ఈ వ్యవస్థలో న్యాయం కావాలంటే ఏండ్లకేండ్లూ ఎదురుచూడాలి. ఆస్తులు కరగదీసుకోవాలి. ఇన్ని చేసినా.. కోర్టులో వ్యవహారాలు అర్థం కావు. తమ కేసులో లోపం ఎక్కడుందో, గెలిచే పాయింట్ ఏదుందో తెలియరాదు. న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న వారికి అండగా నిలిచాడో కుర్రాడు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఒక్క రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తూ నల్లకోటు విలువ పెంచుతున్నాడు తెలంగాణ బిడ్డ కందిక ఆదర్శ్. చదువులో, ఆటలో అదుర్స్ అనిపించుకున్న ఈ 26 ఏండ్ల యువకుడు సామాజిక సేవలోనూ ముందున్నాడు. రూపాయికే న్యాయ సలహాలు అందిస్తున్న యాప్ గురించి తన అనుభవాలను ‘బతుకమ్మ’తో పంచుకున్నాడు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మొదలైన రాష్ర్టాల నుంచి ఇప్పటివరకు 10,000 మందికిపైగా న్యాయ సలహాల కోసం మా యాప్‌ను సంప్రదించారు. దేశవ్యాప్తంగా 120 మంది న్యాయవాదులు యాప్ ద్వారా బాధితులకు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి అడిగినా వివరణ ఇస్తున్నారు.
నా పేరు కందిక ఆదర్శ్. మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూర్ గ్రామం. నా బాల్యమంతా ఆ ఊళ్లోనే గడిచింది. డిగ్రీ చదివేందుకు హైదరాబాద్‌కు వచ్చాను. చిన్నప్పటి నుంచి బాగా చదివేవాణ్ని. కొత్త విషయాలు తెలుసుకునేందుకు నిత్యం పరితపించేవాణ్ని. అందులో భాగంగానే ఒకేసారి రెండు డిగ్రీలు చేశాను. ఒకటి రెగ్యులర్‌గా.. రెండోది దూరవిద్య కేంద్రం ద్వారా పూర్తిచేశాను. నాకు చదువు, క్రీడలు రెండు కళ్లలాంటివి. చదువుతో పాటు ఉడ్బాల్ (పోలో తరహా క్రీడ) ఆడటం అంటే ఎంతో ఇష్టం. చదువులో నాలుగు డిగ్రీ పట్టాలు సాధించగా, ఉడ్బాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ఆడాను.
డిగ్రీ తర్వాత లా చేయాలనే ఆలోచనతో ఎంట్రెన్స్ రాసి రంగారెడ్డి జిల్లాలోని మహాత్మా గాంధీ లా కాలేజ్‌లో సీట్ సాధించాను. కళాశాలలో చేరిన మొదటిరోజు నుంచే నల్లకోటు వేసుకొని సమాజాన్ని ఏ విధంగా మార్చాలనే ఆలోచనలు మొదలుపెట్టాను. మొదటి సంవత్సరం అందరిలానే ఆలోచించినా రెండో ఏడాదిలో మాత్రం లాయర్‌గా పేద ప్రజలకు ఉచితంగా న్యాయం అందించాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనను బలపరిచిన నా మిత్రులు వెబ్సైట్ రూపకల్పనలో ఎంతో సహకరించారు.
సామాన్యుడికి ఉచిత న్యాయం అనే కాన్సెప్ట్‌తో ఎలాంటి ఖర్చులేకుండా సీఎల్ఎన్ఎస్.ఇన్ (CLNS.IN) వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. మంచి స్పందన వచ్చింది. దీంతో యాప్ రూపకల్పనకు పూనుకున్నాను. రెండేండ్లు కష్టపడి టీ హబ్ సహకారంతో సెంట్రలైజ్డ్ లీగల్ నెట్వర్క్ సొల్యూషన్స్ (CLNS) యాప్‌ను రూపొందించాను. ఈ ఏడాది మే నెలలో ప్రారంభించాను. ఈ యాప్‌లో సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా… ఫైండ్ ఏ లాయర్, టాక్ టూ అఫీషియల్, అవర్ సర్వీసెస్ లాంటి ఆప్షన్లు ఏర్పాటు చేశాను.
విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలు, అధికారులను సైతం ఒకే వేదిక మీదికి తీసుకొచ్చే సాంకేతికతను రూపొందించాను. కేవలం ఒక్క రూపాయికే న్యాయ సేవలందించడం ఈ యాప్ ప్రత్యేకత. దేశంలోని పదకొండు రాష్ర్టాల్లో ఈ యాప్ కార్యకలాపాలు సాగుతుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ మొదలైన రాష్ర్టాల నుంచి ఇప్పటివరకు 10,000 మందికిపైగా న్యాయ సలహాల కోసం మా యాప్‌ను సంప్రదించారు.
దేశవ్యాప్తంగా 120 మంది న్యాయవాదులు యాప్ ద్వారా బాధితులకు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. కేసు తీవ్రతను బట్టి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి అడిగినా వివరణ ఇస్తున్నారు. మా యాప్ లాంచ్ చేసిన తొలినాళ్లలో విజయవాడ నుంచి 50 ఏండ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని టీ హబ్‌కు వచ్చి మరీ మేము రూపొందించిన యాప్ తనకెంతగానో ఉపయోగపడిందని చెప్పారు. ఆయన మాటలు జన్మలో మర్చిపోలేను. నా స్నేహితులు, మా నాన్న సహకారం లేకుంటే ఈ యాప్ ఇంత త్వరగా అందుబాటులోకి వచ్చేది కాదు.
నాకు క్రీడలంటే ఎంతో ఇష్టం. ఉడ్బాల్లో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయిలో, మూడుసార్లు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచాను. 2019లో జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్న అత్యంత పిన్నవయస్కుడిగా అవార్డు అందుకున్నాను. యాప్ రూపకల్పనతోపాటు ఇతర సామాజిక సేవాకార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ లాంటి వాటిపై పరిశోధనా కథనాలు రాసినందుకు గాను 2019లోనే ఐక్యరాజ్యసమితి అందించే ‘కరమ్ వీర చక్ర’ పురస్కారం అందుకున్నాను. దాని తరువాత నేషనల్ యూత్ ఐకాన్ అవార్డును సైతం పొందాను. CLNS యాప్‌ను దేశంలోని న్యాయ స్థానాలతో అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాను. మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. న్యాయం కోసం ఎదురుచూసే వారికి నేను రూపొందించిన యాప్ వారధిలా నిలిస్తే.. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు.
– రాజు పిల్లనగోయిన