‘ఇష్టమైన పనే చేస్తా. నచ్చిన బొమ్మలే గీస్తా’ అని ప్రణతి తెగేసి చెప్పింది. ‘అమెరికాలో చదువుకో. మంచి ఉద్యోగం చూసుకో’ అని అమ్మానాన్న హెచ్చరించినా వినలేదు. తన ఆలోచనలూ మార్చుకోలేదు. చివరికి అనుకున్నది సాధించింది. ‘మీ అమ్మాయిని భలేగా ప్రోత్సహిస్తున్నారు. మంచి ఆర్టిస్ట్‌గా తీర్చిదిద్దారు’ అని ఇరుగుపొరుగు అంటుంటే మాత్రం ఎంతో పొంగి పోయారా కన్నవారు. ‘అందుకే, నన్ను ఉదాహరణగా తీసుకోండి. ఇష్టమైనదే చేయండి. పట్టుదలతో పనిచేయండి’ అని యువతకు సలహా ఇస్తున్నారు . ఆ కళాత్మక జీవనం గురించి ఆమె మాటల్లో..
నేను సైన్స్ స్టూడెంట్‌ని. చిత్రకళలో శిక్షణ, అభ్యాసం రెండూ తెలియకుండా పెరిగాను. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్‌లో బీఎస్సీ (బయో టెక్నాలజీ) చదివాను. కానీ, సైన్స్ కంటే క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువ ఇష్టం. పీజీలో సైన్స్ వద్దనుకుని టెక్స్టైల్ డిజైనింగ్ చదవాలని నిర్ణయించుకున్నాను. అమెరికాలో ఎమ్మెస్ చేయడానికి సిద్ధం అవుతున్నప్పుడే.. కొవిడ్ లాక్డౌన్ విధించారు. దీంతో నా ప్రిపరేషన్ ఆగిపోయింది. ఒక రోజు ఇల్లు శుభ్రం చేసే పని పెట్టుకున్నాను. ఆ సమయంలో పాత వస్తువులు సర్దుతుంటే కొన్ని అక్రిలిక్ కలర్స్ బయటపడ్డాయి. వాటిని చూడగానే నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. నాకు బొమ్మలేసే అభిరుచి లేదు. అయితే, పదో తరగతిలో ఉన్నప్పుడు.. మా స్కూల్లో ఆర్ట్ కాంపిటీషన్ పెట్టారు. నేనూ పాల్గొన్నాను. నాకే ఫస్ట్ప్రైజ్ వచ్చింది. బహుమతిగా అక్రిలిక్ కలర్స్ ఇచ్చారు. అవే ఇవన్నీ.
కొవిడ్ దెబ్బకు ఇంటి దగ్గరే ఉంటున్నా. బోర్ కొడుతున్న సమయంలో రంగులు చేతికొచ్చాయి. సరిగ్గా అయిదేండ్ల తర్వాత మళ్లీ ఆ రంగులను చేతిలోకి తీసుకున్నాను. ఒక లాండ్ స్కేప్ వేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. అంతా మెచ్చుకున్నారు. తొమ్మిది రోజులకు ఒక థీమ్ చొప్పున పక్షులు, యానిమల్ పోర్ట్రెయిట్స్, అబ్స్ట్రాక్ట్స్, సీనరీస్, సన్‌సెట్, ఫ్లవర్స్.. ఇలా రకరకాల థీమ్స్‌తో చిత్రాలు గీశాను. ఒక్క రోజు కూడా ఆపకుండా.. వంద రోజులు వంద పెయింట్స్ గీశాను. ‘మీరు బాగా గీస్తున్నారు. మాకూ నేర్పవచ్చు కదా’ అని అడిగేవారు. ఒక్కొక్కరి దగ్గర వేయి రూపాయలు ఫీజు తీసుకుని శిక్షణ ఇచ్చాను. ఆ ఏడాది ఏడు వర్క్‌షాపులు నిర్వహించాను. అంతలోనే లాక్డౌన్ సడలించారు. నన్ను యూఎస్ పంపాలని అమ్మానాన్న ఆలోచన. నాకు మాత్రం కళలంటే పిచ్చి. నాకు నచ్చిందే చేయాలనుకున్నాను. ఇప్పటికీ చేస్తున్నాను. స్కూల్ పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు.. అన్ని వయసులవారూ నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తున్నాను. రెండో ఏడాది నూటయాభై ఆర్ట్ వర్క్ షాప్‌లు నిర్వహించాను. నాలుగు వందల మంది నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. అందులో యాభైశాతం కళాసాధన కొనసాగిస్తున్నారు.
