కొవిడ్ ప్రబలిన రోజులవి. కామారెడ్డి దగ్గర్లోని ఓ పల్లె. అక్కడ ఓ పాతికేండ్ల యువతి భర్తను కరోనా కబళించింది. ఇద్దరు పిల్లల ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. భర్త బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బుందో కూడా ఆమెకు తెలియదు. ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు. ఆమె దీనస్థితిని ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టును చూసింది శ్రీఊహ. క్షణం ఆలస్యం చేయకుండా ఆయువతి దగ్గరికి వెళ్లింది. తనకు చేతనైన సాయం చేసి వచ్చింది. అయినా.. ఆమె మనసు కుదుటపడలేదు. స్మార్ట్ఫోన్ల రూపంలో అరచేతిలోకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని స్థితిలో ఎందరో ఉన్నారు. వారికోసం కార్పొరేట్ కొలువును కాదనుకొని.. వీహబ్‌తో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది ఊహ.
‘ఎవరీ ట్యాంక్‌బండ్ శివ?..’ అని ఆరాతీసింది ఊహ. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడేవారిని కాపాడటమే లక్ష్యంగా బతుకుతున్నవాడు. కాలుష్య కాసారంలోకి దిగడమే ఆశ్చర్యమైతే, ఎందరి ప్రాణాలో కాపాడటం అద్భుతం అనుకుంది. అతణ్ని కలిసింది. తన గాథంతా తెలుసుకుంది. ‘శివ అంటే ఈడే’ అనే కథను రాసింది. అదికాస్తా వైరల్ కావడంతో అప్పటి ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ట్యాంక్‌బండ్ శివకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రకటించారు.
ఇంతకీ ఎవరీ ఊహ. కొందరి వ్యథలు తీర్చాలనీ, మరికొందరి గాథలు ప్రపంచానికి చాటిచెప్పాలని భావిస్తున్న శ్రీఊహ చిక్కటి రచన చేసే చక్కటి సాహితీమూర్తి. సామాజిక కోణంలో సాగే ఆమె సాహితీ ప్రస్థానంలో రెండు పుస్తకాలు వెలుగు చూశాయి. ఆమెకు ప్రతిష్ఠాత్మక అవార్డులు తెచ్చిపెట్టాయి. సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ద్వారా ఎందరో మహిళల ఊహలకు రెక్కలు తొడుగుతున్న శ్రీఊహ కథ ఇది..
శ్రీఊహ సజ్జ.. పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే! కోల్‌కతా ఐఐఎంలో ఎంబీఏ చేసింది. తర్వాత నల్సార్ లా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చదివింది. చదువు పూర్తవడంతోనే సాఫ్ట్వేర్ కొలువు కొట్టింది. ఏడాదికి రూ.30 లక్షల ప్యాకేజీ. తండ్రి జర్నలిస్ట్. తల్లి బ్యాంకర్. అన్నీ ఉన్నా.. ఏదో వెలితి. కామారెడ్డి యువతి కన్నీటి గాథ ఊహను కలిచివేసింది. కార్పొరేట్ ఉద్యోగానికి టాటా చెప్పింది. సామాజిక జీవనానికి శ్రీకారం చుట్టింది. నలుగురికీ మేలు చేయాలనే లక్ష్యంతో వీహబ్‌లో ఇన్నొవేషన్ ఎకో సిస్టమ్ సోషల్ సెక్టార్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నది.
‘మహిళా సామాజిక వ్యవస్థాపకత’ (సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్) ద్వారా అనేకమంది గ్రామీణ మహిళలను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగే క్రమంలో అతివలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తున్నది. సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి వ్యాపారాత్మక నమూనాలను వివరించి.. గ్రామీణ మహిళలను వ్యాపార రంగం వైపు అడుగులు వేయిస్తున్నది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్యం లాంటి అంశాల్లో మార్పు కోసం తనవంతుగా కృషి చేస్తున్నది.
వీహబ్‌లో చేరాక మహిళా ఆంత్రప్రెన్యూర్లను గుర్తించడం, వారిని ప్రోత్సహించడం పనిగా పెట్టుకుంది ఊహ. వారి ప్రయాణంలో ఉన్న ప్రతిబంధకాలను అధిగమించేందుకు చేయూతను ఇస్తున్నది. ‘మహిళా పారిశ్రామికవేత్తల కోసం వ్యాపార ఆలోచనల అభివృద్ధి, వ్యాపార ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ సంస్థలు, పెట్టుబడిదారులు వంటి వ్యాపార భాగస్వాములతో సుస్థిర సంబంధాలు ఏర్పరచడం, కొత్త కార్యక్రమాలు రూపొందించడం, ప్రభుత్వ పథకాలు సంబంధిత ఆంత్రపెన్యూర్స్‌కు ఉపయోగపడేలా చూడటం, ఇన్నొవేషన్ ప్రోత్సాహకాలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షించడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, మారెట్ రీసెర్చ్, గవర్నమెంట్ రిలేషన్స్ తదితర టాస్కులు చేస్తుంటాను.
