జరిగిన కథ : అది కాకతీయ సామ్రాజ్య చరిత్రలోనే మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై రచించిన ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించి.. గణపతిదేవునికి అంకితమిచ్చి జాతికి అందించిన మహాపర్వదినం. ఆ పుణ్యదినాన గణపతిదేవుడు నిండు పేరోలగాన్ని ఏర్పాటుచేసి.. పూర్తి సభాలంకరణలతో పట్టమహిషీ సమేతంగా ఆ సమావేశానికి విచ్చేశాడు. మహాజ్ఞాని, అపర నటరాజు, మహాయోధుడు అయిన జాయచోడుణ్ని తెలుగుజాతి వేనోళ్ల కీర్తిస్తూ గర్వంతో మీసం మెలివేసుకుంది. పండితులు, కవులు, సంగీతజ్ఞులు, నాట్యకారులు, విద్యావేత్తలు.. జాయచోడుని మహా మేధావిత్వానికి వివశులయ్యారు.
సంసార విష వృక్షస్య.. ద్వీ ఫలే అమృతోపమే
కావ్యామృత రసాస్వాదః.. సంగమ స్సజ్జనై స్సహ॥
సంసారమనే ఈ విషవృక్షానికి రెండే రెండు అమృత ఫలాలు ఉన్నాయి. మొదటిది కావ్యామృత రసాస్వాదనం, రెండోది సత్పురుషుల సహవాసం. అలాంటి సత్పురుషులు మన ముందు ఇద్దరున్నారు.
ఇద్దరూ పుంభావ సరస్వతులే. ఒకరు మహాభారతాన్ని తెనిగిస్తున్న మహాకవి తిక్కనార్యులు, మరొకరు మన కాకతీయ మహాయోధుడు శ్రీమాన్ జాయచోడులు. శ్రీ జాయచోడులవారు రచించిన మూడు గ్రంథాలు నాచేతిలో ఉన్నాయి. వీటిని పట్టుకున్న నా అదృష్టం ఏమని చెప్పను. జాయచోడులవారితో నిత్యం సభను పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం. శివుని నృత్తరూపమే నటరాజ రూపం. నృత్తం జాయచోడులవారికి అత్యంత ఇష్టం. కళాకారులకు రంగభూమే యుద్ధభూమి. జాయచోడుల వారికి యుద్ధభూమి కూడా రంగభూమే. ఇలా యుద్ధ విశారదులు.. నాట్య కోవిదులు కావడం, లాక్షణికులు కావడం, గ్రంథ రచయిత కావడం భగవత్ సృష్టిలో అరుదుగా జరిగే సంఘటన. ఆయన గణపతిదేవులు అనే రామునికి ఆంజనేయుడి వంటివాడు. ఈ రచనల్లో ఆయన గణపతిదేవులపై తన కృతజ్ఞతను చాలా గొప్పగా రాశారు.
ప్రేక్ష్యా ప్రజ్ఞామతిశయ వతీం స్వామీ భక్తంచ హర్షాత్
అకౌమారాత్ గణపతి నృపో జాయనం యం సమర్ప్య
గుండామాత్యే సకల సుమనస్సేవ్యమానే జయంతం
వాచాం పత్యౌ హరిరివ కలాం శ్లాఘనీయం వ్యనీషత్
అంటే.. నాలోని గొప్పప్రజ్ఞను, స్వామిభక్తిని గమనించి సంతోషంతో చిన్ననాడే మహాగురువు గుండయామాత్యునికి ఇంద్రుడు బృహస్పతికి జయంతుని అప్పగించినట్లు.. జాయపుణ్ని అప్పగించి శ్లాఘనీయమైన కళను నేర్పించారు. అని రాసి, గణపతిదేవులవారికి తన కృతజ్ఞతలు చెప్పుకొన్న వినమ్రశీలి. నాట్యశాస్త్రం రచించిన భరతముని ఆయనకు దైవసమానులు. భరతముని నామాన్ని నృత్తరత్నావళిలో ఏభైసార్లు వాడారు. అలాగే తనకంటే ముందు గ్రంథకర్తలైన కోహలుడు, తుంబురుడు, మాతంగుడు, భట్ట తండువు, కీర్తిధరుడు, శంకుకుడు, అభినవగుప్తుడు, సోమేశ్వరుడు, నందికేశుడు మొదలైనవారు రచించిన గ్రంథాలను పఠించడమే కాదు.. వారినందరినీ పేరుపేరునా తన గ్రంథాలలో స్మరించారు. అంతేకాదు తన సమకాలికులైన మహామహులను ఈ సభకు ఆహ్వానించారు. వారి రచనలను కూడా తన గ్రంథాలలో పేర్కొనడం ఆయన గొప్పతనం. ఈ తులనాత్మక విశ్లేషణ కూడా తెలుగు లాక్షణిక గ్రంథాలలో బహుశా మొదటిసారి కావచ్చు. ఈ గ్రంథాలను మహామండలీశ్వరులు గణపతిదేవులవారికి అంకితం ఇవ్వడం ముదావహం. ఆ అంకిత కార్యక్రమం ఇప్పుడు మనం దర్శించి తరిద్దాం..
