లేబర్ రూమ్‌లో క్యార్మనే ఏడుపు వినిపించగానే ఆడా? మగా? తెలుసుకునేందుకు రక్తసంబంధీకుల్లానే ఓ నర్స్ కూడా ఎదురుచూస్తుంది. ఆడబిడ్డ పుట్టిందనే మాట వినిపించగానే పరుగు పరుగున వార్డులో హడావిడి చేస్తుంది. రంగురంగుల బెలూన్లతో వార్డంతా అలంకరిస్తుంది. కేకు తెచ్చి ఆ తల్లితో కట్ చేయిస్తుంది. అందరి నోళ్లు తీపి చేయడానికి చాక్లెట్లు తెస్తుంది. ఇది ఆ హాస్పిటల్ స్పెషల్. అంతేకాదు ఆడపిల్ల పుడితే డెలివరీ చార్జీలు, మందులు కూడా ఫ్రీగా ఇస్తాడు డాక్టర్ గణేశ్ రఖ్. అమ్మాయి పుట్టుక భారం కారాదని చెప్పే ఆ డాక్టర్ ఆడబిడ్డకు ప్రాణం పోస్తూ అమ్మని బతికిస్తున్నాడు!
పద్నాలుగేండ్ల క్రితం.. ఆనాటి జనాభా లెక్కల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 914 మంది అమ్మాయిలున్నారు. ఈ లెక్కలు చూశాక పూణెలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ గణేశ్‌కు గుండె ఆగినంత పనైంది. ఆ లెక్కన పుట్టకుండానే చనిపోతున్న ఆడపిల్లలు ఎంతమందో ఆయనకు అర్థమైంది. ప్రాణం పోయాల్సిన దవాఖానాల్లో నిశ్శబ్దంగా జరిగిపోతున్న దారుణాలు ఆయన్ని కలవరపెట్టాయి. ఆ జనాభా లెక్కలు చూసి ‘ఆడపిల్లను పుట్టనివ్వండి’ అని అందరిలా అనుకుని ఆగిపోకుండా, పుట్టే ఆడపిల్లకు అండగా నిలబడాలనుకున్నాడు గణేశ్. కుటుంబాలను సంసిద్ధం చేయకుండా ఆడపిల్లను కాపాడుకోలేమని ముల్గి వచ్వా అభియాన్ (ఆడపిల్లను కాపాడుకుందాం) అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించాడు.
దవాఖానలో మగబిడ్డ పుడితే వార్డులో పండుగలా ఉంటుంది. పసివాడిని చూసేందుకు బంధువులు పొలోమంటూ వస్తారు. మిఠాయిలు పంచుకుంటారు. వారసుణ్ని అందించిన ఆమెపై ఎనలేని అభిమానం కురిపిస్తారు. తల్లీబిడ్డలు ఇంటికి వచ్చే రోజు కోసం ఊళ్లో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆ సందడి, హడావిడి చూస్తూ కొందరు తల్లులు ‘నాకూ మగబిడ్డ పుడితే బాగు. ఇలాంటి సంతోషం దక్కేది. ఏ పాపం చేసుకున్నానో’ అంటూ దిగులు పడుతుంటుంది. ఇంట్లో వాళ్ల ఛీత్కారాలు భరిస్తూ, మనసులో దిగులును మోస్తూ, భుజాన భారంగా భావించే బిడ్డను మోస్తూ ఏ హడావుడీ లేకుండా ఇల్లు చేరుకుంటుంది ఆడపిల్లను కన్న తల్లి. ఏ పుణ్యం చేసుకుందో ఈ పసికందు ఇల్లయినా చేరుకుంది. తనలా కన్నుతెరిచి తల్లిని చూడకుండానే, నేలపై కాలుమోపకుండానే లోకాన్ని వీడిపోతున్న శిశువులు ఎందరో!
ప్రసూతి వైద్యశాలలన్నిటా వినిపించే, కనిపించే కథలివే! పూణెలో ప్రసూతి వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ గణేశ్ ఈ దుస్థితి నుంచి ఆడపిల్లల్ని కాపాడాలనుకున్నాడు. ఓ రోజు తన దవాఖానలో ఆడబిడ్డ పుట్టింది. ఆ సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచి ‘గర్ల్ చైల్డ్ బర్త్ సెలబ్రేషన్’ నిర్వహించాడు. ఇలా ‘ముల్గి వచ్వా అభియాన్’ కార్యక్రమం మొదలుపెట్టాడు. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉండాలని ఆడబిడ్డ పుడితే డెలివరీ చార్జీలు తీసుకోవడం మానేశాడు. అంతేకాదు పుట్టిన ఆ ఆడబిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని ఉచితంగా టీకాలు వేసే బాధ్యతా తీసుకున్నాడు. ఆ పేదబిడ్డ తల్లికి భారం కారాదని తనకు ఏ రోగం వచ్చినా ఉచితంగా వైద్యం చేస్తానని హామీ ఇచ్చాడు. చెప్పినట్టే ఆచరిస్తున్నాడు.
పదమూడేళ్ల క్రితం… పూణెలోని అదప్సార ప్రాంతంలో డాక్టర్ గణేశ్ రఖ్ పనిచేస్తున్న మెడికేర్ హాస్పిటల్లో మొదలైన ‘గర్ల్ చైల్డ్ బర్త్ సెలబ్రేషన్’ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ దవాఖానలో ఆధునిక ప్రసూతి వైద్యంతోపాటు మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా ఆడపిల్లకు ఎక్కడాలేని మద్దతు ఉంది. అందుకే పేద తల్లులు కడుపులోని బిడ్డ భారం అనుకోకుండా డాక్టర్ గణేశ్ దగ్గరికి వస్తున్నారు. ముల్గి వచ్వా అభియాన్ ప్రారంభించిన తొలి ఏడాదిలో మూడు వందల మందికి ఉచితంగా పురుడు పోశాడు.
