Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బావ. అప్పుడప్పుడూ ఎవరో తన భుజానికి తాకుతూ నిలబడినట్లు.. కాకతి! ఇప్పటికీ దేవాలయాల్లో కాకతి కోసం వేయికళ్లతో వెదుకుతాడు. ప్చ్! ఆశ.. నిరాశ! కాదుకాదు.. నిరాశ కాదు కేవలం ఆశ!
పుర నివాసంలోని మొదటి అంతర్వు. గవాక్షంవద్ద నిలబడి.. వీధులను పరికిస్తున్నాడు జాయపుడు. ఏదో ఆలోచనల్లో మునిగిపోయాడు. వెనక ఏదో అలికిడి. చటుక్కున చేతులు మహావేగంగా కదిపి.. వెనుక దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని పట్టిఎత్తి గిర్రునతిప్పి దూరంగా విసిరివేయబోయాడు. “మామా.. మామా! నేనూ.. పాహిమాం! క్షమించండి..” అరుస్తున్నాడా ఆగంతుకుడు. గిరాటు వెయ్యకుండా తిప్పి పక్కన నిలబెట్టాడు. మేనల్లుడు మురారిదేవుడు! వెనగ్గా వచ్చి మేనమామ కళ్లు మూయబోయాడు. “ఏమిటా పిచ్చిచేష్టలు మురారీ. ఇంకా నయం. నడుముకున్న చురక తీయలేదు. నాతోనా హాస్యం?”
“అమ్మో.. మామా! మీరింత ఏకాగ్రతతో ఉంటారని తెలియదు. కనీస ఊహకూడా నాకు రాలేదు. అమ్మో.. ఎంత వేగం! ఎంత ఒడుపు!!” నవ్వాడు జాయచోడుడు. మేనల్లుని భుజంపై చెయ్యివేసి నడుస్తూ అన్నాడు.
“పద లోపలికి. నా ముందు ఖడ్గచాలనం చేసినవాడిని అదే వేగంతో వాడి ఖడ్గం లాక్కొని వాడి కుత్తుక ఉత్తరించగలను. నా శరీరానికి కత్తిమొన ఆనించగల దూరంవరకూ ఎవ్వడూ రాలేడు. లిప్తమాత్రంలో వాడి కుత్తుక లేచి పోతుంది”
అప్పుడు చూశాడు పక్కన మరో యువకుడు..
మురారి ఈడు వాడు.
“ఆ.. మామా! ఇతడు హరిహరుడు.. నా అన్న!”
తుళ్లిపడ్డాడు. హరిహరుడా.. చనిపోయిన వాడు??
మురారి పకపకా నవ్వి..
“తండ్రిగారు, అమ్మ, అక్క అందరూ మీలాగే ఖంగుతిన్నారు. వీడు కాకతీయ వంశపువాడే. రాజనగరి నివాసి. అంతకుమించి నా ప్రాణమిత్రుడు..”
ఆ హరిహరుడు జాయచోడునికి నమస్కరించాడు.
“మామగారూ.. వందనం!”
సొంతసోదరుడు మరణించినా ఇక్కడో హరిహరుడు అనేవాణ్ని సోదరుడిగా పొందాడన్నమాట. బావుంది!
లోపలికి వెళ్లారు. మిత్రులిద్దరికీ పాన చషకాలు ఇచ్చి తానొకటి తీసుకుని విదేశీదంతపు దుత్తలోనున్న మధువును ముగ్గురి చషకాలలోకి ఒంపాడు. రాత్రివేళ పరిచారికలను అంగీకరించడు జాయచోడుడు.
ఏదో గుర్తొచ్చినట్లు..
“ఆ.. మురారీ! ఇతని పెళ్లికే వెళ్లి కొలని యుద్ధానికి రాలేదు కదూ??”
మురారి, హరిహరుడు ముఖాలు చూసుకుని
మురిసిపోయారు.
“అవును మామా! నాకు వీడంటే అంత ప్రేమ!”
మధువును గుటకవేసి..
“మరో సంగతి. మఠియవాడలో జరిగిన గొడవలో చెయ్యో కాలో పోగొట్టుకోకుండా తప్పించుకున్న పదోవాడు వీడే.. కదూ??” సూటిగా చూస్తూ అడిగాడు జాయచోడుడు.
ఇద్దరూ వెర్రిచూపులు చూశారు. చూసుకున్నారు. తాము దాచిపెట్టిన అంశం మేనమామ పట్టుకున్నట్లు గుర్తించి.. చెప్పడానికి సాకు దొరక్క మాట మార్చాడు మురారి.
“శుభవార్త మామా.. తండ్రిగారు నన్ను బాహాత్తర నియోగాధిపతిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు..”
