గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 01:42:59

యోగ క్షేమం

యోగ క్షేమం

యోగా.. మన క్షేమాన్ని కోరుతుంది. విశ్వక్షేమాన్నీ ఆకాంక్షిస్తుంది. మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతోన్నతులుగా తీర్చిదిద్దుతుంది. ఆధ్యాత్మిక సాధకులకు ఇది ముక్తిమార్గం. అనారోగ్య పీడితులకు అపూర్వ చికిత్స. ప్రపంచంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలన్నీ యోగా మీద అధ్యయనం చేస్తున్నాయి. పేరున్న వైద్యశాలలన్నీ యోగా థెరపీని ఓ చికిత్సగా ఆమోదిస్తున్నాయి. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా యోగర్షి పతంజలికి ప్రణామాలతో..      

‘యోగ’... యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంశాలతో కూడిన ప్రక్రియ.   ఆధ్యాత్మికత అనేది జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలదనే విశ్వాసంతోనే.. యోగాను ఆధ్యాత్మికతతో ముడిపెట్టారు పతంజలి మహర్షి. ఆధ్యాత్మిక జీవితం, ప్రాపంచిక జీవితం- అంటూ రెండు వేర్వేరు జీవితాలుండవు. జీవితం ఒకటే. జీవితానికి పరిపూర్ణతను చేకూర్చేదే ఆధ్యాత్మికత. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మరికొందరు లేడని నమ్ముతారు. ఆధ్యాత్మికత అనుభూతి ప్రధానమైంది. ఎవరో చెబితే నమ్మడం కాదు, అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. అందుకు ఒకటే మార్గం.. యోగ. 

సర్వజన యోగం..

యోగా ఓ వికాస మార్గం. ఏ మతానికో, భాషకో, ప్రాంతానికో సంబంధించింది కాదు. భౌతికశాస్త్రం క్రైస్తవదేశంలో ఆవిష్కృతమైంది కాబట్టి, క్రైస్తవ మతానికి చెందిందిగా పరిగణించలేం కదా! అలాగే, భారతదేశంలో ఉద్భవించినంత మాత్రాన, యోగా హిందువులకే పరిమితమైంది కాదు. ఇండియాలో ఒక దేవుణ్ణి, ఇంగ్లాండ్‌లో మరో దేవుణ్ణి, నేపాల్‌లో మరో దేవుణ్ణి..  వివిధ దేశాల్లో వివిధ దేవుళ్ళను పూజిస్తుంటారు. ఎవరికి చెందిన ఆలయాల్లో వారి ఆచార వ్యవహారాలతో ఆరాధిస్తుంటారు. ఒకరు సంస్కృత భాషలో కీర్తిస్తే, మరొకరు ఇంగ్లీషులో స్తోత్రిస్తారు. మరొకరు హిబ్రూభాషలో కొనియాడతారు. దేవుడికి ఏ భాషతోను, నమ్మకాలతోను, నిర్మాణాలతోనూ సంబంధం లేదు. దేవుడు, దైవత్వం అనేది హృదయానికి, ఆత్మకు సంబంధించిన అంశం. మతం కంటే ఆధ్యాత్మికత ఉన్నతమైంది. ‘స్పిరిచ్యువాలిటి’ అంటేనే ‘స్పిరిట్‌ ఆఫ్‌ రిలీజియన్‌' అని అర్థం. ప్రతి మతంలోనూ ‘బాడీ ఆఫ్‌ రిలీజియన్‌', ‘మైండ్‌ ఆఫ్‌ రిలీజియన్‌', ‘స్పిరిట్‌ ఆఫ్‌ రిలీజియన్‌' అని మూడు అంశాలుంటాయి. అంతర్లీనమైన ‘స్పిరిట్‌ ఆఫ్‌ రిలీజియన్‌'ను వదిలేసి బాహ్యంగా కనపడే ‘బాడీ ఆఫ్‌ రిలీజియన్‌'కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే ఇంతటి వైవిధ్యం, ఇన్ని విభేదాలు. యోగ అనేది కూడా ‘స్పిరిట్‌ ఆఫ్‌ రిలీజియన్‌'కు సంబంధించిన అంశం. మనిషి హృదయంలో పరివర్తనను పెంపొందించే ప్రక్రియ. మనసు అంటే ఏమిటి, మనో చంచలతను ఎలా అధిగమించాలి? మానసిక చింతనల నుంచి ఎలా బయటపడాలి?.. అనే విషయాలనే చర్చిస్తుంది. అంతేకానీ, ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యవహారాల జోలికి వెళ్లదు.

