ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం అవసరం. కానీ, ఆహార వ్యవహారాలను మారిన జీవనశైలి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రాసెస్డ్ జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. దీంతో వయసుతో సంబంధం లేకుండా బీపీ, డయాబెటిస్ కొని తెచ్చుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆరోగ్యకరమైన ఆహారం మీ కోసం’ అని ముందుకొచ్చింది పలక్ అరోరా. ‘మిల్లియమ్’ బ్రాండ్ పేరిట రెడీ టు కుక్ మిల్లెట్ మిక్స్‌తో ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్న 26 ఏండ్ల పలక్ అరోరా కథ ఇది..
మిల్లెట్ పంటలు ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. అలాగే వరి, గోధుమలకు కావాల్సినంత నీళ్లు ఈ చిరుధాన్యాల సాగుకు అవసరం లేదు. వీటివల్ల మట్టి కూడా సారవంతం అవుతుంది. అలాగే అందరికీ ఆరోగ్యం అనే కాన్సెప్ట్ నాది. వ్యవసాయ క్షేత్రం నుంచి కిచెన్ వరకు అన్ని దశల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని ప్రారంభించాను.
హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పలక్ వాళ్లింటి టెర్రస్‌పై రకరకాల చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నది. ‘మిల్లియం’ ఫుడ్ బ్రాండ్‌తో నేటితరానికి సంప్రదాయ చిరుధాన్యాలను పరిచయం చేస్తున్నది. స్థానిక రైతుల నుంచి చిరుధాన్యాలు కొనుగోలు చేసి.. రకరకాల వెరైటీలు అందిస్తున్నది. ఈ మిల్లెట్ మిక్స్‌లు బిజీబిజీగా ఆఫీసులకు పరిగెత్తేవాళ్లకు రెడీమేడ్‌గా రుచితోపాటు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తున్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్ అండ్ మేనేజ్మెంట్లో ఫుడ్ ఇంజినీరింగ్ చేసింది పలక్. ఆమె మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై పరిశోధన ప్రారంభించింది. ఆ సమయంలోనే పలక్ తండ్రికి మూత్రపిండాల సమస్య వచ్చింది. దానికి కారణం ఆయన దీర్ఘకాలంగా పోషకాహారం తీసుకోకపోవడమే అని డాక్టర్లు చెప్పారు. దాంతో తన కుటుంబానికి ఆరోగ్యకర ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఈ చిరుధాన్యాల వైపు అడుగులు వేసిందామె.
‘మా నాన్న అనారోగ్యానికి గురైనప్పుడు మా కుటుంబమంతా ఒక్కసారిగా కుంగిపోయింది. ఫుడ్ ఇంజినీరింగ్ చేస్తున్న నాకు ఆహారమే మహాభాగ్యమని తెలిసినా, ఇంటి ఆహారాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. కానీ, డాక్టర్లు మేము తినే ఆహారంలో పోషకాలు లేవన్నప్పుడు, నేను మన ముందు తరాల వాళ్లు తీసుకునే ఆహారం గురించి ఆరా తీశాను. వారి ప్రధాన ఆహారం చిరుధాన్యాలే అని తెలిసింది. దాంతో మా కుటుంబ ఆరోగ్యంతో పాటు నలుగురికీ ఈ ఆహారం అందించాలనుకున్నాను. అలా మొదలైందే మా ‘మిల్లియం’ బ్రాండ్. స్థానికంగా చిరుధాన్యాలు పండించే రైతులను సంప్రదించాను. వారి నుంచి మేలు రకం ధాన్యం కొనుగోలు చేస్తున్నాను. దీనిద్వారా వాళ్లకూ మంచి గిట్టుబాటు దక్కుతున్నది. నాకూ నాణ్యమైన ధాన్యం లభిస్తున్నది. అంతేకాదు, నాకు ఆంత్రప్రెన్యూర్ అవ్వాలన్నది ఎంత ఇష్టమో.. నలుగురికి ఉపాధి కల్పించడమూ అంతే ఆనందం. ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్ కోసం కొందరిని తీసుకున్నాం. వారంతా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చింది పలక్.
కరోనా లాక్డౌన్ సమయంలో పలక్ ఈ ఫుడ్ ప్రయోగాలు ప్రారంభించింది. కేవలం సోలార్ డ్రైయర్స్, బ్లెండర్స్తో చిరుధాన్యాలను శుభ్రం చేసి పొడి చేసేది. ఇలా పొడులైతే ఉద్యోగులకు త్వరగా వండుకునే అవకాశం ఉంటుందని పలక్ ఉద్దేశం. అప్పుడే ఆమె ప్రభుత్వరంగ సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొంది, పూర్తిస్థాయి ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. గోధుమ పిండిని ప్రజలు ఎలా విరివిగా వాడుతున్నారో, ఈ చిరుధాన్యాల మిక్స్‌లను కూడా అలాగే వాడాలన్నది తన లక్ష్యం అంటుంది పలక్.
ప్రయోగాల పేరిట కుస్తీ పడుతున్న కూతురుని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఈ ఫుడ్ ప్రొడక్ట్ తయారీలో తన తల్లి ఎంతో సహకరిస్తుందని పలక్ చెప్పుకొచ్చింది. రుచి చూడడం, పరిమాణాల్లో మార్పులు చెప్పడం వంటివి ఆవిడే చెప్పేవారట. అలా ఆర్థికంగా, ఎమోషనల్‌గా ఫ్యామిలీ ఎంతగానో సపోర్ట్‌గా నిలిచిందంటుంది పలక్. ‘మిల్లియం’ బ్రాండ్ మొదటి ప్రొడక్ట్ రెడీ ఫర్ కుక్ పోరిడ్జ్. తర్వాత వెజిటేబుల్ మిక్స్ ఇడ్లీ పిండి, పంజాబీ ైస్టెల్ చీలా పొడి ఇలా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నది. 2021 సెప్టెంబర్‌లో పలక్ తన కంపెనీని రిజిస్టర్ చేయించింది. తర్వాత 2022 జూన్‌లో మిల్లియం బ్రాండ్‌ను లాంచ్ చేసింది.
ఒకప్పుడు టెర్రస్‌నే కిచెన్‌గా మార్చుకున్న పలక్ ఇప్పుడు ఫరీదాబాద్‌లో భారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించింది. నెలకు ఎనిమిది టన్నుల ‘రెడీ టు కుక్’, 21 టన్నుల ‘రెడీ టు ఈట్ మిల్లెట్ ప్రొడక్ట్స్’ ఉత్పత్తి చేస్తున్నది. అందులో రాగి సూప్, మిల్లెట్ నూడుల్స్, పాస్తా, మిల్లెట్ పోహా, పాన్ కేక్ మిక్స్ ఇలా 15 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. అందుబాటు ధరల్లోనే విక్రయిస్తున్నది. అలాగే తన ఉత్పత్తులను హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులకు అందిస్తూనే, దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటున్నది. ‘హెల్దీ బీ జల్దీ బీ’ అనే ట్యాగ్‌లైన్‌తో విపణిలోకి ప్రవేశించిన పలక్కు ఆదిలో ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడింది. ఇప్పుడు నెలకు లక్షల్లో టర్నోవర్ సాధిస్తూ.. వినియోగదారులకు రెడీమేడ్ ఆరోగ్యాన్ని అందిస్తున్నది.