ఒంటి చేత్తో ఓటమిని జయించాడు!
‘ఒక చెయ్యిని కోల్పోయినా నేల మాత్రం నన్ను వదల్లేదు’ అన్నాడు పులి మడుగులో కుండతో నీళ్లు తోడుతూ బానోతు రాజు. ఆ మాటల్లోనే అతని బతుకు మొత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు పులులు సంచరించిన పులిమడుగు అడవుల అంచుల్లో, రాళ్లురప్పల మధ్య ఉన్న బంజరు భూమి... నేడు పచ్చని మామిడి తోటగా మారింది.
‘ఒక చెయ్యిని కోల్పోయినా నేల మాత్రం నన్ను వదల్లేదు’ అన్నాడు పులి మడుగులో కుండతో నీళ్లు తోడుతూ బానోతు రాజు. ఆ మాటల్లోనే అతని బతుకు మొత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు పులులు సంచరించిన పులిమడుగు అడవుల అంచుల్లో, రాళ్లురప్పల మధ్య ఉన్న బంజరు భూమి… నేడు పచ్చని మామిడి తోటగా మారింది. ఆ మార్పు వెనుక ఉంది ఒకే ఒక మనిషి. ఒంటి చేత్తోనే వందల మొక్కలకు ప్రాణం పోసిన గిరిజన రైతు. రాజు కథలో ఊహించని మలుపులు ఉన్నాయి. ఉన్నతమైన గెలుపూ ఉంది.
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారులో లంబాడా తెగకు చెందిన బానోతు రాజుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. కానీ, ఆ భూమి సాగుకు అనుకూలం కాదు. రాళ్లు, రప్పలు, అడవి పొదలతో నిండి ఉండేది. ఈ బంజరుతో బతుకు నడవదని భావించిన రాజు.. నేలను పడావు పెట్టి సింగరేణి బొగ్గు గనుల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. కాయకష్టాన్ని నమ్ముకున్న రాజు జీవితాన్ని ఓ ప్రమాదం పూర్తిగా మార్చేసింది. 1997లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయాడు. వైకల్యం కారణంగా ఉన్న ఉద్యోగం పోయింది. అప్పటికే నలుగురు పిల్లల సంసారం. ఒంటిచేత్తో కుటుంబాన్ని నెట్టుకురావాలి. ఏండ్లు గడిచాయి. వైకల్యంతోనే కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు రాజు.

కొత్త జీవనాధారం
రోజులు ఇలాగే గడిస్తే.. తమ బతుకులు మరింత పాతాళంలో కూరుకుపోతాయని భావించాడు రాజు. అంతటి అగాథంలోనూ అతని కండ్లలో నిరాశ కన్నా.. ఓ పట్టుదల మెరిసింది. భవిష్యత్తుపై భరోసాతో ఓ నిర్ణయానికి వచ్చాడు. తాను వదిలేసిన బంజరులోనే కుటుంబం భవిష్యత్తుకు బంగారు బాట పరచాలని నిశ్చయించుకున్నాడు. తన నిర్ణయాన్ని భార్య కమలతో పంచుకున్నాడు. భర్త మాటపై నమ్మకం ఉంచిందామె! 2007లో ఉపాధి హామీ పథకం కింద బంజరును బాగు చేసుకున్నారు. మొదట జొన్నలు, పత్తి పంట వేశారు.
నీటి కొరత కారణంగా నష్టాలే మిగిలాయి. బిడ్డలను చదివించాలి, ఆదాయం చూస్తే అస్సలు లేదు. అయినా వెనక్కి తగ్గలేదు రాజు. తనకున్న భూమిలో రెండెకరాల్లో 140 మామిడి మొక్కలు నాటాడు. పులి మడుగు నుంచి ఒంటి చేత్తో బిందెలతో నీళ్లు మోసుకొచ్చి ప్రతి మొక్కకూ నీరు పెట్టేవాడు. రోజులు కాదు, వారాలు కాదు.. సంవత్సరాలు ఇదే పని. మరోవైపు సింగరేణి ఉద్యోగంలో పొదుపు చేసిన డబ్బుతో బోరు వేయించాడు. మామిడితోట పోను మిగిలిన భూమిలో వరి సాగు ప్రారంభించాడు. ఇప్పుడు ఎకరాకు 25 నుంచి 35 బస్తాల దిగుబడి సాధిస్తున్నాడు. మామిడి తోటలో అంతరపంటలు వేసి అదనపు ఆదాయం అందుకుంటున్నాడు.

భవిష్యత్తుకు హామీ..
‘2007లో ఉపాధి హామీ పథకంలో చేరి నా బంజరు భూమిని అభివృద్ధి చేసుకున్నాను. టేకు మొక్కలు కూడా ఆ పథకంలో ఇచ్చారు. అలా తోట చుట్టూ 580 టేకు మొక్కలు నాటాను. మరి కొన్నేళ్లు ఆగితే వాటి వల్ల సంపన్నుడిని అవుతానని అధికారులు అంటున్నారు …’ అంటాడు రాజు సంతోషంగా. మామిడి తోట ద్వారా ఏటా రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు ఈ రైతు. ఇప్పటికే ఏపుగా పెరిగిన టేకు చెట్లు మరో పదేండ్లలో రాజును కోటీశ్వరుణ్ని చేయనున్నాయని జిల్లా డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్ భూక్యా భీమ చెప్పుకొచ్చారు. ఉదయం అంబలి తాగి పొలానికి వెళ్లడం, సాయంత్రం వరకు పని చేయడం… ఇదే రాజు జీవితం.
టీవీలో వ్యవసాయ కార్యక్రమాలు చూస్తూ కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నాడు. సేంద్రియ కషాయాలు తయారు చేసి చీడపీడలను నియంత్రించడం, కలుపు మొక్కలను కంపోస్ట్గా మార్చి సాగుబడి సాగిస్తున్నాడు. ఒకప్పుడు రాళ్లూరప్పలు, పొదలతో ఉన్న బంజరు నేడు ఓ రైతు కృషికి నిండైన పచ్చదనంతో రాజు చేసి అద్భుతానికి నిదర్శనంగా కనిపిస్తున్నది. ‘రెండు చేతులు ఉన్నవారు చేయలేని పని… ఒక చేతితో నేను చేశాను. నా తోటలో పండిన సేంద్రియ మామిడి పండ్ల కోసం హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటారు ’ అంటాడు రాజు. తోటకు కాపు కాస్తున్న టేకు మొక్కలు ఇప్పుడిప్పుడే వృక్షాల్లా ఎదుగుతున్నాయి. ఇవి ఈ రైతును రాజుగా నిలబెట్టాలని మనమూ కోరుకుందాం!
– శ్యాంమోహన్ 9440595858
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

