మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Apr 26, 2020 , 00:13:40

నిరసన

నిరసన

‘కాబుల్‌ స్టోన్స్‌ (నాపరాళ్ళు) తొలగించబడుతున్నాయి’ అనే వార్తని ఆసక్తిగా చదివిన మిస్‌ లూయిసా దాన్ని తన చెల్లెలికి ఇచ్చింది. చెల్లెలు మిస్‌ అగస్టా అక్కలా కాక కళ్ళజోడు పెట్టుకోకుండా చదివి చెప్పింది.“రాళ్ళు తీయకూడదు.”

వాళ్ళిద్దరూ మేంటెల్‌పీస్‌ మీద వెండి ఫ్రేమ్‌లోని వెలిసిపోయిన ఫొటో వంక చూసి తర్వాత ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు. లూయిసా గంటని మోగించగానే తెల్ల జుట్టు గల నల్ల సేవకుడు ఆ గదిలోకి వచ్చి ఖాళీ బ్రేక్‌ఫాస్ట్‌ ట్రేని తీసుకెళ్ళాడు.


“ఇది దుర్మార్గం” బెట్టీ కూడా ఆ వార్త చదివి చెప్పింది.“కాని ప్రగతికి ఇది ముఖ్యం.” ఆమె తాత మృదువుగా చెప్పాడు.“ప్రగతా? పాడా? ఊళ్ళో చక్కగా ఉన్న రోడ్‌ ఇదొక్కటే. అది కాంక్రీట్‌ కాక కాబుల్‌ స్టోన్స్‌ అవడం వల్ల తీసేస్తున్నారు.”

“చాలా రోడ్లమీద చెక్క వేయడం నాకు గుర్తుంది. ఓ సారి బూట్లు లేకుండా వెళ్తే నాకో చెక్క పేడు గుచ్చుకుంది. మా అమ్మ దాన్ని సూదితో తీసేసాక మా నాన్న నన్ను చావబాదాడు. హై హీల్డ్‌ షూస్‌తో కాబుల్‌ స్టోన్స్‌మీద నడవడం కష్టం కూడా” ఎడ్వర్డ్‌ చెప్పాడు.

“నాకేం కష్టం అనిపించదు నాన్నా” బెట్టీ చెప్పింది.“మిసెస్‌ హేరిస్‌ ఆ రోడ్‌మీద నడిచేప్పుడు కాలు బెణకడం గుర్తుందా? ఆమె భర్తే ఆ కాబుల్‌ స్టోన్స్‌ని పరిచే కాంట్రాక్టర్‌ కాకపోతే, ఈ పని ఎప్పుడో చేసుండేవాళ్ళు” తాత చెప్పాడు.


“మళ్ళీ కాబుల్‌ స్టోన్స్‌ కేస్‌ వచ్చిందా? అవేమీ వజ్రపు రాళ్ళు కావు కదా? నగరంలోని సరటోగా వీధిలోని ఆఖరి కాబుల్‌ స్టోన్స్‌ని నా చిన్నప్పుడు పరిచారు. ఇంకా వాటిని ఉంచడం అంటే గతంలో జీవించడమే. ఇప్పుడు గుర్రపుబళ్ళు లేవు. వాటిమీద నడుస్తూ కాలు విరగ్గొట్టుకున్న ఎవరైనా నష్టపరిహారానికి నగర పాలక సంస్థ మీద కేసు వేయొచ్చు. వాటిని తొలగించాలని ఆజ్ఞాపిస్తున్నాను” ఆ ఊరు జడ్జ్‌ మిస్‌ లూయిసా పిటిషన్‌ని కొట్టేస్తూ తీర్పు చెప్పాడు.

