ఓ శిక్షణ ఆమె జీవితాన్ని మార్చేసింది. నలుగురూ మెచ్చేంత నైపుణ్యంగా సంచులు తయారు చేయగల సృజనను ప్రసాదించింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన సొసకాండ్ల రాధిక ఒక సాధారణ గృహిణి. కిరాణా దుకాణంలో భర్తకు సాయంగా ఉంటూనే కుట్టుపని నేర్చుకుంది. ఎంబ్రాయిడరీలో ఆరితేరింది. మూడేండ్ల క్రితం హైదరాబాద్ నుంచి అంబిక అనే శిక్షకురాలు కేసముద్రానికి వెళ్లి.. సాధికారిత మండల సమాఖ్య మహిళలకు సంచుల తయారీలో శిక్షణ ఇచ్చింది. ఆ అవకాశాన్ని రాధిక సద్వినియోగం చేసుకుంది. పనిలో పట్టు సాధించింది.
సొంతంగా సంచుల తయారీ ఆర్డర్లు సంపాదించుకునే సమయంలో లాక్డౌన్ వచ్చింది. అయినా నిరాశపడకుండా.. మాస్కుల తయారీ ద్వారా ఉపాధి పొందింది. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు సరఫరా చేసింది. ఆమె రూపొందించిన.. ‘ప్లాస్టిక్ నిషేధిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం’ నినాదంతో కూడిన త్రీ ఇన్ వన్ సంచులు బాగా ప్రాచుర్యం పొందాయి. దీంతో పెండ్లిళ్లు, పుట్టిన రోజులు, బారసాలలు.. తదితర శుభకార్యాలకు రిటర్న్ గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలామంది రాధిక డిజైన్ చేసిన సంచులనే ఎంచుకుంటున్నారు.
అంతేకాదు.. మొబైల్ పౌచ్‌లు, హ్యాండ్ బ్యాగులు, లంచ్‌బాక్స్ బ్యాగులు, స్కూలు బ్యాగులు, వాటర్ బాటిల్ బ్యాగులు.. ఇలా అన్ని రకాల సంచులనూ కుట్టి విక్రయిస్తున్నది రాధిక. సైజును బట్టి రూ.60 నుంచి రూ.300 వరకూ ధర పలుకుతాయి. ఈ పనిలో రాధికకు సరిత, రేష్మ, ప్రమీల సాయంగా ఉంటున్నారు. ఆదాయాన్ని నలుగురూ సమానంగా పంచుకుంటారు. అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ పెండ్లికి 150 సంచులు ప్రత్యేకంగా అందించిందామె. ఈ పర్యావరణ ప్రియమైన సంచులు కావాలనుకునేవారు 7396336015 నంబరులో సంప్రదించవచ్చు.