కన్యాదాన తరహాలో కృతిని అంకితం ఇవ్వడానికి ఆదిమూలం కూడా మహాపురుషుడు జాయచోడుడే. తర్వాత విప్రులు, వేదవేదాంగ పండితులు, తిక్కనార్యుడు వివాహమంత్రాలు పఠిస్తుండగా.. వివాహక్రతువులో కన్యదాత వరుడి కాళ్లుకడిగి కన్యాదానం చేసినట్లు జాయచోడుడు గణపతిదేవుని పాదాలు బంగారుపళ్లెరంలో ఉంచి గంగాజలంతో అభిషేకించి తనకృతులను కూతురినిచ్చి వివాహంచేసిన తరహాలో కృతికర్తగా జాయచోడుడు, కాకతి దంపతులు.. కృతిగ్రహీత అయిన గణపతిదేవ దంపతుల కాళ్లుకడిగి.. అనంతరం కన్యాదానం చేసినట్లు మంత్రోచ్చారణల మధ్య గణపతిదేవుని చేతులలో ఉంచాడు. ఇద్దరు అక్కలనిచ్చి పెళ్లి చేసిన జాయచోడుడు.. ముగ్గురు కూతుళ్లనిచ్చి మరోమారు వివాహం చేశాడని కవులు చమత్కరించారు. కార్యక్రమం జరిగినంత సేపూ జాయచోడుడు కాకతి తోడుగా, ముకుళితహస్తుడై రాముని పాదాలవద్ద ఆంజనేయుడిలా గణపతిదేవుని పాదాలవద్ద భక్తితో ఒద్దికగా కూర్చున్నాడు. జాయచోడుని రచనలపై మహాకవి తిక్కన సోమయాజి విపులంగా ఉపన్యసించాడు. “మహామండలేశ్వరులు గణపతిదేవులు సాక్షాత్తూ దైవస్వరూపం. వారి ఏలుబడిలో ఆంధ్ర ప్రజలు సుఖశాంతులతో, అష్టయిశ్వర్యాలతో తులతూగుతున్నారు. ఇప్పటివరకూ చిన్నచిన్న తెలుగురాజ్యాలే ఉన్నాయి. తొలిసారి తెలుగు మాట్లాడే ప్రజలందరినీ కలిపి ‘ఆంధ్రులు’ అని, ఇది ఆంధ్ర రాజ్యమనే పదం వాడింది నేనే. తెలుగు మాట్లాడే ప్రజల రాజ్యమని.. దానిపేరు ఆంధ్రరాజ్యమని.. దిశదిశలా చాటి రాజధానికి ఆంధ్రనగరి అని పేరుపెట్టిన మహాపురుషులు శ్రీశ్రీశ్రీ గణపతిదేవ చక్రవర్తులు. ఇది అఖండ భారతంలోని రాజ్యాలవారంతా వేనోళ్ల శ్లాఘిస్తున్న అంశం. వారి మహోన్నత పాలనకు గుర్తుగా తరతరాలుగా నిలిచిపోయేవి వారి బావమరిది, కాకలుతీరిన కాకతీయ మహావీరుడు, మహోన్నత నాట్యకారుడు అయిన శ్రీమాన్ జాయచోడులవారు రచియించిన మూడు అత్యుత్తమ గ్రంథాలు. ఇదొక అద్భుత ఘట్టం.
ఎప్పుడో ఆదిమకాలంలో భరతముని రాసిన నాట్యశాస్త్రం తరహా ప్రామాణిక గ్రంథం తర్వాతి కాలంలో రాసినవారు లేరు. ఆయనకు తర్వాత సమాజంలో వచ్చిన ఆధునిక నాట్యరూపాలను కూడా కలిపి నాట్యశాస్ర్తానికి కొనసాగింపుగా రాసింది మన తెలుగువాడైన శ్రీమాన్ జాయచోడులవారు మాత్రమే.
