అభ్యుదయ పాఠశాల.. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆవరణలో బాలికాభ్యుదయం పరిఢవిల్లుతున్నది. తొలినాళ్లలో.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలల్ని స్థాపించడమే అభ్యుదయం. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే అభ్యుదయం. ఆడపిల్లలకు మెరుగైన విద్యను అందిస్తే ఉత్తమ ఫలితాలనే కాదు, ఉన్నతమైన విజయాలనూ సాధిస్తారని పాల్వంచలోని ఈ విద్యాలయం రుజువు చేస్తున్నది.
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో చిరు వ్యాపారాలు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునేవారి పిల్లలంతా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (జడ్పీజీహెచ్‌ఎస్ -అభ్యుదయ)లోనే చదువుతారు. సంపన్నులు కూడా తమ కూతుళ్లను అక్కడే చేర్పించాలి అనుకుంటారు. కారణం ఆ బడి క్రమశిక్షణకు మారుపేరు. విద్యార్థినులంతా సకాలంలో హాజరవుతారు. అందులోనూ ఎనిమిదో తరగతి బాలికలు ఓ గంట ముందే బడికి వెళ్తారు. వాళ్లకు ముందే పాఠాలు మొదలుపెడతారు టీచర్లు. మెరిట్ స్కాలర్ షిప్ లక్ష్యంగానే ఈ సాధనంతా జరుగుతుంది. అభ్యుదయ పాఠశాల పదోతరగతి ఫలితాల్లోనూ తిరుగులేని ఆధిక్యత చాటుతున్నది. గత విద్యా సంవత్సరం 108 మంది విద్యార్థినులు ఉంటే.. 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 161 మంది ఉన్నారనీ, అంతకు మించిన ఫలితాలు సాధిస్తామనీ ఉపాధ్యాయులు నమ్మకంగా చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 140 కొత్త అడ్మిషన్లు ఇచ్చారు. జూన్ మొదటి వారంలోనే ‘నో అడ్మిషన్స్’ బోర్డు పెట్టేశారు.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ఎగ్జామినేషన్‌ను ఏటా నవంబరులో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఆగస్టులోనే శిక్షణ మొదలవుతుంది. ఏడో తరగతిలో ఉన్నప్పుడే, ‘మీలో బాగా చదివే వాళ్లకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఆ పరీక్ష బాగా రాస్తే మీ ప్రతిభకు గుర్తింపే కాదు, చదువులకు కావాల్సిన డబ్బు కూడా వస్తుంది’ అని పిల్లలను ప్రోత్సహిస్తారు. అలా ఉపాధ్యాయులు స్ఫూర్తి నింపడం వల్లే.. ఏడాది ముందు నుంచే పిల్లలు బాగా చదువుతారు. విద్యా సంవత్సరం ఆరంభంలో ఎనిమిదో తరగతి విద్యార్థినుల్లో మెరుగైన వారిని ఎంపిక చేస్తారు. శిక్షణకు ఎంపికైనవారు ఇతర విద్యార్థినుల కంటే ముందే బడికి రావాలి. సాయంత్రం కూడా అదనపు క్లాసులు ఉంటాయి. ఆదివారమైనా వెళ్లాల్సిందే. తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే ఇదంతా సాధ్యం కాదు కాబట్టి, పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇంటిదగ్గర ఎలా చదివించాలి? ఎలాంటి సహకారం అందించాలి?

అన్నది వివరిస్తారు. పరీక్షల భయాన్ని పోగొడుతూనే.. ఓఎంఆర్ షీట్లో సమాధానాలు నింపడాన్ని అలవాటు చేసేందుకు మాక్ టెస్టులు నిర్వహిస్తారు. ఇంత చేశాక ర్యాంకులు సాధించకుండా ఉంటారా? గత విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల నుంచి పద్దెనిమిది మంది విద్యార్థినులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. లాక్ డౌన్ రోజుల్లో కూడా శిక్షణ ఆపలేదు. ఆన్లైన్లో క్లాసులు చెప్పారు. ఈ పాఠశాలలో ప్రత్యేక శిక్షణను ఐదేండ్ల క్రితం మొదలుపెట్టారు. ఏటా 25 నుంచి 30 మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. వాళ్లలో చాలామంది స్కాలర్షిప్స్ సాధిస్తున్నారు. ఎంపికైన విద్యార్థినులు ఇంటర్మీడియెట్ వరకు ఏటా రూ. 12 వేల స్కాలర్షిప్ అందుకుంటారు. ఈ ఐదేండ్లలో 60 మంది విద్యార్థినులు నేషనల్ మెరిట్‌కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ సాధించారు. ‘నేను 2021లో స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యాను. ఆ డబ్బు చూసి మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. మా అమ్మవాళ్లు గర్వపడ్డారు. మా చుట్టాలందరికీ గొప్పగా చెప్పుకొన్నారు. నేనూ వాళ్లతోపాటే మురిసిపోయాను’ అంటున్నది పదో తరగతి విద్యార్థిని దిశ.
‘స్కాలర్షిప్ సాధించేందుకు చాలా కష్ట పడ్డాను. రోజూ ప్రత్యేక తరగతులకు హాజరయ్యాను. ఏ సందేహం వచ్చినా టీచర్లు నివృత్తి చేశారు. మా పిల్ల చదువుకుంటూనే సంపాదిస్తున్నది.. అంటూ అమ్మానాన్న గర్వపడుతున్నారు’ అని సంబురంగా చెప్పింది మరో విద్యార్థిని శ్రీసంజన. ‘మా నాన్న కొత్తగూడెంలో హెడ్ కానిస్టేబుల్. నేను చదివే ప్రైవేట్ స్కూల్లో టీచర్లు తరచూ మారేవారు. అభ్యుదయ హైస్కూల్లో అయితే బాగా చెబుతారని నాన్న ఇక్కడ చేర్పించారు’ అని చెప్పింది షేక్ షీమా. నిజమే, జీవితాలను మార్చగలిగే శక్తి ఒక్క చదువులకే ఉంది. అభ్యుదయ పాఠశాల ఆ సానుకూల మార్పునకు ఓ సంకేతం. విజయ కేతనం కూడా.
అత్యధికంగా బాలికల నమోదు ఉన్న పాఠశాల మాది. మా విద్యార్థినులు అన్ని విషయాల్లోనూ ముందుంటారు. ఏటా 25 నుంచి 30 మందిని శిక్షణకు ఎంపిక చేస్తున్నాం. వీళ్లలో 50 నుంచి 60 శాతం మంది స్కాలర్షిప్ సాధిస్తున్నారు. పదో తరగతి తర్వాత ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆగిపోకుండా ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయ బృందం సమష్టి కృషి ఫలితమే ఇదంతా.
ఆకుల పద్మలత ప్రధానోపాధ్యాయురాలు