బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 03:54:34

ధారవిలో గోమతి సరిగమలు!

ధారవిలో గోమతి సరిగమలు!

‘ధారవి’..ఈ పేరు విన్నారా?ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడ . దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున 2.1 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది.ఈ ప్రాంతంలో చిత్తుకాగితాలు ఏరుకునేవాళ్లు.. బిచ్చమెత్తుకునేవాళ్లు.. రోజుకూలీలే అధికం. వందో.. రెండువందలో కాదు.. అక్షరాలా 15 లక్షల మంది ఈ స్లమ్‌లో నివసిస్తారు. ‘ధారవి’ పేరు చెబితేనే అల్లంత దూరం వెళ్లేవాళ్లున్న ఈరోజుల్లో.. అక్కడి అమ్మాయిల్లోని కళా నైపుణ్యాన్ని వెలికితీస్తున్నది హైదరాబాద్‌కు చెందిన ఈ యువతి.

ధారవి మురికివాడ.. పనికిరాని ప్లాస్టిక్‌ బ్యారెల్స్‌.. డబ్బాలు.. ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడివున్న పెయింటింగ్‌ క్యాన్లు ఒకవైపు. వాడేసిన టైర్లు.. సగం కాలిన కవర్లు.. చిందరవందరగా చెత్త కుప్పలు.. వ్యర్థాలు మరోవైపు. అలాంటి చోటికి మనమెళ్తే ఏం చేస్తాం? ముక్కుమూసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తాం.. కానీ, ఒకమ్మాయి వాటన్నింటినీ అసహ్యించుకోకుండా ప్రజల్లో కళలపై అవగాహన కల్పిస్తున్నది. అక్కడి పిల్లలకు సంగీతం పట్ల అభిరుచి కలిగేలా చేస్తున్నది. ఆమే.. 21 సంవత్సరాల గోమతి.

చదివితే లాభమా? 

శ్రీమంతులు తమ ధనాన్నంతా పిల్లలకు వారసత్వ సంపదగా ఇస్తారు. మరి.. మురికివాడల్లో ఉండేవాళ్లు ఏమివ్వాలి? అవే చిత్తు కాగితాలు.. పాత సీసాలు.. డబ్బాలు.. రేకులే కదా. ధారవి మురికివాడలోనూ ఇదే పరిస్థితి. తెల్లారగానే భుజానికి సంచి వేసుకొని చిత్తు కాగితాలకు వెళ్లే అమ్మాయిలు.. సంచి చేతిలో పట్టుకొని ఫ్యాక్టరీల వెంట పరుగులు పెట్టే అబ్బాయిలే కనిపిస్తుంటారు. చాలా తక్కువమందే చదువు గురించి ఆలోచిస్తుంటారు. వారి కోసం ఓ ప్రభుత్వ పాఠశాల కూడా అక్కడ ఉంది. కానీ.. చదువుకుంటే మాకేంటి లాభం? అనే అభిప్రాయం కొందరిది. అలాంటి వాళ్ల ఆలోచనను మార్చడానికి స్వచ్ఛంద సంస్థల తరఫునా.. వ్యక్తిగతంగా అనేక మంది కృషి చేస్తున్నారు. అలాంటివారిలో గోమతి ఒకరు. 

సంగీత క్షేత్రమై..

‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అని నానుడి. అలా ఒక అమ్మాయిని ప్రయోజకురాలిని చేస్తే పదిమంది అబ్బాయిలను బాగుపర్చినట్టే అనుకున్నారు ధారవి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. అందుకోసం వారిలో అంతర్గతంగా దాగి ఉన్న కళలకు పదును పెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే గోమతిని ఆహ్వానించారు. ప్లాస్టిక్‌ డబ్బాల శబ్దాలు.. రేకు గిన్నెల చప్పుళ్లు మాత్రమే తెలిసిన అమ్మాయిలకు సరిగమలు నేర్పిస్తున్నది గోమతి. ప్రతీ శనివారం ధారవి మురికివాడకు వెళ్లి శిక్షణ ఇస్తున్నది. అసలు సంగీతమంటే ఏంటో తెలియని మురికివాడల పిల్లలు.. ఇప్పుడు తమ అద్భుత గాత్రంతో ధారవి మురికివాడలను సంగీత క్షేత్రంగా మారుస్తున్నారు. 