“సంతోషం! నిజానికి బాహాత్తర నియోగాధిపతి అనేది ఓ గౌరవ పదవి. నువ్వు రాచకార్య నిమగ్నుడివై పరిపాలన నేర్చుకోవాలని తండ్రిగారి అభిప్రాయం లాగుంది. మంచి అవకాశం. తండ్రిగారి ప్రతిచర్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!”
“నాకైతే మన సామంతరాజ్యాల పర్యటన చేయాలని ఉంది. కానీ, తండ్రిగారి అనుజ్ఞ మీరలేను కదా..”
“మీరాలని భావించవద్దు. వారు ఆదేశించినది శిరసావహించడమే కుమారుడిగా నీ కర్తవ్యం..” అంటూ చాలాసేపు ముచ్చట్లు, ఉపదేశాలు కలగలిపి చెప్పాడు.
చెప్పిన అంశాలకు సంబంధించి నీతిశాస్ర్తాలు, అర్ధశాస్త్రం, కామందకం.. తదితర తాళపత్ర గ్రంథాలు అతని చేతిలో పెట్టాడు. జాయచోడుడిలాగే ఎవరేం సుభాషితాలు చెప్పినా వింటాడు మురారి. చెప్పినవారిని పొగడుతాడు. గౌరవిస్తాడు. కానీ, పాటించేది సున్న!!
మురారి ఈ మహాసామ్రాజ్య పాలనకు అర్హతలు ఉన్నవాడా.. చక్రవర్తి గణపతిదేవునికి అసలైన వారసుడా??
జాయచోడునిలో నిరంతరం సందేహాలే. ఇవే ప్రశ్నలు గణపతిదేవుణ్ని కూడా తొలుస్తున్నాయని, ఆయన కూడా సమాధానాలను వెతుక్కుంటున్నాడని జాయచోడుని అనుమానం. ఎవరైనా ఆయన ముందు ప్రస్తావిస్తే వెనువెంటనే చర్చాంశం మార్చేస్తాడాయన. అక్కడ జాయచోడుడు ఉంటే.. ఆయన వంక చూస్తాడు. ఇద్దరూ ఏనాడూ మురారి గురించి మాట్లాడుకోకపోయినా ఇద్దరిదీ ఒకే అభిప్రాయం. అది సదభిప్రాయం మాత్రం కాదు!
“ఇవి చదువు. తండ్రిగారు ఏర్పాటు చేసిన గురువులను పొమ్మన్నావట..?” అడిగాడు ఓసారి.
“అవును మామా.. వాళ్లకు ఏమీ తెలియదు. వాళ్లకన్నా నాకే ఎక్కువ తెలుసు..”
శాంతం పాపం!! వినకూడని మాట విన్నట్లు కళ్లు, చెవులు మూసుకున్నాడు.
శుక్ర చెప్పిన మఠియవాడ ఉదంతం తర్వాత, గణపాంబ పెళ్లి అనంతరం మురారిలో మార్పుకోసం తాపత్రయం ఎక్కువైంది జాయచోడునిలో. సామదానభేదోపాయాల ద్వారా అతనిలో పరివర్తన తేవడానికి కనిపించినప్పుడల్లా అతనికి ఏదేదో హితబోధ చేస్తూనే ఉన్నాడు.. ఉంటాడు. గ్రంథాలిచ్చి చదవమంటూనే ఉంటాడు.
మహామేధావి గణపతిదేవుడు మురారిని తన వారసుడుగా ప్రకటించలేదు. స్త్రీ.. సింహాసనానికి ధర్మశాస్త్రం ఒప్పదని పురవాసుల మనస్సులో ఉంది. ప్రజాభిప్రాయం గణపతిదేవునికి పరమ ప్రమాణ్యం, శిరోధార్యం. గతంలో రుద్రమదేవి పుట్టినప్పుడు మగపిల్లవాడుగా, తన వారసుడుగా కూడా ప్రకటించాడు. అందులో మార్పుచేస్తూ ప్రకటన చేసేవరకు అదే చెల్లుబాటులో ఉన్నట్లుగా భావించాల్సి ఉంది. అది మార్పు చెయ్యక పోవడంలోనే ఆయన చాకచక్యం ఉంది.
ఈ సంగతి తెలియని మురారి తనకు తానే కాబోయే మహామండలేశ్వరునిగా భావిస్తుంటాడు. పాలనలో కూడా అతని జోక్యం ఎక్కువయ్యిందని వింటున్నాడు. ప్రతి నియోగంలోనూ తనదైన విధానం ప్రవేశపెట్టడం.. ఇలా కాదు అంటే ఆ నియోగాధిపతులపై కన్నెర్ర, హుంకరింపు.. చర్యలు తీసుకోవడం. ఆధిపత్యధోరణి మరీ ఎక్కువయ్యిందని నియోగులు, మంత్రులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకుంటున్నాడు.
