నానా తిప్పలు పడితే తప్ప సర్కార్ నౌకరి కష్టమైన ఈ రోజుల్లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఈ హైదరాబాద్ అమ్మాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని తాను కూడా అదే బాటలో నడవాలని డిసైడ్ అయింది. పట్టు పట్టి కొలువులు కొట్టింది యెర్ర సౌమిక. తాజాగా గ్రూప్-2లో సెలెక్ట్ అయి డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించిన ఆమెను ‘జిందగీ’ పలకరించగా తన కొలువుల ప్రస్థానాన్ని వివరించింది..
నేను పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ బన్సీలాల్పేటలోనే. మా నాన్న విజయకుమార్ ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి గతేడాది రిటైర్ అయ్యారు. అమ్మ ప్రభావతి గృహిణి. డిగ్రీ వరకు సికింద్రాబాద్‌లోనే చదువుకున్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తిచేశాను. ప్రస్తుతం‘రాజకీయాల్లో మహిళలు’ అనే అంశంపై ఓయూలోనే పీహెచ్డీ కూడా చేస్తున్నా.
నాన్న ప్రభుత్వ ఉద్యోగం చేయడం వల్ల ఆయన ప్రభావం నాపై చాలానే పడింది. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే సమాజం ఏ విధంగా గౌరవిస్తుందో నాన్నను చూస్తే తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను చేస్తే సర్కారు కొలువే చేయాలని. మా కుటుంబ సభ్యులు కూడా నా ఆలోచనకు తోడుగా నిలిచారు. పీజీలో ఉన్నప్పుడే రెండుసార్లు యూపీఎస్‌స్సీ పరీక్షలు రాశాను. కానీ సెలెక్ట్ కాలేకపోయాను. పీజీ పూర్తయ్యాక టీజీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లకు ప్రిపేరవ్వడం మొదలు పెట్టాను. గ్రూప్-1,గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని అన్ని పరీక్షలు రాశాను. గెలుపు తలుపు తట్టేముందు ఓటమి పలకరించింది. కష్టపడి చదివినా గ్రూప్ 1కి సెలెక్ట్ కాలేకపోయాను. అయినా కూడా దిగులు చెందలేదు. చదవడం ఆపలేదు. గ్రూప్-2లో 220 ర్యాంక్ వచ్చింది. ఇందులో ఎస్సీ మహిళల కేటగిరీలో స్టేట్ టాపర్‌గా నిలిచాను. గ్రూప్-3,గ్రూప్-4, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్లలో కూడా మంచి ర్యాంకులే సాధించాను.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపాటి సర్కార్ నౌకరి కొట్టాలన్నా కూడా కోచింగ్ తీసుకోవాల్సిందే. నేను కూడా అందరిలాగా కోచింగ్ తీసుకున్నాను. కానీ, అది పరీక్షల ముందు రోజు వరకూ కాకుండా కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అశోక్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్‌కు వెళ్లాను. వాళ్లు చెప్పే ట్రిక్స్, పరీక్ష విధానం లాంటివి నేర్చుకున్నా. తర్వాత నాకు నేనే గురువయ్యాను. ఇంటినే కోచింగ్ సెంటర్‌గా మార్చుకొని రోజుకు ఏడు గంటలపాటు చదివాను. కలగూరగంప లాగా కాకుండా లిమిటెడ్ బుక్స్‌ను చదవడం, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్టులు రాస్తూ నా ప్రిపరేషన్‌ను కొనసాగించాను. మూడేళ్లపాటు బ్రేక్ తీసుకోకుండా కష్టపడ్డాను కాబట్టే ఈ ఐదు ఉద్యోగాలు సాధించగలిగాను.
సాధారణంగా అందరికి ఉండే అలవాటే నాకుంది. ఇన్స్టాగ్రామ్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఫోన్ చేతిలో ఉందంటే రీల్స్ చూడాల్సిందే! ప్రిపరేషన్ ప్రారంభంలో మెసేజ్‌లు వస్తే ఓపెన్ చేసి చూసి అనుకోకుండా ఇన్‌స్టాలోకి వెళ్లేదాన్ని. తెలియకుండా స్క్రోల్ చేస్తూ గంటకు పైగా రీల్స్‌లోనే మునిగిపోయేదాన్ని. అది నా ప్రిపరేషన్‌పై తీవ్రమైన ప్రభావం చూపింది. సోషల్ మీడియా మీద నేనెంత టైమ్ స్పెండ్ చేస్తున్నానో లెక్కతీశాను. ఆశ్చర్యం, భయం రెండూ కలిగాయి. ఇన్స్టాకో దండం పెట్టేసి.. యాప్‌ని అన్ఇన్స్టాల్ చేసేశా! అప్పట్నుంచి నా ప్రిపరేషన్ సాఫీగా సాగిపోయింది. అన్ని పరీక్షల్లో విజయమూ వరించింది. ప్రస్తుతం జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నా! ఇటీవలే గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ కొలువు సాధించా. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఒకటే! గతంలో చేసిన తప్పిదాలను సరి చూసుకొని.. గ్రూప్ 1, యూపీఎస్సీ సాధించాలి. అందుకోసం కష్టపడుతున్నా. ఆ కొలువులు కూడా సాధిస్తానన్న నమ్మకం నాకుంది!
– రాజు పిల్లనగోయిన