ఆచరణాత్మకం..

అసలు ‘యోగ’ అనేదే.. మనిషి శరీరం, మనసు, హృదయం, ఆత్మలకు సంబంధించిన శాస్త్రం. ఏ శాస్ర్తానికి సంబంధించిన అంశాలనైనా కంఠస్థం చేసినంత మాత్రాన అనుభవంలోకి రావు. ఆచరణలో పెడితేనే అనుభవ పూర్వకంగా తెలుసుకోగల్గుతాం.ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్‌ యాదగిరి దగ్గరకు వెళ్తాడు. పరీక్షలూ ప్రిస్క్రిప్షన్లూ అయిపోయి.. తిరిగి వెళ్తున్న సమయంలో  రోగి- “డాక్టర్‌ గారూ! మీ ఫొటో ఉంటే ఇస్తారా” అని అడుగుతాడు. “సరే, ఫ్యామిలీ డాక్టర్‌ని కదా ఆల్బమ్‌లో పెట్టుకుంటాడేమోలే” అని తన ఫొటో ఒకటి ఇస్తాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఫొటోను పూజగదిలో పెట్టి రోజూ “ఓం డాక్టర్‌ యాదగిరిరావాయ నమః” అని పూజ చేస్తుంటాడు. కానీ, అతని జబ్బు ఏ మాత్రం తగ్గదు. దీంతో మళ్ళీ డాక్టర్‌ దగ్గరకు వస్తాడు. ‘డాక్టర్‌గారూ! రోజూ మీ ఫొటోకు పూజ చేస్తున్నాను. కానీ, జ్వరం ఏ మాత్రం తగ్గలేదు’ అని డాక్టర్‌తో అంటాడు. డాక్టర్‌ దానికి ‘అదేంటి మీకు మందుల చీటీ ఇచ్చాను కదా’ అంటాడు. ‘మర్చిపోయాను సార్‌! మందుల చీటీ ఇచ్చారని గుర్తులేదు’ అని జవాబిచ్చి, ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఆ మందుల చీటీని చూస్తూ రోజూ.. ‘ఉదయం యాంపిసిలిన్‌, సాయంత్రం అమాక్సిలిన్‌' అని పారాయణం చేస్తుంటాడు. అయినా జబ్బు తగ్గకపోయేసరికి, మళ్లీ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి.. జరిగిన విషయమంతా చెబుతాడు. దీంతో డాక్టర్‌కు విషయం అర్థమైపోతుంది. “అలా కాదు నాయనా! మందుల చీటిలో రాసిచ్చిన ఔషధాలను రోజూ క్రమం తప్పకుండా వేసుకుంటేనే నీ జబ్బు తగ్గుతుంది” అని చెబుతాడు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన శాస్త్రం. దానికి సంబంధించిన అంశాలను జీవితానికి అన్వయించుకోవాలి, అనుసరించాలి. 