ఇంట ఇలా ఉంటే.. బయట అందుకు విరుద్ధంగా ఉంది. ఆశ్చర్యకరంగా మురారి పట్ల ప్రజల్లో అభిమానం నిండుగా ఉన్నది.
మురారి యువచక్రవర్తి. మురారి కాకతీయవంశ వారసుడు. మురారి మహాపురుషుడు. గణపతిదేవునికి తగిన వారసుడు. ఇది ఇంటా బయటా నిరంతరంగా ప్రజ్వరిల్లుతున్న ముచ్చట.
శుక్ర.. జాయచోడునికి విన్నవిస్తూనే ఉన్నాడు.
“యువరాజు ప్రవర్తన తండ్రిగారి విధానాలకు పూర్తిగా విరుద్ధం. ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నారు. తరతరాలుగా నిర్వహిస్తున్న సంప్రదాయ విధానాలను తోసిరాజని ప్రవర్తిస్తున్నారు.”
“మరి మురారి పట్ల ప్రజల్లో పూజనీయత, ఆరాధన పెరుగుతోందన్నావ్.. ఎలా?”
“అదే నాకూ ఆశ్చర్యం జాయా! బహుశా వారసత్వానికి పోటీలేరని ప్రజలకు తెలుసు. మురారిదేవుడు తండ్రిలా మంచిపాలకుడు కాగలడని వారి ఆశ కాబోలు!”
తలపంకించాడు జాయచోడుడు.
అత్తారిల్లు నిడదవోలు రాజ్యంలో వీరభద్ర భూపతికి సహాయంగా రాజ్యవ్యవహారాలలో చురుగ్గా వ్యవహరిస్తోంది రుద్రమదేవి. రెండవసారి గర్భవతి కూడా. అటు అక్క గణపాంబకు కూడా రాజ్యపాలనలో సహకరిస్తోంది. అక్కలు ఎదురైతే ఆప్యాయత ఒలకబోస్తాడు మురారి. కానీ, వాళ్ల రాజ్య, కుటుంబ సమస్యలపై ఎన్నడూ స్పందించి సహాయంగా అక్కడికి వెళ్లింది లేదు. అతని నిశ్చితాభిప్రాయం న స్త్రీ సింహాసనమర్హతి!
* * *
కొన్నిమాసాలుగా వెలనాడు కూసెనపూండి కళాక్షేత్రం వద్ద ఉంటున్నాడు జాయచోడుడు. వెంట పరాశరుడు. గడ్డిపాడువద్ద వరదనీరు ఎండిననేల వద్ద గ్రామాన్ని నిర్మించి దానికి ‘మువ్వ’ అని పేరు పెట్టాడు. సంచార జీవులైన అనేకమంది కూసెనపూండి కళాకారులకు ఈ మువ్వ గ్రామంలో నివాసం కల్పించాడు. భాగవతుల సిద్ధయ రచించిన ‘ప్రహ్లాద విజయం’.. ఆయన మేళం జాయచోడుని కోసం ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. దానిలో అనేకానేక మార్పుచేర్పులు చెప్పి ఆ ‘ప్రహ్లాద విజయం’ రచన, ప్రదర్శన మరింత అద్భుతంగా చేశాడు జాయచోడుడు.
తెలుగు రాజ్యాల్లోని నాట్యకారులంతా ఆయనను తెలుగు నాట్యభోజుడుగా కీర్తిస్తున్నారీమధ్య.
చిన్ననృత్తం తొక్కి చూపితే చాలు.. బంగారం పండే వెలనాడు తరిభూములు తాంబూలంలో పెట్టి ఇవ్వడం!
“మళ్లా వచ్చేసరికి అద్భుత మార్గినాట్యకారుడివై నీ నృత్తం నా ముందు చూపాలి”
కేవలం ఇదొక్కటే షరతు!
ప్రస్తుతం గణపతిదేవుని పేరిట తలగడదీవి ఆవల గణపేశ్వరం పేరుతో కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ దేవాలయం కట్టిస్తూ కవి రేచియార్యుని కుమారుడు నందికవితో శాసనం రాయిస్తున్నాడు.
మళ్లీ వార్తాహరుడు.
విచిత్రంగా ఈసారి అక్క నారాంబ నుండి వార్త.
“తక్షణం రావలసినది..”
