నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి.. ఓ భారతీయుడు రోదసిలో కాలుమోపి! మళ్లీ మనవాడు తారాపథంలో దూసుకెళ్లే శుభ తరుణం తారసిల్లింది. భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్లా ఇంకొన్ని గంటల్లో గగనాంతర రోదసిలోకి ప్రవేశిస్తున్నారు. ఆపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పద్నాలుగు రోజులు విడిది చేయనున్నారు. మరో ముగ్గురు వ్యోమగాములతో శుక్లా పయనమవుతున్నారు. స్పేస్ ఎక్స్, నాసా చేపడుతున్న ‘యాక్సియం-4’ మిషన్‌లో భాగంగా ఆయన రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. భారత కీర్తి పతాకను ఐఎస్ఎస్లో రెపరెపలాడించనున్న శుభాంశు శుక్లా ప్రస్థానం ఇది..
1984 ఏప్రిల్‌లో రాకేశ్ శర్మ.. రష్యాకు చెందిన వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లాడు. అప్పటికి శుభాంశు శుక్లా ఇంకా పుట్టనే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 1985 అక్టోబర్ 10న ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో జన్మించాడు శుక్లా. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే నింగిలో దూసుకుపోతున్న విమానాన్ని తనూ తదేకంగా చూసేవాడు. పెద్దయ్యాక పైలట్ అవుతా అని అలా చూసిన అందరు పిల్లలూ కాలర్ ఎగరేసి మరీ చెబుతారు. శుక్లా అలా ఎప్పుడూ చెప్పలేదు కానీ, విమానం శబ్దం వినిపిస్తే చాలు.. ఏ పనిలో ఉన్నా అది కనుమరుగయ్యే వరకూ దాని వంకే చూస్తుండిపోయేవాడు.
సివిల్స్ సాధించాలని చిన్నప్పటి నుంచీ శుక్లా కలలు కనేవాడు. కానీ, బళ్లో ఓ రోజు అనుకోకుండా అతని దృష్టి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) వైపు మళ్లింది. తన స్నేహితులు ఎన్డీఏకు దరఖాస్తు చేస్తుంటే ఆసక్తిగా గమనించాడు. ఎన్డీఏ అంటే ఏంటో నలుగురినీ అడిగి తెలుసుకున్నాడు. తనకు అదే కరెక్ట్ అనుకున్నాడు. దరఖాస్తు చేసుకున్నాడు. ఎంపికయ్యాడు. పూణెలోని ఎన్డీఏ నుంచి 2005లో బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకున్నాడు. తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ చదివాడు. 2006లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా ప్రయాణం మొదలుపెట్టాడు శుభాంశు. 2018లో భారత వాయిసేన టెస్ట్ పైలట్ అయ్యాడు. వాయుసేనలో రకరకాల యుద్ధ విమానాలు నడిపాడు! ఎస్‌యూ-30 ఎమ్కే 1, ఏఎన్-32, మిగ్-29 ఇలా రకరకాల ఫైటర్ జెట్లను గింగిరాలు కొట్టించాడు. మూడేండ్ల కాలంలో దాదాపు 2000 గంటలపాటు యుద్ధ విమానాలు నడిపిన ట్రాక్ సొంతం చేసుకున్నాడు.
2019లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. శుక్లాను వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘గగన్నయాన్’ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుక్లా ఒకరు. వీరంతా రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో 2021లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. తర్వాత బెంగళూరులోని అంతరిక్ష యాత్రికుల శిక్షణ కేంద్రంలో మరింత రాటుదేలారు. అలా అంతరిక్ష యాత్రకు సర్వ సన్నద్ధం అయిన శుభాంశు శుక్లాకు ‘యాక్సియం-4’ మిషన్ రూపంలో అనుకోని అవకాశం తలుపుతట్టింది. స్పేస్ ఎక్స్, నాసా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మిషన్‌లో ఆయన పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు. యుద్ధ విమనాలు నడిపిన శుక్లా.. తొలిసారి వ్యోమనౌకను డ్రైవ్ చేస్తున్నాడు. అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు కమాండర్ కాగా, హంగేరి, పోలాండ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు మిషన్ స్పెషలిస్ట్‌లుగా ఐఎస్ఎస్కి బయల్దేరుతున్నారు.
2027లో ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్‌కు ముందే శుభాంశు అంతరిక్షంలోకి వెళ్లడం శుభపరిణామం అంటున్నారు భారత అంతరిక్ష రంగ నిపుణులు. ఈ ప్రయాణం మన గగన్‌యాన్‌కు ఎంతగానో దోహదం చేస్తుందని నమ్ముతున్నారు. మరి కొద్ది గంటల్లో రోదసిలోకి దూసుకుపోతున్న శుభాంశు రెండు అరుదైన ఘనతలు సాధించనున్నాడు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా రెండు రికార్డులు నెలకొల్పనున్నాడు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఇక శుక్లా ఐఎస్ఎస్లో రెండు వారాల పాటు ఉంటాడు. అక్కడ పలు పరిశోధనల్లో భాగం కానున్నాడు. తనతోపాటు మామిడిపండ్ల రసం, మూంగ్‌దాల్ హల్వా, క్యారెట్ హల్వా తీసుకెళ్తున్నట్టు శుక్లా పేర్కొన్నాడు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు కూడా తను మోసుకెళ్తున్నట్టు చెప్పాడు.
1984లో అంతరిక్షంలోకి వెళ్లిన సందర్భంలో.. రాకేశ్ శర్మను భారత్ ఎలా కనిపిస్తుందని అడిగితే.. ‘సారే జహా సే అచ్చా.. హిందూసితా హమారా’ అని దేశమంతా పొంగిపోయే జవాబు ఇచ్చాడు. అదే అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాంశు శుక్లా ఏం సమాధానం చెబుతాడో అని 140 కోట్ల మంది భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్ ద బెస్ట్ శుభాంశు శుక్లా! హ్యాపీ జర్నీ!!