Mouth Ulcers | నోట్లో పుండ్లు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇవి కొందరికి పెదవులపై వస్తే కొందరికి లోపలి వైపు వస్తాయి. కొందరికి నోట్లో నాలుకపై, నాలుక చుట్టూ లేదా కింద భాగంలో కూడా వస్తాయి. కొందరికి చిగుళ్ల వాపులు కూడా వస్తాయి. రక్తస్రావం కూడా జరుగుతుంది. ఏం తినాలన్నా, తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే నోట్లో పుండ్లు అనేవి అనేక కారణాల వల్ల వస్తుంటాయి. బాగా వేడిగా ఉన్న ఆహారాలను తిన్నప్పుడు లేదా తాగినప్పుడు నోట్లో పుండ్లు ఏర్పడుతాయి.అలాగే టూత్ బ్రష్‌ను బలంగా వాడినా, పడని టూత్ పేస్ట్‌ను వాడినా, పోషకాహార లోపం ఉన్నా, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉన్నా, హార్మోన్ సమస్యల కారణంగా, పలు రకాల మందులను వాడడం వల్ల కూడా నోట్లో పుండ్లు ఏర్పడుతాయి. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోట్లో ఉన్న పుండ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. ఉప్పు నీటిలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. దీంతో నోట్లోని పుండ్లు నయమవుతాయి. 1 టీస్పూన్ ఉప్పును ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి ఆ నీళ్లను నోట్లో పోసుకుని 30 సెకన్ల నుంచి 1 నిమిషం పాటు బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. తేనెలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో పుండ్లను తగ్గిస్తాయి. నోట్లో ఉండే నొప్పి నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. తేనెను కొద్దిగా తీసుకుని నోట్లో పుండ్లు ఉన్న చోట నేరుగా రాయవచ్చు. ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తుండాలి. దీంతో నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి.
నోట్లోని పుండ్లను తగ్గించేందుకు కొబ్బరినూనె కూడా పనిచేస్తుంది. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల నోట్లో ఉండే వాపులను తగ్గిస్తుంది. నోరు, నాలుకకు సంరక్షణ పొరగా నిలుస్తుంది. నోటి అల్సర్లను తగ్గిస్తుంది. కొద్దిగా కొబ్బరినూనెను తీసుకుని నోట్లో పుండ్లు ఉన్న చోట నేరుగా రాయాలి. రోజులో ఇలా మీకు వీలున్నన్ని సార్లు చేయాలి. దీంతో పుండ్లు తగ్గిపోతాయి. ఈ పుండ్లను తగ్గించేందుకు బేకింగ్ సోడాపేస్ట్ కూడా పనిచేస్తుంది. బేకింగ్ సోడా వల్ల నోట్లో అధికంగా ఉండే యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి. ఇందుకు గాను కొద్ది మొత్తంలో బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని చుక్కల నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని నోట్లో ఉండే పుండ్లపై రాయాలి. కాసేపు అయ్యాక నోట్లో నీళ్లు పోసుకుని కడిగేయాలి. ఇలా రోజూ చేస్తున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది.
కలబంద గుజ్జులో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఏర్పడే అల్సర్లను తగ్గిస్తాయి. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని నోట్లో అల్సర్లపై నేరుగా రాయాలి. కాసేపు అయ్యాక నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేయాలి. దీని వల్ల నోట్లో ఉండే నొప్పి, అల్సర్లు తగ్గిపోతాయి. సాధారణంగా ఇలాంటి చిట్కాలను పాటిస్తే 3 లేదా 4 రోజుల్లో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కానీ వారం రోజులు దాటినా కూడా ఈ సమస్య తగ్గడం లేదంటే అప్పుడు చాలా బలమైన కారణం ఉండి ఉంటుందని అర్థం చేసుకోవాలి. దీనికి గాను డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వారు అన్ని విధాలుగా పరిశీలించి సమస్యను గుర్తించి అందుకు తగిన విధంగా చికిత్సను అందిస్తారు. దీంతో నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి.