ్లకుండా దారిమళ్లించి కాకతీయ సైన్యంపైకి ఎదురు పంపాడు. పాండ్యుల తెలివి పసిగట్టిన రుద్రమ తన సైన్యాన్ని చీల్చి.. కొంత సింహపురి వైపు, కొంత పలనాడువైపు పంపింది. కానీ, కొప్పెరుజింగ పలనాడువైపు వచ్చిన విరియాల సూరన నాయకత్వంలోని కాకతీయ సైన్యాన్ని మట్టి కరిపించాడు. త్రిపురాంతకం వద్ద కాకతీయులను ఊచకోత కోశాడు. వందలమంది కాకతీయ యోధులు త్రిపురాంతక యుద్ధంలో చనిపోయారు. విరియాల సూరన కాలికి బుద్ధి చెప్పి పారిపోయాడు. అటు సింహపురి చేరిన రుద్రమదేవికి ఓటమి అంచున ఉన్న అక్కడి సైన్యం స్వాగతం చెప్పింది. ఆమె వెనువెంటనే యుద్ధభూమికి చేరి విశ్వప్రయత్నం చేసింది గానీ, పరాజయాన్ని ఆపలేకపోయింది. ఉత్తరం వైపు వెళ్లిన కాకతీయ సైన్యం స్కంధావారం నిర్మించి యుద్ధపిలుపు ఇచ్చింది. కానీ మౌనం! దేవగిరి పాలకుడు యుద్ధతంత్రంలో భాగంగా మౌనంగా స్కంధావారంలోనే ఉన్నాడు. అక్కడ ఆ పటాలం ఖాళీగా స్కంధావారంలోనే ఉండిపోయింది. అలాగే ఈశాన్యంలో కళింగులు కూడా యుద్ధతంత్రంలో భాగంగా మౌనంగా స్కంధావారంలోనే ఉండిపోయారు. అప్పటికిగానీ రుద్రమదేవికి శత్రువుల ఉమ్మడి వ్యూహం అర్థంకాలేదు. కాకతీయ సైన్యం చిన్నచిన్న పటాలాలుగా విడిపోయి తలోదిక్కున ఉండిపోయి బలహీనమైంది. తెప్పరిల్లిన రుద్రమ త్రిపురాంతకం చేరి అక్కడ మిగిలిన సైన్యాన్ని కలుపుకొని మెరుపువీరులైన ఎక్కట్లను అప్రమత్తం చేసి కొప్పెరుజింగపైకి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడున్న కాటయ నాయకత్వంలోని కాకతీయ పటాలం వెనుదిరిగింది. ఇప్పటికే కంచిని, సింహపురిని కూడా పూర్తిగా కోల్పోయిన రుద్రమ.. దిక్కుతోచక నిలబడి పోయింది. కానీ, పాండ్యులు కాకతీయులను వదలకుండా వెంటపడి తరమసాగారు. రెండు పెద్ద సైనికశక్తులు.. పాండ్యులు, కాకతీయులు ముత్తుకూరు వద్ద తలపడ్డాయి. తీవ్రమైన యుద్ధం.. రెండువైపులా వీరాధివీరులు తలపడ్డారు. జటావర్మ సుందర పాండ్యుడు, భువనైక వీరవిక్రమ పాండ్యుడు, జటావర్మ వీరపాండ్యుడు ముగ్గురు పాండ్యరాజులు స్వయంగా యుద్ధంలో పాల్గొనగా.. ఇటు మహాయోధురాలు రుద్రమ, ఆమెతో ఉన్న ప్రసాదిత్య, చెరకు బ్రహ్మిరెడ్డి, ఇనగాల కాచయరెడ్డి, సాంబనాయకుడు, సారంగదేవ, కొప్పెరుజింగ.. అందరూ మహాయోధులే. కానీ.. కానీ.. పరాజయ చిహ్నాలే ఎక్కువ! కనుచూపులోకి వచ్చేసింది ఓటమి!!
* * *
కాకతీయ రాజప్రాసాదం. దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. ఆరోజు రాజప్రాసాదంలోని తన మందిరంలోనే ఉన్నాడు జాయచోడుడు. తల్పంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు కానీ నిద్ర పట్టడం లేదు. ఏదో తెలియని చెప్పరాని ఇబ్బంది.. లోలోన. యుద్ధవార్తలు భయపెడుతున్నాయి. రుద్రమ ఓటమితో పెనుగులాడుతున్నట్లు.. ఆముదపు దివిటీల వెలుగులో అతివిశాలమైన ఆ రాజప్రాసాదం నిస్తేజంగా ఉంది. నిశ్శబ్దం భయపెడుతున్నట్లుంది. అప్పుడే ద్వారం వద్ద అలికిడి.. రాత్రి ద్వారపాలకుడు ద్వారం తట్టి పిలిచాడు. “ప్రభూ.. తమరికోసం ఎవరో పెద్దామె..” ‘పెద్దామె..??’ దుప్పటి విసిరేసి చివ్వున లేచి బయటకు వచ్చాడు.
వందలమంది కాకతీయ యోధులు త్రిపురాంతక యుద్ధంలో చనిపోయారు. విరియాల సూరన కాలికి బుద్ధి చెప్పాడు. అటు సింహపురి చేరిన రుద్రమదేవికి ఓటమి అంచున ఉన్న సైన్యం స్వాగతం చెప్పింది. ఆమె వెనువెంటనే యుద్ధభూమికి చేరి విశ్వప్రయత్నం చేసింది గానీ, పరాజయాన్ని ఆపలేకపోయింది.