సృజనాత్మకత, పట్టుదల ఉన్న మహిళలను ప్రోత్సహిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. వారి ప్రతిభకు తగ్గ వేదికను అందించడానికి అహరహం పనిచేస్తున్నాను’ అని చెబుతున్నది ఊహ. ఈ ప్రయాణంలో కేవలం వీహబ్ టవర్‌కే పరిమితం కాలేదామె! కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటి.. వేలాది మందికి వ్యాపార పాఠాలు నేర్పింది. ఎంతోమంది పట్టణ, గ్రామీణ మహిళలను వీహబ్‌కు రప్పించగలిగింది. ప్రభుత్వం నుంచి ఆర్థికంగా తోడ్పాటు అందేలా కృషి చేస్తున్నది.
ఊహకు సాహిత్యమంటే ప్రాణం. తీరిక సమయాల్లో మనసు కదిలించే కథలు రాయడం తనకు వారసత్వంగా అబ్బిన వ్యసనం అంటుందామె. ఈ సాహితీ సాగులో వెలువడిన సంకలనాలే ‘ఇసుక అద్దం’, ‘బల్కావ్’. ‘ఇసుక అద్దం’లో స్త్రీల సహజమైన శరీరధర్మాల చుట్టూ సమాజం అల్లిన మార్మిక భావజాలం, నిర్దేశించిన సౌందర్య ప్రమాణాలు, కెరీర్ కోసం పోటీ, కుటుంబ సంబంధాల్లో దూరాలు, నైతిక ప్రమాణాల్లో హిపోక్రసీ, పిల్లల పెంపకంలో సమస్యలు తదితర అంశాలను అధారంగా చేసుకొని అందమైన కథలు రాసిందామె! ఊహ తన కథల్లో పాత్రలను బాధితులుగా చిత్రీకరించదు. బలమైన వ్యక్తిత్వం ఉన్నవారిగా చూపుతుంది. ఇక రెండో పుస్తకం ‘బల్కావ్’! అంటే బాల్కనీ అని అర్థం. తన సోలో బ్యాక్‌ప్యాక్ విహారాల్లోంచి ఇందులోని కథలు పుట్టాయి. వీటిలో కొన్ని ప్రత్యక్షంగా చూసి రాసినవైతే, మరికొన్ని ఊహించి రాసినవి. ఆమె కథా వస్తువులు ఇప్పటి కాలజాలం నుంచి కొన్ని పుడితే… వందలేండ్ల కిందటి గాథలు మరికొన్ని.
‘ఇసుక అద్దం’ పుస్తకానికి యండమూరి వీరేంద్రనాథ్ ఉగాది పురసారం, పురాణం శ్రీనివాస శాస్త్రి కథా పురసారం లభించాయి. అందులోని ‘చుక పొడిచింది’కి వాయిస్ అఫ్ తెలంగాణ అవార్డు, హాసిని రామచంద్ర ఫౌండేషన్ కథా పురసారం, ఖమ్మం ఈస్థటిక్స్ పురసారం దక్కాయి. అలాగే ఈ పుస్తకం ద్వారా ఊహ కొన్ని సామాజిక సమస్యల గురించి ప్రస్తావించింది. దీనికిగానూ, గతేడాది విడుదలైన ‘50 ఇన్స్పైరింగ్ విమెన్ ఆఫ్ తెలంగాణ’ ఫీచర్లో ఊహకు చోటు లభించింది. ఇసుక అద్దంలోని ‘వాష్’ అనే కథను ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ పెద్దల సమక్షంలో ప్రెజెంట్ చేసే అవకాశం కూడా దక్కింది. ‘ఇసుక అద్దం’లో ప్రస్తావించిన పలు అంశాలు కేస్ స్టడీస్‌లా తీసుకుంటామని ఢిల్లీ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ పేర్కొనడం ఊహ రచనా వైచిత్రిని తెలియజేస్తుంది. ‘కొందరు చేస్తున్న వృత్తిలో సంతృప్తిని వెతుక్కుంటారు. మరికొందరు తమ ప్రవృత్తికి తగ్గ పనులు చేస్తూ ఆనందాన్ని పొందుతారు. నేను ఈ రెండిటినీ ఎంజాయ్ చేస్తున్నా’ అంటున్న ఊహ మరెందరికో ఆదర్శమని చెప్పకుండా ఉండలేం!
– రవికుమార్ తోటపల్లి