యోగధర్మం

ధర్మం, యోగ.. రెండింటిలో యోగ శరీరమైతే, ధర్మం ఆత్మ. ధర్మం అంటే  ఎవరికీ అర్థం కాని క్లిష్టమైన అంశం కాదు. మంచి చేస్తే మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇదే ప్రకృతి ధర్మం, విశ్వధర్మం. హిందూధర్మం, బౌద్ధధర్మం, క్రైస్తవధర్మం అని ఇన్ని రకాల ధర్మాలుండవు. ఎవరు నీళ్ళను వేడి చేసినా 100 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల దగ్గరే ఆవిరవుతాయి. ఎవరు నిప్పులో చేయిపెట్టినా కాలుతుంది. ఇదే ధర్మం. ధర్మం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. బొట్టు పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం అనేవి బాహ్య విషయాలు. అంతఃశాస్త్రమైన ఆధ్యాత్మికతకు వీటితో సంబంధం లేదు. యోగ అనేది అంతఃపరివర్తనకు సంబంధించిన శాస్త్రం. ఈ క్రియలు చేస్తే ఈ రకమైన ఫలితాలుంటాయని చెబుతుంది. బుద్ధుడు ధ్యానం ద్వారానే వికాసం సాధించాడు. జీవించినంత కాలం ధ్యానం గురించే ప్రబోధించాడు. విజ్ఞాన భైరవతంత్రలో శివుడు పార్వతికి 113 రకాల ధ్యాన పద్ధతులను వివరించాడు. ఆ మహానుభావులు ప్రబోధించిన పద్ధతులను మనం అవలంబించాలి. వారు సూచించిన మార్గాలను మనం అనుసరించాలి. ధ్యానం వల్ల మనలోని సంస్కారాలు, వాసనలు తొలగి మనసు స్వచ్ఛమవుతుంది. దుఃఖం, బాధల నుంచి విముక్తులమవుతాం. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని చేరుకోవడానికి యోగలో కొన్ని ప్రక్రియలను వివరించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది అంశాలతో కూడిన ప్రక్రియే యోగ.

యమ..

‘యమ’ అనేది మనిషి సంఘంలో ఎలా నడుచుకోవాలో సూచిస్తుంది. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ.. అనేవి ‘యమ’కు సంబంధించిన ఉప అంశాలు. కేవలం చంపడం, శారీరకంగా బాధ పెట్టడం మాత్రమే హింస కాదు. ఆలోచనలలో క్రూరత్వం కూడా హింసే. ఒకరికి కీడు తలపెట్టాలనే ఆలోచనలు కూడా రక్తపాతంతో సమానమే. శారీరకంగాను, మానసికంగాను ఎవరికీ హాని తలపెట్టకుండా ఉండటమే అహింస. సత్య అంటే సత్యాన్నే పలకమని మాత్రమే కాదు. సత్య అంటే నిజం. ఈ క్షణమే నిజం. వర్తమానంలో జీవించమన్న సూచన కూడా ఉంది. భూత, భవిష్యత్‌ కాలమంతా కాల్పనికమే. ‘అస్తేయ’ అంటే మనవి కాని వాటిని ఆశించకుండా, వెంపర్లాడకుండా ఉన్నవాటితో సంతృప్తిగా, సంతోషంగా జీవించడం. ‘బ్రహ్మచర్య’ అంటే సంసార జీవితాన్ని వదిలివేసి దూరంగా అడవులకు పారిపొమ్మని కాదు. బ్రహ్మ అంటే భగవంతుడు, చర్య అంటే క్రియ. ఏ పనినైనా ఓ దైవ కార్యంలా, భగవంతునిలా చేయాలి. ‘అపరిగ్రహ’ అంటే నీ నిజతత్వం, నీ ఆత్మ నీలోనే ఉందని తెలుసుకోవడం.

నియమ..