ఒకప్పుడు బర్త్ డే పార్టీ, కిట్టీ పార్టీలో రకరకాల బొమ్మలు గీయించేవాళ్లు. ఇప్పుడు సీమంతంలో కూడా పెయింట్ పార్టీని యాడ్ చేస్తున్నారు. అతిథులు కొద్దిమంది ఉంటే లైవ్ పెయింటింగ్స్ వేసిస్తాను. ఎక్కువ మంది ఉంటే నేను వేస్తూ, వాళ్లతో పెయింటింగ్స్ వేయిస్తాను. మెటీరియల్ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను. సీమంతం సందర్భంలో ‘మదర్ అండ్ బేబీ’ కాన్సెప్ట్‌తో నిర్వహిస్తాను. అమ్మమ్మ, నాయనమ్మ, పిన్ని, అత్తమ్మ.. తెచ్చిన చిన్న చిన్న దుస్తులపై బొమ్మలు గీసి ఇస్తాను. వీటిని కమ్మని జ్ఞాపకాలుగా దాచుకుంటారు.
నేను పెయింటింగ్స్ వేసి అమ్ముతాను. కానీ, వర్క్‌షాప్స్ బిజీలో గీసేంత తీరిక లేదిప్పుడు. కాబట్టే, ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ‘ఎప్పుడైతే అప్పుడు వేసివ్వు..’ అంటేనే ఆర్డర్ తీసుకుంటాను. తీరిక ఉన్నప్పుడు తప్పక గీసిస్తాను. సినిమా సెలెబ్రిటీలు కూడా ఇన్‌స్టా ద్వారా సంప్రదిస్తున్నారు.. వాళ్ల పిల్లల పెయింటింగ్స్ వేయించుకుంటున్నారు. చేతినిండా పని, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా.. మా వాళ్లకు నేను చదువు ఆపేశాననే బాధ మాత్రం ఉండేది. ఇన్‌స్టాలో చాలా పాపులర్ అయ్యాను. ఎంతో మంది నా దగ్గర బొమ్మలు గీయడం నేర్చుకోవడం వల్ల పరిచయాలు పెరిగాయి. ఇవన్నీ చూసి ఇరుగుపొరుగు వాళ్లు ‘మీ అమ్మాయిని భలేగా పెంచారు. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో?’ అంటుంటే వాళ్లు ఆలోచనలో పడ్డారు. ఆ గౌరవాన్ని చూసి.. చివరికి నా ఇష్టాన్ని గౌరవించారు. నాకు మద్దతుగా నిలబడ్డారు. వర్క్‌షాప్‌కు కావాల్సిన ఆర్ట్ మెటీరియల్ అంతా అన్నయ్యే తీసుకొస్తాడు. ఇప్పుడు అందరం హ్యాపీ!
కొవిడ్ ప్రభావంతో ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్ని కంపెనీలు ఆర్ట్ వర్క్‌షాప్స్ నిర్వహించమని నన్ను కోరాయి. అలా ఒప్పొ, రాంకీ, హెడ్ డిజిటల్ లాంటి కంపెనీల కోసం పని చేశాను. ఉద్యోగులు కొత్త ఎక్స్పీరియన్స్ కోసం సరదాగా వస్తారు. రెండు గంటల్లో ఒత్తిడిని మర్చిపోతారు. ఆర్టిస్ట్‌లా ఫీలవుతారు. చిన్నప్పుడు గీసిన బొమ్మలు గుర్తుకొచ్చి.. బాల్యంతో కనెక్ట్ అవుతారు.
…? నాగవర్ధన్ రాయల