తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్‌ని ఎంచుకున్నానంటున్నది ఈ యేటి ఫుల్ రైడ్ స్కాలర్షిప్ విజేత కృష్ణచైతన్య నరెడ్ల. ఈ ప్రోత్సాహకానికి ఎంపికైన ఇద్దరు భారతీయుల్లో ఆమె ఒకరు. ‘ఉపాధ్యాయ వృత్తిలో నేర్చుకుంటూ నన్ను నేను మార్చుకున్నా.. కేంబ్రిడ్జ్, ఐబీ కరిక్యులమ్ చదివి విద్యావేత్తగా ఎదగాలనుకున్నా. నేర్చుకోవాలనుకున్నా.. ఆ ప్రయత్నంలో ఈ విజయం సాధించాను’ అంటున్న సక్సెస్ఫుల్ టీచరమ్మ చెబుతున్న సక్సెస్ పాఠం ఇది!
మాది నిజామాబాద్. తోటివాళ్లంతా ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో నాకు నచ్చిన కోర్స్‌లో చేరాను. మా అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే సంతోషంగా చదువుకునే అవకాశం నాకు కలిగింది. నాన్న కోటేశ్వరరావు రేపల్లెలో నేచరోపతి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అమ్మ రత్నజ్యోతి గృహిణి. మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని కోరుకునేవాడు. కానీ, దాన్ని నాపై రుద్దలేదు. పిల్లలు వాళ్ల ఆసక్తిని బట్టి చదవాలని కోరుకునే మనిషి ఆయన. ఇంటర్మీడియెట్ తర్వాత డిగ్రీ చదువుతానంటే.. హన్మకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చేర్పించారు.
టీచింగ్ నా ప్యాషన్. మంచి ఎడ్యుకేటర్ కావాలన్నది నా లక్ష్యం. డిగ్రీ చదివేరోజుల్లో ఆ లక్ష్యం ఏర్పడింది. మా డిగ్రీ కాలేజీ ల్యాబ్‌లో సరైన సదుపాయాలు ఉండేవి కావు. అధ్యాపకులూ అందుబాటులో ఉండేవారు కాదు. అధ్యాపకుల్లో శ్రద్ధ, కళాశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే విద్యార్థులు గొప్పగా నేర్చకోగలుగుతారు. అద్భుతాలు సృష్టించగలుగుతారు. కానీ, మన విద్యాసంస్థలు విద్యార్థుల్ని పరీక్షల్లో పాస్ చేయించడం కోసమే పనిచేస్తున్నాయి. చదువు ప్రతి వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. టీచర్ అద్భుతమైన భవిష్యత్ ఇవ్వగలడు. కానీ, మన టీచర్లకే ఆసక్తి లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారదా? డిగ్రీలో నాకు ఎదురైన అనుభవాల వల్ల టీచర్ కావాలనుకున్నా! విద్యార్థులకు మంచి బోధన అందించాలనుకున్నా!
ఎక్కువ మంది సాఫ్ట్వేర్, మేనేజ్మెంట్ వైపు వెళ్తున్న రోజుల్లో నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో ఎమ్మెస్సీ, బీఎడ్ చేయాలనుకున్నా. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతానని చెబితే.. మా నాన్న దేశంలో మంచి ఇన్స్టిట్యూట్లను ఎంక్వైరీ చేసి, బెంగళూరులోని గార్డెన్ సిటీలో చేరమని సలహా ఇచ్చాడు. అక్కడే పీజీ పూర్తి చేశాను. అక్కడ చదవడం వల్ల నేను ఈ ప్రపంచం గురించి మరింత విస్తృతంగా తెలుసుకోగలిగా. అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నాను. పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను.
