రాజాపేట, సెప్టెంబర్ 05 : భారీ వర్షాలతో పంట, ప్రాణ నష్టం జరిగితే బాధితులను పరామర్శించి పరిహారం ఇవ్వాలన్న సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాణ, పంట నష్టం జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించక పోవడం విచారకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వర్షాలకు నష్టం జరిగితే రేవంత్ రెడ్డి, ఆయన ప్రియమైన అక్క సీతక్క ఇద్దరు కలిసి వరద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలని గొంతు చించుకున్నారు కదా, మరి మీ ప్రభుత్వ పాలనలో ఇవ్వాలనే సోయి లేదా అని ఆమె ప్రశ్నించారు. మీరు ప్రభుత్వంలో ఉంటే ఒక తీరు, మరొకరు ఉంటే వేరే తీరా ఇదెక్కడి న్యాయమన్నారు.
వర్షాలకు ఒక ఊరికి రోడ్డు తెగి పోయిందని, మరో ఊరికి నిత్యవసర సరుకులు అందడం లేదని సీతక్క ముల్లెలు, మూటలు నెత్తిన పెట్టుకుని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసుకున్నారు కదా, అపార నష్టం జరిగి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని.. మరి ఆ సోయి ఇప్పుడు ఎటు పోయిందన్నారు. మంత్రి పదవి రాగానే అహంకారం వచ్చిందా అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో వెళ్లలేని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి కుంటి సాకులు చెప్పారు కదా, మరి వరద బాధితులపై ప్రేమ ఉంటే హెలికాప్టర్లో ఎక్కడి వరకు వెళ్లారు, అక్కడి నుంచి కారులో వెళ్లి భరోసా కల్పించకపోవడం మీ అహంకార ధోరణికి నిదర్శనం అన్నారు. వర్షం వల్ల ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ.25 లక్షలు, పంటలకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.