తెలంగాణ అంటే స్వచ్ఛమైన భాష.. అచ్చమైన యాస! ఒకప్పుడు సినిమాల్లో కామెడీకి పరిమితమైన తెలంగాణ వేష భాషలు.. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా కొత్తపుంతలు తొక్కుతున్నాయి. మన గ్రామీణ పద్ధతులు, జీవన విధానం డిజిటల్ తెరపై సరికొత్తగా ఆవిష్కృతం చేస్తున్నది విలేజ్ పటాస్ యూట్యూబ్ చానెల్. గ్రామీణుల ఇష్టాలు, కష్టాలు, పండుగలు, ముచ్చట్లు.. ఒకటేమిటి మొత్తంగా పల్లె సౌందర్యాన్ని కండ్లముందు ఉంచుతున్నది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన అనిల్ మధ్యలోనే డిగ్రీ మానేశాడు. కొన్నాళ్లు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేశాడు. అదే సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ, ఫలించలేదు. కొన్నాళ్లకు తానే స్వయంగా షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం మొదలుపెట్టాడు. వాటికి ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో 2018లో విలేజ్ పటాస్ అనే యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించాడు. ఏడాదిపాటు పెద్దగా ఆదరణ రాలేదు. అయినా పట్టు వదల్లేదు అనిల్. అంచెలంచెలుగా ఎదిగిన ‘విలేజ్ పటాస్’కు ప్రస్తుతం ఏడు లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు.
కలిసికట్టుగా..
ఒక్కడితో మొదలైన విలేజ్ పటాస్‌లో ఇప్పుడు 12 మంది పనిచేస్తున్నారు. అందరూ గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లే. అనిల్ నేతృత్వంలో కలిసికట్టుగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు 220 షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించారు. జానపద గీతాలూ చిత్రీకరించారు. కథ, కథనం, కెమెరా మొత్తం వాళ్లే చూసుకుంటారు. ‘రాఖీ కట్టనీయ్య.. అజ్జెకారి అత్త’, ‘బావా బతుకమ్మ’, ‘రౌడీ పెళ్లాం’, ‘అనిల్ నాటు.. పెళ్లాం పోటు’, ‘చెల్లెకు పెళ్లి చూపులు’ తదితర వీడియోలు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. వీడియో పోస్ట్ చేసిన రోజునే సుమారు లక్ష వ్యూస్ సొంతం చేసుకుంటున్నదంటే విలేజ్ పటాస్‌కు ఎంత ఆదరణ ఉందో తెలుస్తున్నది. గ్రామీణ బంధాలు, పల్లె సమస్యలే ఈ వీడియోల ప్రధాన ఇతివృత్తాలు!
‘తెల్ల పెళ్లాం’ సూపర్ హిట్..
తాజాగా ‘తెల్ల పెళ్లాం’ సిరీస్‌తో విలేజ్ పటాస్ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ వీడియోలు 20 రోజుల్లోనే కోటి వీక్షణలు కొల్ల గొట్టడం విశేషం. ఇప్పటివరకు విడుదలైన ఆరు ఎపిసోడ్లు పటాస్ ఫ్యామిలీని అభిమానులకు మరింత చేరువ చేశాయి. ఇందులో ప్రధాన పాత్రలో రష్యా యువతి నూరానా నటించింది. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆమె నటనపై ఆసక్తితో విలేజ్ పటాస్‌తో జట్టుకట్టింది. తెల్ల పెళ్లాం సిరీస్ సక్సెస్ కావడం తనకెంతో ఆనందంగా ఉందని చెబుతున్నది నూరానా.
పల్లె పటాస్‌ను అన్నీ తానై నడిపిస్తున్న అనిల్‌కు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ కార్యక్రమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే, అక్కడ సరైన ఆదరణ లేకపోవడంతో యూట్యూబ్ చానెల్ మీదే పూర్తి దృష్టి కేంద్రీకరించాడు. ‘ఎంతో కష్టపడి విలేజ్ పటాస్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చాం. మా వీడియోల్లో పూర్తిగా పల్లె వాతావరణం ఉంటుంది. ఆదరణ కూడా బాగుంది. సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా’ అంటాడు అనిల్. ఎవరికి తెలుసు, విలేజ్ పటాస్ సక్సెస్ స్టోరీ ఓ సినిమాగా వస్తుందేమో!
…? పున్న శ్రీకాంత్ గుజ్జ నరేష్