టీచింగ్ చేయాలనుకున్నాను కదా! అనుకున్నట్టే సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు రాసేవాళ్లకు జనరల్ సైన్స్ బోధించే అవకాశం వచ్చింది. ఢిల్లీలో ఓ శిక్షణ కేంద్రంలో ట్యూటర్‌గా జాయిన్ అయ్యాను. సివిల్స్‌కి సిద్ధమయ్యేవాళ్లకు ఎంతో జ్ఞానం ఉంటుందని, బాగా నేర్చుకోవాలనే తపనతో ఉంటారని ఊహించా. వాళ్లకు చెప్పడం ద్వారా నాకు ఎన్నో సంగతులు తెలుస్తాయని ఆశించా! కానీ, వాళ్ల దగ్గర నేర్చుకునేందుకు ఏమీ లేదని కొన్నాళ్లకే అర్థమైంది. వాళ్లంతా ఐఐటీ, ఐఐఎంలలో చదివారనే గొప్ప పేరే! కానీ, ఏ విషయాలూ కొత్తగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదు. కొన్ని ఆలోచనలు ఫిక్స్ చేసుకొని ఉండేవారు. హేతుబద్ధంగా ఆలోచించేవాళ్లు కాదు. కొత్త ఆలోచనలను మనసులోకి రానిచ్చేవాళ్లు కాదు. నేర్చుకునే దశను దాటిపోయారన్నమాట! వాళ్లకు కేవలం ఫ్యాక్ట్స్ కావాలి. మార్కులు రావాలి. వాళ్లకు ఏం చెప్పినా దండగ అనిపించేది. ఆ వాతావరణం నాకు నచ్చలేదు. అందుకే సివిల్స్ కోచింగ్ వదిలిపెట్టాను. పిల్లలకు విద్యాబోధన చేయాలని బీఎడ్‌లో చేరాను.
మంథని అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకున్నాక.. కరీంనగర్ వచ్చాను. తను వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడు. నేను నా ఇష్టమేమిటో తనతో చెప్పాను. కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ హైస్కూల్లో బయాలజీ టీచర్‌గా చేరాను. అలాగే వైస్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. నేను ఏది కోరుకున్నానో అది దొరికిందన్న సంతోషం కలిగింది. ఆ తర్వాత పారమిత హెరిటేజ్ స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా వెళ్లాను. జ్ఞానానికి హద్దుల్లేవు. జీవితకాలమంతా నేర్చుకోవచ్చని నేను నమ్ముతాను. అప్పటి దాకా చెప్పిన స్కూల్స్‌లో ఎన్నో నేర్చుకున్నాను. ఈ అభ్యాసం ఒకచోట ఆగిపోవద్దు. జీవితకాలం కొనసాగించాలి.
అందుకే, ఆరేండ్ల కిందట కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ కోర్సులో చేరాను. కేంబ్రిడ్జ్ కోర్స్ చదువుతున్నప్పుడు టీచర్ నుంచి విద్యావేత్తగా ఎదగాలనుకున్నాను. విద్యారంగంలో విస్తృతమైన అధ్యయనం కోసం విదేశాల్లో పనిచేయాలనుకున్నాను. ఆ మాట మా ఆయనకు చెబితే ‘ఎందుకు’ అని ప్రశ్నించలేదు. వెళ్లమని వెన్నుతట్టారు. నేను ఎక్కడికి వెళ్లినా నా కొడుకుని తీసుకెళ్తానని చెప్పాను. అందుకూ సమ్మతించారు. అలా మాల్దీవులకు వెళ్లాను. కొవిడ్ కాలంలో పిల్లలకు పాఠాలు చెబుతూ, ఆన్లైన్లో పద్దెనిమిది ఇంటర్నేషనల్ సెమినార్లలో పాల్గొన్నాను.