‘నియమ’ అనేది వ్యక్తిగతంగా ఎలా నడుచుకోవాలో సూచిస్తుంది. శౌచ, సంతోష, తపః స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన అనేవి ‘నియమ’ ఉప అంశాలు. ‘శౌచ’ అంటే ఒట్టి శారీరక పరిశుభ్రతే కాదు, మానసిక స్వచ్ఛత కూడా. ఒక బకెట్‌ నీళ్ళు పోసుకొని స్నానం చేసి గుడికి వెళ్ళడం శౌచ అంటే సరికాదు. హృదయంలో నుంచి, మనసులో నుంచి మాలిన్యాలను తీసివేయాలి. ‘సంతోష’ అంటే సమభావనతో నిండిన సంతృప్తి. సంతోషంగా ఏ క్షణంలో ఆ క్షణం పరిపూర్ణంగా జీవించడమే. ‘తపః’ అంటే విపరీత ధోరణులకు పోకుండా సమస్థితిలో ఉండటం. అప్పుడే, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనల్ని చలింపచేయలేవు. ‘స్వాధ్యాయ’ అంటే పుస్తక జ్ఞానం అనికాదు. నిన్ను నీవు తెలుసుకోవడం, నీ నిజతత్వం ఏమిటనేది గ్రహించడం. ద్వైతమే లేదనీ, అంతా అద్వైతమే అనీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ‘ఈశ్వర ప్రణిధాన’ అంటే ఈశ్వరుడిలా ఎప్పుడు కాన్షియస్‌గా జీవించడం. ‘శవం’ అంటే అన్‌కాన్షియస్‌నెస్‌. ‘శివం’ అంటే కాన్షియస్‌నెస్‌, చేతన. ప్రతి క్రియలో చేతనాపూర్వకంగా ఈశ్వరుడివై జీవించాలి.

‘ఆసనం’ అంటే శరీరాన్ని వివిధ రీతులలో వంచడం అని కాదు. ‘స్థిరం సుఖం ఆసనం’.. ఆసనం అనేది స్థిరంగాను, సుఖంగాను ఉండాలి. శరీరంలోని కదలికలు మనసులో ఆలోచనల అలజడులను కలిగిస్తాయి. పతంజలి మహర్షి కేవలం నాలుగు రకాల ఆసనాల గురించి మాత్రమే వివరించారు. ప్రాణాయామ అంటే ప్రాణాన్ని వృద్ధి పరచడమని అర్థం. ‘ప్రాణాయామ నైవ సర్వపాప ప్రష్యంతి మలయతి’ ప్రాణాయామం సాధన చేయడం వల్ల మనలోని సంస్కారాలు, పాపాలు తొలగిపోతాయి. ‘తస్మిన్‌ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేధః ప్రాణాయామ’ - శ్వాస మన ప్రమేయం లేకుండా ఎప్పుడూ అచేతనగా జరుగుతుంది. ఆ అచేతన ప్రక్రియను విచ్ఛిన్నం చేసి చేతనతో శ్వాసించడమే ప్రాణాయామ. ప్రాణం స్థిరంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. ప్రాణాయామ సాధన వల్ల ఆలోచనకు ఆలోచనకు మధ్య ఆలోచన రహిత స్థితి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందుతుంది.

‘ప్రత్యాహార’ అంటే ఇంద్రియాలను ప్రత్యామ్నాయ ఆహారం వైపు మరల్చడం. ఇంద్రియాలు ఎప్పుడూ ప్రాపంచిక విషయాలవైపు పరిగెడుతుంటాయి. ఇంద్రియాలను అంతర్ముఖం చేయడమే ప్రత్యాహార. ‘స్వవిషయే సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియానాం ప్రత్యాహార’.. మనం ఏ క్షణం అక్షణం జీవించేటప్పుడు మనలో అద్భుత ప్రక్రియ చోటుచేసుకుంటుంది. మీరు ప్రశాంతంగా, స్వచ్ఛంగా, నిష్కపటంగా ఉండేటప్పుడు మీలో అంతః ప్రయాణం మొదలవుతుంది. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన అన్నీ అంతర్ముఖమవుతాయి. అద్వైతమనేది అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. ‘ధారణ’ అంటే ఏకాగ్రత. ‘దేశబంధఃచిత్తస్య ధారణ’ శరీరం బయటకానీ, లోపలకానీ ఏదోఒక అంశంపై మనసును ఏకాగ్రం చేయడమే ‘ధారణ’.

‘ధ్యానం’ ‘తత్ర ప్రత్యేకతానత ధ్యానం’. ‘ధి’ అంటే కాన్షియస్‌. ‘యానం’ అంటే ప్రయాణం. ఎల్లప్పుడూ ఎరుకలో ఉండటమే ధ్యానం. ‘సమాధి’లో ‘సమ’ అంటే సమభావన. ‘ధి’ అంటే ఎరుక. సమభావనతో కూడిన ఎరుకే సమాధి. గమనించేవాడు, గమనించబడేది, గమనిక అన్నీ ఒకటవుతాయి.

