శుక్రవారం 27 నవంబర్ 2020
Sunday - Oct 25, 2020 , 00:39:52

పొగరుబోతు బల్లికి తగిన శిక్ష !

పొగరుబోతు బల్లికి తగిన శిక్ష !

చెట్టు కొమ్మల్లో అందమైన గూడు కట్టుకుని, ఆహారం కోసం ఎదురు చూస్తున్నది ఆ సాలీడు. ఎదురుచూపు ఫలించింది. ఎగురుతూ ఒక ఈగ వచ్చి ఆ సాలెగూట్లో చిక్కుకుంది. సాలీడు మరిన్ని బలమైన దారాలు కట్టి దాన్ని ఎగిరి పోకుండా చూడాలనుకుంది.  అంతలో అనూహ్యంగా ఒక కొమ్మ మీదనుంచి పాక్కుంటూ వచ్చింది ఒక బల్లి. సాలీడు కన్నుమూసి తెరిచేలోగా ఈగను మింగేసి వెళ్ళిపోయింది. బల్లి బలానికి సాలెగూడు పాడై పోయింది. సాలీడుకు ఏడుపు వచ్చింది. అందులోనూ ఉదయం నుంచి ఏమీ తినలేదు మరి! ఓపిక చేసుకుని మళ్ళీ గూడు కట్టింది. అదృష్టం బాగుంది. ఈసారి సీతాకోక చిలుక చిక్కింది. హమ్మయ్య! అనుకుంది సాలీడు. కానీ మళ్ళీ చరచర బల్లి రావడం సీతాకోకను నోటకరచుకు పోవడం జరిగింది. 

“మిత్రమా! నీకిది న్యాయమా ? నా ఆహారం దొంగిలిస్తున్నావ్‌?” ఏడుస్తూ అడిగింది సాలీడు. జవాబు చెప్పకుండా పొగరుగా వెళ్ళిపోయింది బల్లి.  ఇలా ఒకసారి  కాదు నాలుగుసార్లు జరిగింది. సాలీడుకు దుఃఖం ఆగలేదు. ఆకలితో, అవమానంతో పెద్దగా ఏడ్చింది. అది విని ఒక ఉడుత వచ్చింది.  “నీకు సాయం చేస్తా.. భయపడకు.. మళ్ళీ గూడుకట్టు” అని చెప్పింది. ఓపికగా మరోసారి గూడు కట్టింది సాలీడు.  కాసేపటికి ఒక తూనీగ అందులో చిక్కుకుంది. దాని కోసం బల్లి  వస్తుంటే- కాపు కాసిన ఉడుత దానిపైన దూకింది. పట్టుదప్పి రెండూ నేలమీద పడిపోయాయి. “నీ అంతు చూస్తాను..” అంటూ బల్లి - ఉడుతను తిట్టి మళ్ళీ చెట్టు పైకి పాకింది. ఉడుత కూడా గబగబా చెట్టెక్కి అక్కడున్న చిలుకకు సాలీడు బాధ వివరించింది. చెట్టెక్కిన బల్లి, సాలెగూడును సమీపించబోయే వేళ - చిలుక రివ్వునవచ్చి బల్లిని తనకాళ్లతో తన్నుకుపోయి సమీపంలో ఉన్న చెరువులో పడేసింది.  అంతే! సాలీడుకు బల్లి పీడా పోయింది.. 

చంద్ర ప్రతాప్‌

80081 43507