ఐబీ కరిక్యులమ్ విద్యా విధానం గురించి తెలుసుకోవాలనిపించింది. మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో ఉన్న ఒక ఐబీ కరిక్యులమ్ స్కూల్లో చేరాను. బయాలజీ ఎడ్యుకేటర్‌గా పాఠాలు చెబుతూనే హెడ్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కెరీర్ కౌన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ క్రమంలో అమెరికాలోని న్యూమెక్సికో పబ్లిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాకు ‘ప్రొఫెషనల్ ఎడ్యుకేటర్ సర్టిఫికెట్ ఆఫ్ లైసెన్స్’ ఇచ్చింది. అమెరికాలో టీచ్ చేసేందుకు ఇది అనుమతిస్తుంది. నేను ఎదిగాను. ఇంకా ఎదుగుతున్నాను. విద్యా విషయంలో నేర్చుకునేందుకు ఎన్నో దారులున్నాయి. మాస్టర్స్ ఇన్ అడ్వాన్స్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ చదవాలనుకున్నాను.
దానికోసం ఫుల్ రైడ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేశాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికి పైగా ఐబీ ఎడ్యుకేటర్స్ దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి ఎందుకు వచ్చారు? వృత్తి అనుభవం, ఫెలోషిప్ ద్వారా విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి ఏం చేస్తారు? ఎలా సాధ్యం? అనే అంశాలతోపాటు, ఇప్పటి వరకు విద్యా బోధనలోని అనుభవాలను విశ్లేషిస్తూ ఆర్టికల్ రాయాలి. నేను పుట్టిన విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులేమిటి? అవి ఎలా తీసుకురావాలనుకుంటున్నానో చక్కగా రాశాను. అందుకే ఈ ఫెలోషిప్‌కి నన్ను ఎంపిక చేశారు. డబ్బు మంది విజేతల్లో నేనున్నాను. మన దేశం నుంచి ఇద్దరే దీనికి ఎంపికయ్యారు. తెలుగువారిలో నేనొక్కదాన్నే! ఈ ప్రోత్సాహం నా ప్రయాణాన్ని మరింత గొప్పగా మలుస్తుందని విశ్వసిస్తున్నాను.
మన దేశంలో ఎన్నో రకాల పనుల్లో ఫెయిలైన తర్వాత టీచర్ వృత్తిలోకి వచ్చినవాళ్లు కనిపిస్తారు. కానీ, విదేశాల్లో టీచర్‌గా ఫెయిలైతే ఇతర వృత్తుల్లో అవకాశాలు వెతుక్కుంటారు. ఇండోనేషియాలో నా కొలీగ్స్ టీచర్‌గా ఫెయిలైతే సాఫ్ట్వేర్, సైకాలజీ కౌన్సెలర్ ప్రొఫెషన్లోకి మారిపోయారు. మన దగ్గర పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బతకలేక బడిపంతులు అన్నట్టే ఉంటుంది ఇక్కడ. చాలామంది ఉపాధ్యాయులు ‘నేను ఫెయిల్ అయ్యాను’ అనే భావనలో ఉంటున్నారు. ఆ ఆలోచన ఉంటే.. పిల్లలకు ఏమీ చెప్పలేరు. ‘మీరు చదవకపోతే నాలాగే టీచర్ అవుతార’ని విద్యార్థులను మందలిస్తుంటారు.
వాళ్లు చేస్తున్న వృత్తిపై వారికి ఎలాంటి భావన ఉందో ఈ మాటతో తెలుస్తున్నది! మంగోలియాలో ఒకమ్మాయి బయోకెమిస్ట్ అవ్వాలనుకునేది. నన్ను చూసి టీచర్ కావాలనుకుంది. అమెరికాలో మంచి యూనివర్సిటీలో చేరింది. ‘మీరే నాకు ఇన్స్పిరేషన్’ అంటూ లెటర్ రాసింది. మా స్టూడెంట్స్ ఎంతోమంది ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. వాళ్ల విజయాల్ని మావిగా భావిస్తాం. ఒక టీచర్‌కు అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది!!
– నాగవర్ధన్ రాయల, అంకరి ప్రకాశ్