కాని కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ఇది నచ్చలేదు. కొందరు కలిసి సరటోగా స్ట్రీట్‌ అసోసియేషన్‌ అనే క్లబ్‌ని స్థాపించి, దినపత్రికలో పూర్తి పేజి ప్రకటనలు ఇచ్చారు. ‘మన సంస్కృతిని కాపాడండి’ అనే హెడ్డింగ్‌తో ఆ ప్రకటన చాలామందిని ఆకర్షించింది. వారంతా కాబుల్‌ స్టోన్స్‌ని తొలగించకూడదని ఉద్యమించారు. ఓ దినపత్రిక ‘సరటోగా స్ట్రీట్‌లోకి ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశిస్తున్నదని’ తొలగింపుని సమర్థిస్తూ ఎడిటోరియల్‌ రాస్తే, మరో దినపత్రిక ‘మన ప్రియమైన కాబుల్‌ స్టోన్స్‌ చారిత్రక సరటోగా స్ట్రీట్‌కి గుడ్‌ బై చెప్తున్నాయి’ అని రాసింది.

వాటిమీద పాఠకుల ఉత్తరాలని కూడా ప్రచురించారు. ఓ పత్రికలో ఈ ఉత్తరం వచ్చింది.

టు

ది ఎడిటర్‌

సర్‌,

1836లో కాబుల్‌ స్టోన్స్‌ వేసారని మీరు ప్రచురించారు. ఆ వీధిలోని చాలా ఇళ్ళు ఆ సంవత్సరమే కట్టబడ్డాయి. కాని చాలా స్థానిక వీధుల్లో 1890 దాకా కాబుల్‌ స్టోన్స్‌ని పరచలేదు. కాబట్టి అవి మీరు అనుకునేంత పురాతనమైనవి కావు.

ఓ జాతీయ వారపత్రిక కూడా సరటోగా స్ట్రీట్‌లోని నాపరాళ్ళ తొలగింపు మీద హ్యూమన్‌ ఇంట్రస్ట్‌ స్టోరీగా ఓ పేజీ వ్యాసాన్ని ప్రచురించింది. ‘సరటోగా స్ట్రీట్‌ కాబుల్‌ స్టోన్స్‌ని రక్షించండి’ అనే బోర్డులున్న ఇళ్ళ కిటికీ ఫొటోలని కూడా ప్రచురించారు.

ఆ వీధిలోని నంబర్‌ 25వ ఇల్లు డి గ్రే అక్కాచెల్లెళ్ళది. వారి తండ్రి జనరల్‌ డి గ్రే అమెరికన్‌ సివిల్‌ వార్‌లో పాల్గొన్నాడు. అతని విగ్రహం డి గ్రే స్క్వేర్‌లో ఉంది. ఆ ఊళ్ళో డి గ్రే అవెన్యూ కూడా ఉంది. అతనికి ఇద్దరు కూతుళ్ళు. మిస్‌ లూయిసా, మిస్‌ అగస్టా. వారిద్దరూ ప్రస్తుతం ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఐతే వారిని అతితక్కువ మంది చూసారు. డి గ్రే సిస్టర్స్‌ బయటకి రావడానికి ఇష్టపడరు. వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు. కారణం వాళ్ళిద్దరూ హొరేస్‌ అనే యువకుడితో చాలా కాలం క్రితం ప్రేమలో పడ్డారు. అతను నేవీలో ఆఫీసర్‌గా చేరి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాకాలం అతని గురించి ఎవరికీ తెలీదు. 1905లో అతను తిరిగి ఆ ఊరికి వచ్చాడు. ఎ.ఎం.ఈ జాన్‌ చర్చ్‌లో ఆదివారాలు మిస్‌ లూయిసా, మిస్‌ అగస్టా హైమ్స్‌ పాడేవారు. ఓ ఆదివారం హొరేస్‌ అక్కడ ప్రత్యక్షమై మౌత్‌ ఆర్గన్‌ని వాయించాడు. అంతా వాళ్ళిద్దరిలో ఒకర్ని హొరేస్‌ పెళ్ళి చేసుకుంటారని భావించారు. కాని ఎవర్నీ చేసుకోలేదు. ఆ అక్కచెల్లెళ్ళు కూడా అవివాహితులుగా మిగిలిపోయారు.