యోగ అనేది చాలా సులభమైన ప్రక్రియ. పైన చెప్పిన విషయాలను కంఠస్తం చేసి గుర్తుంచుకోవాల్సిన అవసరంలేదు. ధ్యానం చేయడం ఆరంభించండి. ప్రాణాయామ, ఆసన, ధారణ, సమాధి అంతర్లీనంగానే జరుగుతాయి. ‘యమ, నియమాలతో ప్రారంభించి మెల్లగా ధ్యానం చేయడం ప్రారంభిస్తాను’ అనే నియమమేమీ పెట్టుకోకండి. వీటిలో ఏ అంశంతో ప్రారంభించినా మిగతా అంశాలన్నింటిలో మార్పు వస్తుంది. ధ్యాన సాధన చేస్తూ ఉంటే క్రమంగా మీలోని వాసనలన్నీ తొలిగిపోయి మనసు స్వచ్ఛమవుతుంది. లోనే దైవత్వం నెలకొంటుంది. 

సూర్య నమస్కారాలలో మొత్తం 12 ఆసన స్థితులు ఉంటాయి. సూర్య నమస్కారాలు సాధారణ వ్యాయామాలు కానేకాదు. చాలామంది వ్యాయామాలు చేస్తున్నట్లు శ్వాస, నిశ్వాస క్రమాలను పాటించకుండా చేస్తుంటారు. ఏ ఆసనాలను సాధన చేస్తున్నా శ్వాస వదిలేటప్పుడు ‘నాలోని మాలిన్యం, నెగెటివిటీ అంతా బయటకు వెళుతుంది. పీల్చే శ్వాసలో దైవత్వం నిండుతుంది’ అనే భావనలను మనసులో మననం చేస్తూ చెయ్యాలి. ‘ప్రాణాన్ని, దైవత్వాన్ని నాలో నింపుకుంటున్నాను. జాగరూకతను సమభావనను పెంచుకుంటున్నాను’ అనే ఎరుకతో చేయాలి. అంతేగాని మొక్కుబడి వ్యాయామంలా చేయకూడదు. ఏ ఆసనానికైనా కొన్ని ప్రాథమిక నియమాలు ఉంటాయి. పొట్టను ముందుకు వంచేటప్పుడు శ్వాస వదలడం, వెనుకకు వంగేటప్పుడు గాలి పీల్చడం, పక్కలకు వంగినప్పుడు గాలి వదలడం.. అప్రయత్నంగా జరిగిపోవాలి. ఆసనాలను ఈ విధంగా శ్వాస, నిశ్వాస క్రమాలను పాటిస్తూ సాధన చేయడం వల్ల ప్రాణాయామం కూడా అంతర్లీనంగా జరుగుతుంది. సూర్య నమస్కారాలలో ప్రతి ఆసనానికి ఒక మంత్రం ఉంటుంది. మంత్రం ఉచ్ఛరించేటప్పుడు ఆ మంత్రానికి సంబంధించిన గుణాన్ని పెంపొందించుకోవాలి.

వజ్రాసనం:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులను నివారిస్తుంది. తొడభాగాలలో రక్త ప్రసరణను పెంపొందిస్తుంది.శశాంకాసనం: 

