ఆమె పేరు కాకులమర్రి శ్రీలత. నిన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియదు. కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన సర్పంచ్‌గా రికార్డు సృష్టించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్ర గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా విజయ దుందుభి మోగించారు. తన భర్త కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు (ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ
అధ్యక్షుడు) ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు. కేసీఆర్ స్ఫూర్తితోఅభివృద్ధిలో ముందుకు వెళ్తానంటున్న శ్రీలత జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది కరీంనగర్ జిల్లా గోపాల్పూర్. నాన్న పేరు బోయినపల్లి కిషన్‌రావు, అమ్మ సత్యాదేవి. నలుగురు అక్కాచెల్లెళ్లలో నేను చిన్నదాన్ని. మా సోదరుడు యూఎస్‌లో ఉంటున్నాడు. నాన్న తూనికలు కొలతల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసి రిటైరయ్యారు. స్కూలింగ్, ఇంటర్ నిజామాబాద్‌లో సాగింది. డిగ్రీ (బీఎస్సీ) మైక్రోబయోలజీ హైదరాబాద్‌లో చేశాను. చదువు పూర్తికాగానే 2001లో కాకులమర్రి లక్ష్మీనర్సింహారావుతో నా పెండ్లి జరిగింది. మాకు ఇద్దరు అబ్బాయిలు.
పెద్దోడు క్రికెట్ ప్లేయర్. చిన్నోడు ఇంటర్ చదువుతున్నాడు. మా నాన్న తరఫు ఎవరూ రాజకీయాల్లో లేరు. కానీ, మా తాతయ్య సర్పంచ్‌గా చేశారు. పెద్ద మామయ్య మంత్రిగా, చిన్నమామయ్య సర్పంచ్‌గా చేశారు. మా ఆయన ములుగు జిల్లా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలో మొదట్నుంచీ యాక్టివ్ పొలిటీషియన్. నా రాజకీయ రంగప్రవేశం అనుకోకుండా జరిగింది. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం రావడంతో.. మా ఊరికి మేలు చేయాలనే లక్ష్యంతో నేనూ ముందుకొచ్చాను.

సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజల ప్రేమ, ఆప్యాయత చూసి ఆశ్చర్యపోయాను. వారి ఆదరణ చూసినప్పుడు మంచి మెజారిటీ వస్తుందని ఊహించాను. అనుకున్నట్టే.. రికార్డు మెజారిటీ రావడం సంతోషంగా ఉంది. సమ్మక్క తల్లి ఆశీర్వాదంతో గెలిచాను. ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. రాష్ట్రమంతా మా ఊరువైపు చూసే విధంగా నాకు గెలుపు కట్టబెట్టిన ప్రజలకు ఎంత చేసినా తక్కువే. గ్రామాభివృద్ధికి నిరంతరం పాటుపడతాను. కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ నీళ్లు చక్కగా వచ్చేవి. ఇప్పుడు సవ్యంగా రావడం లేదు. ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వారి సమస్యను పరిష్కరిస్తాను.
మా గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచడానికి ప్రయత్నిస్తాను. మా తాతయ్య, మామయ్యలు, నా భర్త అందరూ ప్రజాజీవితంలో ఉన్నవారే. ప్రజల కోసం పరిశ్రమించినవారే! వారిని ఆదర్శంగా తీసుకొని, వారి పేరు నిలబెట్టేలా పనిచేస్తా. మా పిల్లల ప్రోత్సాహం కూడా నేను సర్పంచ్‌గా పోటీ చేయడానికి కారణమైంది. నన్ను ఇంతగా ఆదరించిన ఏటూరునాగారం ప్రజల రుణం తీర్చుకుంటా. నన్ను గెలిపించిన ప్రజలను అన్నిటా గెలిపించాలన్నదే నా లక్ష్యం.
ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. సర్పంచ్ అంటే మురుగు కాల్వల నిర్వహణ, కరెంట్ సమస్యల పరిష్కారానికే పరిమితం అనుకుంటారు. మా గ్రామ ప్రజల జీవితాల్లో మార్పు కోసం నిరంతరం పాటుపడతాను. ఏటూరునాగారంలో గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దగా నిర్మించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా ఆయన కృషితో ఇక్కడ ఆర్డీవో కార్యాలయం వచ్చింది. దానిని త్వరగా ప్రారంభించేలా చూస్తాను. మా ప్రాంతంలో డెయిరీ, పౌల్ట్రీని ప్రోత్సహించాలి. ఇక్కడి యువతకు పోటీ పరీక్షలకు హాజరయ్యే విధంగా శిక్షణ ఇప్పించాలి. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తాను. చక్కటి పరిపాలనతో మా గ్రామాన్ని ఆదర్శంగా నిలబెడతానన్న నమ్మకం నాకుంది.
ఏటూరునాగారంలో 11,397 ఓట్లు ఉండగా.. 8,333 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీలత 5534 ఓట్లు సాధించగా, తన సమీప అభ్యర్థికి 2319 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 3,215 ఓట్ల భారీ మెజారిటీతో శ్రీలత గెలుపొందారు.
– నూక ప్రభాకర్, ఏటూరునాగారం