ఓ పత్రికా విలేకరి కాబుల్‌ స్టోన్స్‌ తొలగింపు మీద ఇంటర్వ్యూ చేయడానికి లూయిసా ఇంటి తలుపు కొడితే తీయలేదు.“పత్రికలు కాబుల్‌ స్టోన్స్‌ తొలగింపు మీద కంటే మా మీద ఎక్కువ వార్తలు రాస్తున్నాయి. నాకు అది నచ్చదు” ఆమె లోపల నించి అరిచింది.“అందుకు కారణం మీ నాన్న సివిల్‌ వార్‌లో పాల్గొనడం. మీరు గత కొన్నేళ్ళుగా ఎవరికీ కనపడకపోవడం. మీరు అసలు జీవించే ఉన్నారా? లేదా? అనే అనుమానం కొందరికి కలుగుతున్నది. మిమ్మల్ని ఫొటో తీసుకుని వెళ్ళిపోతాను” అతను కోరాడు.ఆమె నిరాకరించింది.

“కాబుల్‌ స్టోన్స్‌ తొలగింపుని మీరు సమర్థిస్తారా?” అతను అడిగాడు.“లేదు. అది ఒప్పుకోం” మిస్‌ లూయిసా, మిస్‌ అగస్టా లోపల నించి ఒకేసారి జవాబు చెప్పారు.

చివరికి సరటోగా వీధిలోని కాబుల్‌ స్టోన్స్‌ తొలగింపు రోజు రానే వచ్చింది. పత్రికా విలేకరులు, టి.వి కెమేరామన్‌ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆ వీధిలో ఎక్కువగా వృద్ధులే ఉండటంతో వారంతా ఈ తొలగింపుని ఒప్పుకోలేదు. కొందరు దుమ్ము రేగుతుందంటే, మరి కొందరు శబ్దాలని భరించలేం అన్నారు.

ఉదయం ఎనిమిదికి స్వల్పంగా మంచు పడుతుండగా, చాలామంది ప్రజలు ఆ వీధిలో జరిగేది చూడటానికి వచ్చారు. మర గొడ్డళ్ళు, పారలతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్‌ ్స వాహనాలు రావడాన్ని టి.వి కెమేరాలు చిత్రీకరించాయి. సరిగ్గా ఓ నిమిషం గడిచాక 8.01కి సరటోగా వీధిలోని ఇంటి నంబర్‌ 25 తలుపు తెరచుకుంది. లూయిసా, అగస్టా బయటకి వచ్చారు. వారిని చూసి అంతా గుసగుసలాడుకోసాగారు.

వాళ్ళు నిశ్శబ్దంగా కుర్చీలని దక్షిణ, ఉత్తరాల్లో వేసుకుని కూర్చున్నారు. కొద్ది సేపట్లో ఇంట్లోంచి నల్ల పనివాడు ఇద్దరికీ చెరో బేనర్‌ తెచ్చిచ్చాడు. వాటి మీద ‘పని ఆపండి. వెనక్కి వెళ్ళండి’ అని రాసుంది. ఇద్దరూ వాటిని పట్టుకుని నిరసనగా కూర్చున్నారు. కోట్ల మంది అమెరికన్స్‌ టి.విల్లో జరిగేది చూస్తుంటే మిస్‌ లూయిసా తమ తండ్రి యుద్ధంలో ఉపయోగించిన కత్తివర లోని కత్తిని బయటకి తీసి మోకాళ్ళ మీద ఉంచుకుంది. అగస్టా తన తండ్రి మస్కట్‌ (పాత కాలం తుపాకి)లో గన్‌ పౌడర్ని, చిన్న ఇనప బంతిని నింపింది.

వర్కర్స్‌ ఏం చేయాలా అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ సందర్భం వస్తే ఏం చేయాలో వారికి సూచనలు అందకపోవడంతో రోడ్‌మధ్య చలిమంట వేసుకుని, దాని చుట్టూ నిలబడి చేతులు కాచుకోసాగారు.

కొద్దిసేపటికి యునైటెడ్‌ డాటర్స్‌ ఆఫ్‌ కన్‌ఫడరేట్స్‌ సిటీ హాల్‌ ముందు కొందరు నిరసన ప్రదర్శన ఆరంభించారు. తర్వాత సీనియర్‌ సిటిజన్స్‌, కాంగ్రెస్‌, ది సన్స్‌ ఆఫ్‌ యూనియన్‌ వెటరన్స్‌, ది సొసైటీ ఆఫ్‌ ది వార్‌ ఆఫ్‌ 1812... మొదలైన స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా ఆ నిరసనలో కలిసారు.

మంచు పడటం అధికమైంది. ఐనా డి గ్రే సిస్టర్స్‌ అంగుళమైనా కదల్లేదు. తొమ్మిది ఇరవై ఐదుకి మేయర్‌ పంపిన వ్యక్తి వచ్చి చెప్పాడు.

“మేయర్‌ ప్రత్యేక కౌన్సిల్‌ మీటింగ్‌ని ఏర్పాటు చేసారు. సరటోగా స్ట్రీట్‌ని ప్రైవేట్‌ స్ట్రీట్‌గా భావించి సరటోగా స్ట్రీట్‌ అసోసియేషన్‌కి దాన్ని అప్పగించాలని అందులో నిర్ణయమైంది.”

వెంటనే చాలామంది తమ హర్షాన్ని వ్యక్తం చేసారు.

“కాని ఎవరికైనా ఈ వీధిలో గాయాలైతే మేయర్‌కి బాధ్యత లేదు” అతను చెప్పాడు.

వెంటనే చాలామంది డి గ్రే సిస్టర్స్‌ ఇంట్లోకి వెళ్ళాలని నినాదాలు చేయసాగారు. వాళ్ళిద్దరూ కదల్లేదు. అతని సూచనమీద పనివాళ్ళు, లారీలు వెళ్ళిపోతూంటే, లూయిసా కత్తిని వరలో ఉంచింది. అగస్టా మస్కట్‌లోంచి ఇనప బంతిని, గన్‌ పౌడర్ని తీసేసింది. తమ దగ్గరకి వచ్చిన విలేకరులని పట్టించుకోకుండా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. దారిలో ఓ వ్యక్తి వాళ్ళని పలకరించి అడిగాడు.

“నేను మీతో మాట్లాడచ్చా?”

మిస్‌ లూయిసా ఆగి ఓ వ్యక్తి వంక చూసి అడిగింది.

“మీరు తెలిసిన వారిలా ఉన్నారు? విల్లీ వింక్‌ హార్న్‌ చిన్న కొడుకు కదా?”

“అవును.” డబ్భు ఏళ్ళ ఆ వ్యక్తి చెప్పాడు.

“ఐతే మా ఇంట్లోకి రండి. టీ తాగుదురు గాని” ఆహ్వానించింది.

ఆయనకి పోర్ట్‌ వైన్‌ని సర్వ్‌ చేసారు.

“మేం అరవై ఏళ్ళ ఏకాంత వాసాన్ని భగ్నం చేసి ఎందుకు బయటకి వచ్చామో తెలుసా?” లూయిసా అడిగింది.

“బహుశా సరటోగా స్ట్రీట్‌ సంస్కృతి భగ్నం కాకుండా ఉండటానికి అనుకుంటాను. ఆ కాబుల్‌ స్టోన్స్‌ చారిత్రాత్మకమైనవి.” ఆయన చెప్పాడు.

“సరటోగా సంస్కృతి మాకు అనవసరం. వాటిమీద నడుస్తూంటే భయంకరమైన శబ్దం వస్తుంది. వాటిని తీసేసి సముద్రంలో పడేస్తే బావుండును అనుకుంటాం.”