మురారి ఏం కొంపలు ముంచాడో.. వాయువేగ మనోవేగాలతో అనుమకొండకు వచ్చిపడ్డాడు. గణపతిదేవుణ్ని దర్శించకుండా అంతఃపురంలోకి ప్రవేశించాడు. చింతాక్రాంత అయి.. దీనంగా పిచ్చిచూపులు చూస్తోంది నారాంబ. అక్క ఏం చెబుతుందో తెలియక ముఖంలో దిగులు తన్నుకొస్తోంది.
“వచ్చావా.. ఏం జరిగిందో చూడు..” అంది.
విషయం అర్థంకావడంలేదు.
అడగడానికి నోరు రావడంలేదు.
లోలోన మధనపడుతూ మందిరమంతా కలయతిరుగుతోంది నారాంబ. ఆమె పచ్చల కంకణాలు, చామలా కడియాలు, వడ్డాణానికి ఉన్నగజ్జెలు.. ఆమె ఆందోళనను ప్రస్ఫుటిస్తూ వింతశబ్దాలు చేస్తున్నాయి. కొద్ది లిప్తలు ఎదురుచూశాడు.. ఆమె చెబుతుందని.
తమ్ముడ్ని చూసి మళ్లా శూన్యంలోకి చూస్తోంది.
ఉత్కంఠ తట్టుకోలేక అడిగేశాడు.
“అక్కా.. ఏమైంది?”
“హు.. స్త్రీ జీవితం అంతే జాయా…” అంది విరక్తిగా.
అక్క ఏం మాట్లాడినా మురారిపైనే ఆయన దృష్టి పోతోంది. మురారి స్త్రీ విషయంలో చిక్కుకున్నడా?!
“ప్చ్.. తను వచ్చేసింది ఇక్కడికి.. ప్చ్..”
ఎవరు? ఎవరామె..?? మురారి చెప్పాచెయ్యకుండా వివాహమాడి..!?
“రుద్రమ. ప్చ్.. నా తల్లి. తల్లి కూడా లేనిపిల్ల. ‘నాకు మీరే తల్లి పిన్నిగారూ!’ అంటూ పాపం.. నాకు చెప్పుకొంది..”
దుఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. కొంచం అవగతమైంది. మురారి సమస్య కాదు. రుద్రమ గొడవ!! అక్కకి అనుభూతి ఎక్కువ. ఎవరికైనా కష్టంవస్తే అక్కకి కళ్లు, ముక్కు నీళ్లతో నిండిపోతాయి. ముక్కు చీదుతూ.. వెక్కెక్కి ఏడుస్తుంది.
ఏమిటో వెర్రక్క! తట్టుకోలేదు పాపం!!
“రుద్రమ యుద్ధ వీరురాలు, చక్రవర్తి కుమార్తె అయితే మాత్రం అగచాట్లు తప్పడంలేదు జాయా..”
“ఏమైంది అక్కా.. రుద్రమ అక్కడ నిడదప్రోలులోనే ఉన్నది కదా..”
“లేదు జాయా! కొలనుపాకలో ఉన్నది. మీ బావగారు అరణంగా ఇచ్చిన కొలనుపాకలోనే ఇకపై ఉంటుందట. అత్తగారు ఉదయాంబికదేవి మహా దుర్మార్గురాలట. చిత్రహింసలు పెడుతోందిట. తట్టుకోలేక వచ్చేసింది. ముగ్గురూ ఆడపిల్లలే కదా. వారసుణ్ని కనలేదని.. పాపం..”
“పాపం..” సహానుభూతి ప్రకటించాడు.
“అక్క సోమలదేవికి మగసంతానం లేదు. అదే సంప్రదాయం ఆమెకూ వచ్చి ముగ్గురూ ఆడపిల్లలే పుట్టారు. నిడదప్రోలుకు వారసత్వం లేకుండా పోయిందని ఆ అత్తముండ ప్రతిక్షణం సణుగుడే సణుగుడట. ఆమె పోరు భరించలేక కొలనుపాకలో..”
వెక్కిళ్లు ఎక్కువై పోవడంతో గొంతు పూడుకుపోయి వాక్యాలు పూర్తిచేయలేకపోతోంది.
మహామేధావి గణపతిదేవుడు మురారిని తన వారసుడుగా ప్రకటించలేదు. స్త్రీ.. సింహాసనానికి ధర్మశాస్త్రం ఒప్పదని పురవాసుల మనస్సులో ఉంది. ప్రజాభిప్రాయం గణపతిదేవునికి పరమ ప్రమాణ్యం, శిరోధార్యం. గతంలో రుద్రమదేవి పుట్టినప్పుడు మగపిల్లవాడుగా, తన వారసుడుగా కూడా ప్రకటించాడు. అందులో మార్పుచేస్తూ ప్రకటన చేసేవరకు అదే చెల్లుబాటులో ఉన్నట్లుగా భావించాల్సి ఉంది.