మరో విశేషం ఏమిటంటే ప్రజల చిందులు, సంతోష విషాదాల సందర్భాలలో ప్రకటించే తమ భావాలను ఒడిసిపట్టి భరతముని ఆనాడు ఆ నాట్యగ్రంథం రాశారు. తిరిగి భాషారాజ్యాలు ఏర్పడ్డాక తెలుగు ప్రాంతాలలోని సనాతన తెలుగు నాట్యరీతులను తిరిగి సంభాళించి.. కొత్త దేశీనాట్యాలను సేకరించి మార్గినాట్యాలతో అనుసంధానం గావించారు. ఎక్కడో వీధులలో, గ్రామాలలో నర్తించే నాట్యాలు అనే చిందులను రాజనగరి స్థాయికి తెచ్చి కావ్యగౌరవం కలిగించారు. ఇంతవరకూ పంక్తిబాహ్యులుగా ఉన్న దేశీకళాకారులు ఇకనుండి తమ దేశీనాట్యాలను సగర్వంగా మండలేశ్వరుల సమక్షంలో ప్రదర్శించగల స్థాయి వారికి కల్పించారు. ఇదొక రంగస్థల విప్లవం.. సాంస్కృతిక విప్లవం. అందుకు వారికి నా వందనం. మా విక్రమసింహపురి రాజ్య ప్రజలకు గణపతిదేవ చక్రవర్తి, జాయచోడుడు, రాణి రుద్రమదేవి.. చేసిన మహోన్నత సహాయం మరచిపోలేము. ఎప్పుడు శత్రువులు చుట్టుముట్టినా వారిని దునుమాడి మా రాజ్యాన్ని పువ్వుల్లో పెట్టి మాకు అందించారు. జాయచోడులవారితో మా మైత్రి అద్భుతం. ఆ హరిహరుడు మాకిచ్చిన వరం. ఈ గ్రంథత్రయంలోని అంశాలను వారు నాకు విశదీకరించారు. వారివల్ల ప్రభావితుడనై నా మహాభారత రచనలో కూడా పొందుపరచాను. ఉదాహరణకు వ్యాస సంస్కృత భారతంలో విరాట పర్వంలో ఓ పద్యం ఉన్నది.
గాయామినృత్యామ్యథ వాదయామి భద్రోస్మి
నృత్తే కుశలోస్మి గీతే
త్వముత్తరాయః ప్రదిశస్వమాం
స్వయంభవామి దేవ్యా నరదేవనర్తకః ॥
బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు విరాటరాజుతో తన నాట్యకౌశలం గురించి చెప్తాడు. దానిని నేను తెలుగులో ఎలా రాశానో ఆ పద్యాలు చెప్తాను.
ఒండుపనులకు నెలవు లేకునికి జేసి
యభ్యసించితి శైశవమాదిగాగ
దండలాసక విధమును గుండలియును
బ్రేంఖణంబు తెరంగును బ్రేరణియును.
మరొక పద్యం..
విశ్రుత వాద్యములును మం
జుశ్రుతి సంభావ్య గీతసుగతులు సద్భా
వాశ్రయములు దజ్జన్య ర
సాశ్రయములునైన యభినయంబు లెరుగుదున్”.
.. తిక్కన మహాకవి తాను రాస్తున్న పద్యాలను శ్రావ్యంగా చదివి వినిపించడంతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. “సంస్కృతంలో లేని దేశీ నాట్యరూపాలను నేను తెలుగులో నా పద్యాలలో ఉటంకించాను. బృహన్నల తనకు దండలాసకం, ప్రేంఖణం, గొండ్లి, ప్రేరణి.. తెలుసునని అలాగే ఎన్నో వాద్యవిశేషాలు వాయించగలనని విరాట మహారాజుతో చెప్తాడు. ఇవి మూలరచనలో లేవు. వీటిని నేను నా తెలుగు పద్యాలలో పొందుపరచాను. అందుకు కారణం శ్రీమాన్ జాయచోడులవారు. అలాగే కీచకవధ ఘట్టంలోనూ సంస్కృతభారతంలో నర్తనశాల, నర్తన గృహం లాంటి పదాలు ఉంటే తెలుగు చేస్తున్నప్పుడు నాట్యగృహం, నృత్తశాల, నాట్యమందిరం లాంటి వర్తమాన పదాలు ఉపయోగించాను. ఇవన్నీ జాయచోడుడు చెప్పినవే. అలా భారత రచనలో ఆయన భావజాలం చేరింది. అది తరతరాలకు నిలిచి ఉంటుంది”.. ఉపన్యాసం ముగించి తిక్కనామాత్యుడు జాయచోడునికి సాష్టాంగ నమస్కారం చేయబోగా.. ఆయన కంగారుపడి తిక్కనను ఆపి, తనే సాష్టాంగ నమస్కారం చేశాడు. కాకతి కూడా సాష్టాంగం చేయడం జాయచోడునికి నచ్చింది. “మీ మహాభారత రచనలో నా దేశీనృత్యాలను చేర్చిన మీకు ఏమివ్వగలను!?..
నమస్కరించడం తప్ప”. అనంతరం పెద్దలంతా జాయచోడుని గ్రంథాలపై తమ అభిప్రాయాలను చెప్పారు. “గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే.. గీతం, వాద్యం, నృత్తముల చేరిక సంగీతం అనబడును. ఇది నేను రాసినవాక్యం. ఇది నేను భరతముని వర్యులనుండి గ్రహించాను. ఆయన ఈ మూడింటినీ సమ్మేళన పరచి నాట్యశాస్త్రం రచిస్తే, అదే ఒరవడిలో ఆయన తర్వాత మరికొన్ని కొత్త దేశీనాట్యాలను నాట్యధర్మిగా మార్చి దేశీ సంప్రదాయాలకు మహోన్నతస్థానం ఇచ్చిన గొప్ప నాట్య లాక్షణికుడు జాయచోడుడు. అందుకే ఆయన భరతుని తరువాత రెండవ భరతుడు. తెలుగు భరతుడు. ఆయన తెలుగువాడు కావడం తెలుగువారందరికీ గర్వకారణం”. – ‘సంగీత రత్నాకరం’ శార్ఘ్యదేవుడు. “నాట్యశాస్త్రంలో నృత్తం, తాండవం, నాట్యం అనే పదాలున్నాయి కానీ, నృత్యం అనేది లేదు. నృత్త నామంపై మరెవ్వరూ ఇప్పటివరకు రచనలు చేయలేదు. ఇకపై చేయలేరు. కారణం ఇప్పటికే నృత్తానికి నృత్యానికి భేదం తెలిసినవాళ్లు తగ్గిపోతున్నారు. నృత్త సంప్రదాయాలకు వ్యాఖ్యానాలు, తాత్పర్యాలు రాసేవాళ్లు నృత్తానికి బదులుగా నృత్యం అని రాసేస్తున్నారు. నృత్తం, నృత్యం, నాట్యం మూడూ తెలిసిన ఆయన నృత్త రత్నావళి అని దీనికి పేరు పెట్టడంలో గొప్ప ఔచిత్యం ఉంది. నాట్యం, గానం, గేయం, సంగీతం, వాద్యం ఉన్నంతవరకు ఆయన సజీవుడు”
– ‘సంగీతసమయసారం’ రచించిన పార్శ్వదేవుడు.
“ఆయన ఆదిమకాలం నాటి సమస్త ప్రాకృత సంస్కృతభాషలలోని వైదిక వేద, వేదాంగ, బౌద్ధ, జైన సాహిత్యాన్ని ఆమూలాగ్రం చదివాడు. పరిశీలించాడు, పరిశోధించాడు. భారతీయసాహిత్యంలో ఆయనకు తెలియని కవిలేడు. గ్రంథం లేదు. ఆయన అపారమైన లోకజ్ఞత, శాస్త్రజ్ఞత, ధర్మజ్ఞత, కావ్యజ్ఞత, తత్వజ్ఞత కలిగినవాడు. వర్తమాన రాచరికవ్యవస్థలో ఆయనకున్న లోకానుభవం, పుస్తకానుభవం, ప్రదర్శనానుభవం మరెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదు”
-‘దేశీనృత్త సముద్రం’ రచించిన నారదుడు.
“మరో గజసాహిణి పుట్టొచ్చు. కానీ, ఆయన నాట్యాచార్యుడు కాలేడు. మరో నాట్యాచార్యుడు పుట్టొచ్చు. ఆయన యుద్ధవీరుడు కాలేడు. యుద్ధవీరుడు, నాట్యాచారుడు, మండలేశ్వరుడు కాలేడు. ఆయన ఆ మూడింటి మహోన్నత అంతర్లీనం! అలాగే ఒక్కడు నాట్యాచార్యుడు, గేయ శిరోమణి, వాద్య విజ్ఞానుడు కాలేడు. ఆయన ఆ మూడింటి అంతర్లీనం!! అందుకే అంటున్నాను.. మరో జాయచోడుడు పుట్టడు. పుట్టడు. పుట్టడు!!”
– దాచిన ప్రగ్గడ, కూసెనపూండి కళాక్షేత్రం నిర్వాహకుడు.
“సాహిత్య ప్రయోజనాలు రెండు. అవి ఆనందం, ఉపదేశం. నాది శివోపదేశమైతే జాయచోడుల వారిది శివానందం. మా గురుదేవులు పండితారాధ్యులవారి జన్మప్రదేశానికి పాలకులుగా జాయపులు నాకు అత్యంత ఆదరణీయులు”
పాల్కురికి సోమనాథుడు.
భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై రచించిన ‘వాద్య రత్నావళి’ అనే మూడు మహాగ్రంథాలను ఆవిష్కరించి.. గణపతిదేవునికి అంకితమిచ్చి జాతికి అందించిన మహాపర్వదినం.
(సశేషం)
– మత్తి భానుమూర్తి
99893 71284