“మరి?”

ఆ అక్కాచెల్లెళ్ళు మేంటెల్‌పీస్‌ మీది వెండి ఫ్రేమ్‌లోని రంగు వెలిసిన ఫొటోని చూసారు. అది పాత నేవీ యూనిఫాంలోని వంపు తిరిగిన మీసాలు గల ఓ యువకుడి ఫొటో.

“అసలు మీరిద్దరూ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?” ఆయన ఆసక్తిగా అడిగాడు.

“హొరెస్‌” వారిద్దరూ ఏక కంఠంతో చెప్పారు.

“అతను మా ఇద్దరితో డేటింగ్‌ చేసాడు” లూయిసా చెప్పింది.

“ఎవర్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడో చెప్పలేదు” అగస్టా చెప్పింది.

“అతని మీద వ్యామోహంతో నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఇద్దరిని నిరాకరించాను. మా చెల్లెల్ని కూడా. హొరెస్‌ స్పేనిష్‌ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళబోయే ముందు ఈ ఫొటో ఇచ్చాడు. తిరిగి రాగానే మాలో ఒకర్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. మేం అతని కోసం వేచి చూడసాగాం.”

తర్వాతది అగస్టా బాధగా చెప్పింది.

“తిరిగి వచ్చాక మా ఇద్దరిలో ఎవర్నీ చేసుకోదలచుకోలేదని చెప్పాడు” ఆయన గ్లాస్‌లో వైన్‌ పోస్తూ చెప్పింది.

వాళ్ళిద్దరూ వైన్‌ గ్లాసులని గాల్లోకి ఎత్తి చెప్పారు.

“టు హొరెస్‌.”

మిస్టర్‌ వింక్‌ హార్న్‌ కూడా వారితో కలిసి వైన్‌ తాగాడు. ఆయన వెళ్ళాక ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఒకరి వంక మరొకరు చూస్తూ మౌనంగా కూర్చున్నారు. లూయిసా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆమె గుసగుసగా చెప్పింది.

“గుర్తుందా? ఆ రోజు ఈ వీధిలో కాబుల్‌ స్టోన్స్‌ పరచడానికి ఏర్పాటు చేసారు. మట్టి ఇంకా మెత్తగా ఉంది.”

“అవును. దీపస్తంభం నించి పదడుగుల దూరంలో అతన్ని పాతిపెట్టాం. ఈ రోజు దాకా అక్కడే, చప్పుడు చేసే కాబుల్‌ స్టోన్స్‌కింద ఉన్నాడు. నన్ను అవమానించినందుకు క్షమించగలనేమో కానీ, నిన్ను అవమానించినందుకు మాత్రం క్షమించలేను” ఆగస్టా కోపంగా చెప్పింది.

“నన్ను అవమానించినందుకు తనని క్షమించగలనేమో కాని, నా చెల్లెల్ని బాధ పెట్టినందుకు మాత్రం క్షమించలేను” లూయిసా చెప్పింది.

“ఇది నిజమా?”

“అవును. నువ్వు అతన్ని వెనక నించి మస్కట్‌ రైఫిల్‌తో కాల్చి చంపుతావని నేను అనుకోలేదు. హొరెస్‌ స్క్రౌండ్రల్‌. నిజమే. కాని ఇవాళ అతని శవం బయట పడితే మనం చాలా అవమానం పాలయ్యే వాళ్ళం.”

కొద్ది సేపాగి మరి కొంత వైన్‌ని తన గ్లాస్‌లో నింపి, లూయిసా గ్లాస్‌లో నింపుతూ అగస్టా చెప్పింది.

“ఒకటి మాత్రం ఒప్పుకుంటాను. నేనింకా అతన్ని ప్రేమిస్తున్నాను.” 

“నేను కూడా” లూయిసా చెప్పింది.

(అవ్రం డేవిడ్సన్‌ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo