కుటుంబం, బంధువులు అనుకూలంగా లేకపోయినా ధైర్యంగా నిలబడి నటిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటి నవీన. బుల్లితెరపై రాణించి తెలుగునాట ప్రతి ఇంటికీ పరిచయం అయ్యారామె. వెండితెరపైనా రాణించాలని ఆశిస్తున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ఉమ్మడి కుటుంబం’ సీరియల్లో బాధ్యతగల పెద్ద కోడలు లీలావతి పాత్రతో అలరిస్తున్న నవీన అలియాస్ మెహబూబ్ చాంద్ జిందగీతో పంచుకున్న కబుర్లు..
కెరీర్ ఆరంభం నుంచీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నటిగా ఎదిగే క్రమంలో కుటుంబం, బంధువులు అందరినుంచీ వ్యతిరేకత ఎదుర్కొన్నా. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల వల్ల దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నా. గ్యాప్ తర్వాత కూడా నన్ను పిలిచి వరుస అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా జీవితంలో ఎదురైన సమస్యలన్నిటినీ ఎదుర్కొనే ధైర్యం ఇచ్చిన ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
నా అసలు పేరు మెహబూబ్ చాంద్. ఇండస్ట్రీ నాకు పెట్టిన పేరు నవీన. మాది రాయలసీమ. కడపలో పుట్టి పెరిగాను. మెరిట్ స్టూడెంట్ అన్న పేరుండేది. బాగా చదువుకుని లాయర్ కావాలనుకున్నా. చదువుకునే రోజుల్లోనే నటన అంటే ఆసక్తి ఉండేది. అయితే, నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకోడానికి నటనను మార్గంగా ఎంచుకున్నాను. నటిగా ఎదగడానికి చాలా కష్టపడ్డాను. కడుపునిండా తిండి కూడా లేని పరిస్థితుల్ని అనుభవించాను. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది. ఇప్పట్లోలా అప్పుడిన్ని అవకాశాలు ఉండేవికావు. ఓ డ్రామా కంపెనీలో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఒకరోజు ఒక అమ్మాయి రాకపోవడంతో ఆమె స్థానంలో నన్ను తీసుకున్నారు. అలా నటనా రంగంలో నా తొలి అడుగుపడింది. చాలాకాలం డ్రామా ఆర్టిస్ట్‌గా పనిచేశాను. నంది నాటకాలకు వచ్చిన జడ్జిలు నా ఫొటో తీసుకున్నారు. రెండేళ్లయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో నా ఫొటోలు ఇచ్చేయమని అడిగా. నా తెలియనితనం చూసి నవ్వుకుని నాకు ఒక సీరియల్లో అవకాశం ఇచ్చారు. ‘పితృదేవోభవ’ సీరియల్లో డాక్టర్‌గా మొదటిసారి బుల్లితెర మీద కనిపించా. తర్వాత చాలా చానెల్స్‌లో సీరియల్స్ చేశాను.
జీ తెలుగులో చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్లో చేసిన సుమంగళి పాత్రకి వరుసగా మూడేండ్లు అవార్డు అందుకున్నా. ఆ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘గువ్వా గోరింక’, ‘మేఘమాల’, ‘జాబిలమ్మ’, ‘ఆడపిల్ల’, ‘సూర్యపుత్రుడు’, ‘చెల్లెలి కాపురం’, ‘వదినమ్మ’, ‘పద్మవ్యూహం’, ‘కోయిలమ్మ’.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌లో మంచి పాత్రలు పోషించాను. నేను ఉంటే సీరియల్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ కూడా వచ్చింది. జీ తెలుగులో నా మొదటి సీరియల్ ‘బృందావనం’. ఇప్పుడు ‘ఉమ్మడి కుటుంబం’ చేస్తున్నా. దీంతోపాటు మరో చానెల్లో ‘రాధామనోహరం’లో నటిస్తున్నా.
సినిమాల్లో చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. రెండు మూడు సినిమాల్లో కూడా నటించా. కోవై సరళ గారిలా ఒక మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. అయితే, దాదాపు ఖరారైన పాత్రలు కూడా కొందరివల్ల చేజారిపోయాయి. దర్శక, నిర్మాతలు ఒక ఆర్టిస్ట్ అవసరముంటే స్వయంగా పిలిచి మాట్లాడితే బాగుంటుంది. మధ్యలో ఉండే మేనేజర్ల మాట వినడం వల్ల నాలాంటి వాళ్లు చాలా అవకాశాలు కోల్పోతున్నారు. వెండితెర మీద మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా.
– హరిణి