జనం ఖర్చులకు వెనుకాడటం లేదు. కాకపోతే, సౌకర్యాలు కోరుకుంటున్నారు. అనుభూతులు ఆశిస్తున్నారు. అది విమాన ప్రయాణమైనా సరే. నిజానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం, చెక్ ఇన్ తతంగం పూర్తి చేసుకోవడం, విమానం కోసం గంటలపాటు ఎదురుచూస్తూ కూర్చోవడం తలనొప్పి వ్యవహారమే. ఆ ఇబ్బందులను తగ్గించి, జర్నీని కమ్మని అనుభూతిగా మారుస్తామంటూ ముందుకొచ్చింది లిబరతా పీటర్.
ఆ ప్రయత్నంలో ‘డ్రీమ్‌ఫోక్స్’ అనే సంస్థకు ప్రాణం పోసింది. ఇది ఎయిర్పోర్ట్ సర్వీస్ ప్లాట్‌ఫామ్. తమ కస్టమర్స్‌కు విమానాశ్రయాల్లో మహారాజ సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. అందరితోపాటు వరుసలో నిలబడి వెళ్లకుండా.. ప్రత్యేక మార్గంలో ప్రవేశించేలా ఎయిర్ పోర్ట్ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుంటారు.
కాసేపు కునుకు తీసేందుకు వీలుగా లాంజ్ సేవలూ ఉంటాయి. విమానాలు రద్దయినప్పుడు ఫైవ్‌స్టార్ ఆతిథ్యం అందిస్తారు. ఈ గోవా యువతి అమెరికాలో చదువుకుంది. భరతనాట్యం, కథక్ నృత్యకారిణి కూడా. అమ్మమ్మ దగ్గర గోవా పాకశాస్త్ర రహస్యాలన్నీ తెలుసుకున్నానని చెబుతుంది లిబరతా పీటర్. ‘ప్రయాణం ఓ తీపి జ్ఞాపకం. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాలి. ఇదే మా డ్రీమ్‌ఫోక్స్ లక్ష్యం’ అంటుందామె.