కోపాన్నీ భావోద్వేగాల్నీ నియంత్రిస్తుంది.ప్రాణాయనమః

200 యేండ్ల క్రితం వాతావరణంలో ఆక్సిజన్‌ 37 శాతం ఉండేది. నేడు 19.6 శాతానికి పడిపోయింది. దీనికి తోడు పాశ్చాత్య జీవనశైలి ప్రభావం వల్ల మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పులు మరింతగా ఆక్సిజన్‌ శాతాన్ని తగ్గించివేశాయి. శరీరానికి క్రమంగా తగ్గుతున్న ఆక్సిజన్‌ శాతాన్ని పూరించాలంటే ప్రాణాయామ సాధన తప్పనిసరి. దీని వల్ల జీవితంలో విజయాన్ని, సంతృప్తిని రెండింటినీ పొందగలుగుతారు. మీలో ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ప్రాణాయామ సాధన వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆసనాలు శరీరానికి వ్యాయామం. ప్రాణాయామం మెదడుకు వ్యాయామం. ఎడమ నాసికా రంధ్రం గుండా శ్వాస తీసుకోవడం వల్ల ఎడమ మెదడు ఉత్తేజితమవుతుంది. నేటి పరిస్థితుల్లో ప్రాణాయామ సాధన అత్యవసరం. ప్రాణాయామం ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుందని అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు కూడా నిర్ధారించాయి. యోగముద్రాసనం: 

వెన్ను, మెడలను శక్తిమంతం చేస్తుంది.సేతుబంధాసనం: 

ఆస్తమా, బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.ఉష్ర్టాసనం: 

జీర్ణ వ్యవస్థలోని సమస్యలను సవరిస్తుంది. థైరాయిడ్‌ లోపాలను సరిచేస్తుంది. వెన్నెముకకు బలాన్నిస్తుంది.భుజంగాసనం: 

కాలేయం, మూత్రపిండాలు, వెన్నెముక తదితరాలను బలోపేతం చేస్తుంది.శలభాజనం: 

తుంటి నొప్పి, సయాటికాల నుంచి ఉపశమనాన్నిస్తుంది. నాడీ వ్యవస్థను చైతన్య పరుస్తుంది. మెడ నడుము భాగాలకు శక్తినిస్తుంది. ఆకలిని పెంచుతుంది. ధనురాసనం: 

తుంటి నొప్పి, మెడ నొప్పుల నుంచి ఉపశమనాన్ని ప్రసాదిస్తుంది. గుండె, ఊపిరితిత్తులకు శక్తినిస్తుంది. వివిధ గ్రంథులలోని లోపాలను సవరిస్తుంది. మూత్ర పిండాలకు వ్యాయామాన్ని ఇస్తుంది. జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది.గోముఖాసనం:

మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ వ్యాధుల నుంచి ఉపశమనం.మత్స్యాసనం: 

ఉదర సంబంధ వ్యాధులతోపాటు... పైల్స్‌, ఆస్తమా, బ్రాంకైటిస్‌లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తినిస్తుంది. జననేంద్రియాల లోపాలను సవరిస్తుంది. ఆరోగ్య ‘ముద్ర’

ముద్రలనేవి చేతివేళ్ళను ఉపయోగిస్తూ చేసే కొన్ని రకాల సంజ్ఞల లాంటివి. మన చేతివేళ్ళ కొనలలో శరీరం, మనసు, ఆత్మలకు సంబంధించిన అంశాలు దాగివుంటాయి. ఈ ముద్రలు ముఖ్యంగా.. హస్తముద్రలు, మనఃముద్రలు, కాయముద్రలు, ఓజస్సు ముద్రలు అనే నాలుగు రకాలు. వీటిని ‘సైకో న్యూరో సింబల్స్‌'గా కూడా వ్యవహరిస్తారు. ముద్రలు శారీరక, మానసిక లోపాలను సరిచేస్తాయి. శరీరంలో ప్రాణ సంచరణను పెంపొందిస్తాయి. ప్రాణశక్తి సంచరణలో కలిగే లోపాల వలనే శరీరంలోని ఆయా భాగాలు వ్యాధులకు గురవుతుంటాయి. ఈ లోపాలన్నింటిని ముద్రల ద్వారా సవరించవచ్చు. ముద్రలు శరీరంలో జరిగే రసాయన, విద్యుత్‌ చర్యలన్నింటినీ ప్రభావితం చేయగలవు. ముద్రలవల్ల కలిగే సూక్ష్మ మార్పులను గమనించాలంటే మనస్సు ఎంతో నిశ్చలంగా, అమితమైన ధారణలో ఉండాలి. logo