30 మంది అమ్మాయిలు

ఒకప్పుడు వాళ్లకు శాస్త్రీయ సంగీతం అంటే తెలియదు. కానీ, ఇప్పుడు వినసొంపైన రాగా లు తీస్తున్నారు. ఒక క్రమబద్ధమైన డ్యాన్స్‌ తెలియదు. ఇప్పుడు ప్రొఫెషనల్‌ డ్యాన్సర్స్‌లా దుమ్మురేపుతున్నారు. గోమతి శిక్షణలో ప్రస్తుతం సంగీతంలో, నృత్యంలో ఆరితేరారు. భుజానికి గోనెసంచి వేసుకొని రోజూ తమ వెంట వచ్చే పిల్లలు, ఇప్పుడు సంగీత.. నృత్య ప్రదర్శనలు ఇస్తుండటంతో వారి తల్లిదండ్రుల ఆనంధానికి అవధుల్లేవు. ఇక అబ్బాయిలనూ అద్భుతమైన డ్రమ్మర్స్‌గా తీర్చిదిద్దింది గోమతి. వాళ్లు కూడా ముప్పై మందిదాకా ఉన్నారు. గోమతి క్లాసులు నిర్వహించేది వారానికి ఒకసారే అయినా, పిల్లలు మాత్రం రోజూ ప్రాక్టీస్‌ చేస్తూ సరికొత్త ప్రపంచాన్ని కళ్లారా చూస్తున్నారు. 

మ్యూజిక్‌ అంటే ప్రాణం 

హైదరాబాద్‌కు చెందిన గోమతి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివింది. వాళ్లమ్మ ఇంగ్లిష్‌ టీచర్‌. నాన్న ఆటోమొబైల్‌ విడిభాగాల వ్యాపారంలో ఉన్నారు. చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే ఇష్టం. ఆమె ఇష్టాన్ని తల్లిదండ్రులు ఏనాడూ కాదనలేదు. ట్రూస్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో ప్లేబ్యాక్‌ సంగీతంలో కోర్సు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఇగ్నోలో సైకాలజీ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నది. బాలీవుడ్‌ ముంబైలో ఉంటుంది కాబట్టి అవకాశాల కోసం అక్కడే నివాసముంటున్నది. ఎంటీవీ బీట్స్‌ ఇండియా, వీహెచ్‌1 వంటి వాటిలో పలు ప్రదర్శనలు ఇచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద కళా వేదిక అయిన షణ్ముకానంద ఆడిటోరియంలో ధారవి రాక్స్‌తో కలిసి ఆమె ఇచ్చిన ప్రదర్శన అద్భుతమని చెప్పవచ్చు. ఒకేసారి 1000 మందితో ప్రదర్శన ఇచ్చి ‘లార్జెస్ట్‌ ఇండియన్‌ సినిమాటిక్‌ బ్యాండ్‌'గా రికార్డు సాధించింది. ‘బ్యారో’టీమ్‌తో కలిసి ప్రదర్శనలూ ఇచ్చింది. ‘నాకు కళలు అంటే ప్రాణం. సామాజిక సేవ నా బాధ్యత’ అంటుంది ఆ యువతి.

ఎంతో కొంత..మార్పు సాధించాం

చాలాకాలంగా ధారవి మురికివాడల్లో పనిచేస్తున్నాను. వారి జీవితాలను దగ్గరగా ఉండి చూస్తున్నా. స్లమ్‌ ఏరియాల్లో  నియమబద్ధమైన జీవితం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ, ఆ భావన తప్పు. వాళ్లు చాలా పద్ధతిగా ఉంటారు. వారిలో విలాసాలు కనిపించవు. ఏది చెప్పినా అర్థం చేసుకుంటారు. అలాంటివారికి సంగీతం నేర్పడం సంతోషంగా ఉంది. ఎంతోకొంత మార్పు తీసుకురాగలుగుతున్నాం. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించడానికి ప్రయత్నిస్తా.  -గోమతి 


logo