ఉన్నత లక్ష్యంతో అడుగేసిన డాక్టర్ గణేశ్‌ను ఎన్నో అవరోధాలు పలకరించాయి. ఆయన నిర్ణయంపై ఇంట్లోనే వ్యతిరేకత వచ్చింది. తను పనిచేస్తున్న హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రసవానికి ఫీజు మినహాయింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించింది. ఒక ప్రసవానికి పాతిక వేల నుంచి యాబై వేల రూపాయల వరకు నష్టపోవాల్సి వస్తున్నదని లెక్కగట్టి చెప్పింది. అంతమొత్తాన్ని వదులుకోవాల్సి రావడం ఆర్థికంగా పెద్ద త్యాగమే. ఎవరెన్ని చెప్పినా డాక్టర్ గణేశ్ ఆలోచన మారలేదు. డబ్బు సంపాదించడం కన్నా.. ఆడపిల్లకు అండగా నిలవడమే ముఖ్యం అనుకున్నాడు. ఇప్పటి వరకు రెండు వేల మందికిపైగా ఆడపిల్లల తల్లులకు ఉచితంగా పురుడుపోశాడు.
అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువగా ఉంటున్నారంటే లింగ నిర్ధారణ తర్వాత జరుగుతున్న ‘అబార్షన్లు’ అనే హత్యల ఫలితమేనని డాక్టర్ గణేశ్ బలంగా నమ్మాడు. వైద్య పరీక్షల కోసం వచ్చిన ప్రతి గర్భిణికీ ఆడపిల్ల గురించి అవగాహన కల్పించడం విధిగా పెట్టుకున్నాడు. కూతురు భారమని, పెంపకం శిక్షగా భావించే కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాడు. నేటి సమాజంలో అమ్మాయిలకు ఉన్న విద్య, ఉపాధి అవకాశాల గురించి విడమర్చి చెబుతూ.. ఆడపిల్ల పుట్టుకను వేడుకగా మార్చేస్తున్నాడు.
ఆయన ప్రయత్నాలు ఫలించి ఎంతోమంది ఆలోచనలూ మారాయి. డాక్టర్ గణేశ్ సేవాభావం స్థానికులనే కాదు సుదూర ప్రాంతాల ప్రజలనూ ఆకర్షించింది. ఆయన కృషి తెలిసిన వాళ్లు అభినందించడమే కాదు తనలా పనిచేసేందుకు ఆసక్తి కనబరిచారు. లింగ సమానత్వం కోసం వైద్యులు చేయాల్సిన కృషి ఇలా ఉండాలనే అభిప్రాయం కలిగించాడు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, కెనడా మొదలైన దేశాల్లో పదమూడు వేల సంస్థలు, రెండున్నర మిలియన్ల మంది స్వచ్ఛంద కార్యకర్తలు డాక్టర్ గణేశ్లాగే పనిచేయాలని ముందుకు వచ్చారు. ముల్గి వచ్వా అభియాన్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగుతున్నారు.
తొలినాళ్లలో డాక్టర్ గణేశ్‌ను విభేదించిన కుటుంబం ఇప్పుడు ఆయనకు మద్దతుగా పనిచేస్తున్నది. మెడికేర్ హాస్పిటల్ నిర్వహణ బాధ్యతల్ని డాక్టర్ గణేశ్ భార్య, బిడ్డ చూసుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాలను భార్య తృప్తి చక్కదిద్దుతుంటే, నిర్వహణను కుమార్తె తనీషా పర్యవేక్షిస్తున్నది. ఈ హాస్పిటల్లో పుట్టిన ప్రతిబిడ్డనూ సొంత కూతురిలా భావిస్తానని డాక్టర్ గణేశ్ అంటున్నాడు. మా కుటుంబసభ్యురాలిని ప్రేమగా ఆదరిస్తామని ఆయన భార్య, బిడ్డ చెబుతున్నారు.
ఎవరైనా చనిపోతే, ప్రాణం పోయిందని కుటుంబసభ్యులకు చెప్పడానికి మనసు సంకోచించినట్టే ఆడపిల్ల పుట్టిందని చెప్పడానికీ మొహమాటపడిన రోజులు నాకు తెలుసు. బిడ్డ పుట్టిందని తెలిసి కొన్నిసార్లు తల్లే బోరున ఏడ్చిన సన్నివేశాలు చూశాను. ఆడబిడ్డకు జన్మనిచ్చిందని భార్య ముఖం చూడకుండా వెళ్లిపోయిన ప్రబుద్ధులనూ చూశాను. అదే మగబిడ్డ జన్మించాడని తెలిస్తే.. అందరి ముఖాల్లో సంతోషం కనిపించేది. ఈ సంఘటనలే నన్ను ఆలోచింపజేశాయి. ఆడపిల్ల పట్ల వివక్ష పోయేరోజు రావాలని కోరుకున్నాను. ఆనాటి నుంచి ఆడపిల్ల పుడితే పండుగ చేయడం, ఫీజు తీసుకోకుండా పురుడుపోయడం, ఆ బిడ్డను బతికించడం కోసం ఉచితంగా వైద్య సేవలు చేయడం మొదలుపెట్టాను.
– డాక్టర్ గణేశ్ రఖ్