ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 05 : గణేష్ నిమజ్జన వేడుకలకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు ఎదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట వద్ద మున్నేరు సమీపంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన వేడుకల ఘాట్‌ను, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆర్ అండ్ బి డీఈ చంద్రశేఖర్, రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్ తో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నుంచి గణనాథులు నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే మున్నేరు ఘాట్‌కు ఇన్, ఔట్ రోడ్లను క్లియర్ చేసినట్లు తెలిపారు. నిమజ్జన వేడుకలు మొత్తం సీసీ కెమెరాల నిఘా మధ్యలో కొనసాగనున్నట్లు చెప్పారు.
మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 60 మంది సిబ్బంది, 15 మంది అధికారులు సేవలు అందించడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ పుర ప్రముఖులు, ప్రజలు నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక శామ్యానాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 32 మంది గజ ఈతగాళ్లు, 14 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటికే ఘాట్ వద్ద మూడు క్రేన్లు, ఒక జేసీబీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాత్రి వేళలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు భారీ లైటింగ్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పుష్కరాజ్ మాట్లాడుతూ.. ఊరేగింపు ఎలాంటి అపసృతలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు సహకరించి శోభయాత్ర విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ అధికారులు శ్రీధర్ రెడ్డి, మణి కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Khammam Rural : గణేష్ నిమజ్జన వేడుకలకు సర్వం సిద్ధం : మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి